Gurukul Teachers Protest in Hyderabad: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్ రెడ్డి నివాసం ముందు గురుకుల అభ్యర్థులు ఆందోళనకు దిగారు. గురుకుల నియామకాల్లో అవకతవకలు జరిగాయని, గురుకుల బోర్డు అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. కేవలం గురుకుల బోర్డు నిర్వాహకంతో మేమంతా నష్టపోయామని నిరసన వ్యక్తం చేశారు.
సీఎం రేవంత్ నివాసానికి పెద్ద సంఖ్యలో గురుకుల అభ్యర్థుల చేరుకున్నారు. తమకు న్యాయం చేసే వరకు ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదంటూ మోకాళ్లపై నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు నచ్చజెప్పిన ఫలితం రాలేదు.
రీలింక్విష్ మెంట్ ఇచ్చి బ్యాక్ లాగ్ లేకుండా అన్ని పోస్టులు భర్తీ చేయాలని కొంతకాలంగా కోరుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని వాపోయారు. కొంతమంది అభ్యర్థులు ‘సీఎం రావాలి.. న్యాయం చేయాలి’ అంటూ మోకాళ్లపై నిల్చుని నినాదాలు చేశారు.
Also Read: గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్.. నిధులు విడుదల చేస్తూ జీఓ
గురుకుల అభ్యర్థులకు సీఎం ఇంటి వద్ద ఆందోళన తెలిపేందుకు అనుమతి లేకపోవడంతో అక్కడి నుంచి పెద్దమ్మ గుడి వెళ్లి నిరసన చేపట్టారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ మేరకు గురుకుల అభ్యర్థులు సీఎం ఫ్లెక్సీకి వినతి పత్రం అందించారు.
మా ఉద్యోగాలు మాకు ఇప్పించాలని, గురుకుల బోర్డులో అవకతవకలు జరిగాయని పెద్దమ్మగుడి ముందు గురుకుల అభ్యర్థులు భిక్షాటన చేశారు. కొంతమంది మహిళా అభ్యర్థులు కొంగు పట్టి న్యాయం చేయాలని కోరారు.
ప్రభుత్వం విడుదల చేసిన 9,120 పోస్టులను డీసెండింగ్ ఆర్డర్‌లో భర్తీ చేయాలని గురుకుల అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. కాగా, మొత్తం 9,120 పోస్టుల్లో పీజీటీ 1,276, టీజీటీ 4,020, జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్ 2,876, టీజీటీ స్కూల్ లైబ్రెరియన్ 434, స్కూల్ ఫిజికల్ డైరెక్టర్275, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ 226, మ్యూజిక్ టీచర్ 124 పోస్టులు ఉన్నాయి.
ఆయా పోస్టులకు మొత్తం 6,52,414 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 4,93,727 మంది పరీక్షలకు హాజరయ్యారు. అయితే ఆయా పోస్టుల వారీగా ట్రిబ్.. 1:2 నిష్పత్తిలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపట్టింది.