Big Stories

Golden Pattu Saree : సీతమ్మకు బంగారు పట్టుచీర.. ప్రత్యేక ఆకర్షణగా సీతారాముల ప్రతిమలు

Golden Pattu Saree for Bhadradri Sitamma : యావత్ దేశమంతా శ్రీరామనవమి వేడుకలకు సిద్ధమవుతోంది. సీతారాముల కల్యాణం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో జరిగే కల్యాణ వేడుకలు ఎంతో ప్రత్యేకం. ఈ ఏడాది కల్యాణానికి సీతమ్మ కోసం సిరిసిల్ల నేతన్న బంగారు పట్టుచీరను నేశాడు.

- Advertisement -

భద్రాద్రి సీతారాముల కళ్యాణానికి ప్రత్యేక పట్టుచీర సిద్ధమైంది. సీతమ్మవారికి సిరిసిల్లకు చెందిన వెల్ది హరిప్రసాద్ అబ్బురపరిచే.. అద్భుతమైన పట్టుచీరను తయారు చేశారు. బంగారు, వెండి, పట్టు దారాలతో ఈ చీరను తీర్చిదిద్దారు. ప్రతి సంవత్సరం సిరిసిల్ల నుంచి సీతమ్మవారికి పట్టు చీర పంపడం ఆనవాయితీ. అందులో భాగంగానే.. 4 రోజులు శ్రమించి అందమైన పట్టుచీరను హరిప్రసాద్ మగ్గంపై నేశారు.

- Advertisement -

Also Read : రామ నవమికి బాలరాముడి భక్తులకు మహా ప్రసాదం.. లక్ష మఠాడీల నైవేద్యం!

చీరపై సీతారాముల కళ్యాణాన్ని ప్రతిబింబించేలా ఉండే ప్రతిమలు, భద్రాద్రి ఆలయంలోని సీతారామ ప్రతిమల ప్రతిరూపాలు అంచులలో వచ్చే విధంగా నేశారు. చీర మొత్తం శంకు చక్ర నామాలు, చీర బార్డర్ లో జై శ్రీరామ్ నినాదాలు వచ్చేలాగా తయారు చేశారు. చీరకొంగులోని సీతారాముల కళ్యాణం బొమ్మ ప్రత్యేక ఆకర్షణగా రూపొందించారు. ఈ చీర మొత్తం బరువు 800 గ్రాములు ఉంటుంది. రెండు గ్రాముల బంగారం, 150 గ్రాముల వెండితో పాటు ప్రత్యేక పట్టు దారాలతో నేశారు. చీరను దేవాదాయ శాఖ మంత్రికి చూపించిన తర్వాత భద్రాద్రి సీతారాముల కళ్యాణానికి అందిస్తామని హరిప్రసాద్ చెప్పారు.

ఈ సందర్భంగా హరిప్రసాద్ మాట్లాడుతూ.. సీతమ్మవారికి తన స్వహస్తాలతో చీరను నేయడం ఎంతో ఆనందంగా ఉందన్నాడు. గతంలో అగ్గిపెట్టెలో పట్టేచీర, దబ్బలంలో దూరే చీరలను నేసినట్లు తెలిపాడు. అలాగే ఎంతోమంది నేతల ముఖ చిత్రాలను కూడా నేసినట్లు చెప్పాడు. జీ20 లోగోను కూడా నేసి ప్రధాని నరేంద్రమోదీ నుంచి అభినందనలు పొందానన్నాడు. ఈ ఏడాది అయోధ్య రాముల వారి ప్రాణప్రతిష్ట సందర్భంగా కూడా బంగారు పట్టుచీర నేసినట్లు వివరించాడు హరిప్రసాద్. గతేడాది సిరిసిల్ల గుర్తుగా పట్టు పీతాంబరం చీర నేసి భద్రాద్రి ఆలయానికి పంపామని, ప్రతిఏటా ఇక్కడి నుంచి సీతమ్మవారికి చీర పంపడం ఆనవాయితీగా వస్తుందని చెప్పాడు. ఈ ఏడాది కూడా అదే స్ఫూర్తితో చీర నేశానని, ప్రతిఏటా దేవాదాయశాఖ తనకు ఈ అవకాశాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News