పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్‌లో అసమ్మతి రాగాలు బయటపడుతున్నాయి. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్ దృష్టి సారించింది. లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్ల గెలుపే లక్ష్యంగా.. నియోజకవర్గాల వారిగా వ్యూహాలు రచిస్తోన్న వేళ.. అసమ్మతి రాగాలు వినిపిస్తున్నాయి.
శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి బీఆర్ఎస్ అధిష్టానంపై అలకబూనినట్టు తెలుస్తోంది. నల్గొండ పార్లమెంట్ నేతలతో అధిష్టానం నిర్వహించిన సమీక్షా సమావేశానికి గుత్తా దూరంగా ఉన్నారు. తన కుమారుడు అమిత్ రెడ్డికి నల్గొండ ఎంపీ టికెట్ ఇవ్వాలని గులాబి అధిష్టానం ముందు పెట్టారు. గతంలోనూ ఆయన ఈ విషయాన్ని బహిరంగంగానే ప్రస్తావించారు. టికెట్ ఇవ్వకపోతే పార్టీని వీడతానంటూ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ పొలిటికల్ సర్కిల్స్ లోనే ఈ వార్తలు వినిపిస్తున్నాయి.
దీంతో గుత్తా సుఖేందర్‌రెడ్డిని బుజ్జగించడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్ రావు రంగంలోకి దిగారు. వీరంతా సాయంత్రానికి గుత్తా ఇంటికి వెళ్లి మాట్లాడనున్నట్లు సమాచారం. కాగా.. ఇంతవరకూ నల్గొండ పార్లమెంట్ సన్నాహక సమావేశానికి తానెందుకు హాజరుకాలేదో గుత్తా ఇంతవరకూ వెల్లడించలేదు. నిజంగానే పార్టీపై అలిగారా ? లేక ఇతర కారణాలతో సమావేశానికి దూరంగా ఉన్నారా ? అన్నది తెలియాల్సి ఉంది.