Harish Rao on CM Revanth: సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డికి దేవుడిపై నమ్మకం ఉంటే.. కురుమూర్తి ఆలయానికి రావాలన్నారు. రెండు దశాబ్దాలుగా పాలమూరు ప్రాజెక్ట్‌కు మోసం చేశారని చెప్పారు. తడి బడి బట్టలతో తాను, రేవంత్ రెడ్డి గుడిలోకి వెళ్దాం.. టీడీపీ పదేళ్లు, కాంగ్రెస్ హయాంలో పదేళ్లపాటు.. ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని అన్నారు. అసలు రేవంత్ రెడ్డి మాటల్లో నిజాయితీ లేదని.. కొడంగల్‌లో ప్రశ్నించిన పాపానికి.. రైతులకు బేడీలు వేయించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని అన్నారు.
‘పాలమూరు జిల్లాలో కురుమూర్తి దేవుడు అందరికీ నమ్మకం. ఈ దేవుడు చాలా పవర్ ఫుల్. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ పక్కనే ఉంటది.. పోదామా మరీ కురుమూర్తి టెంపుల్‌కి.. రేవంత్ రెడ్డి నువ్వు రా తడబట్టలతోని.. నేను కూడా తడి బట్టలతో వస్తా.. ఎవరు నిర్లక్ష్యం చేశారు అనేది తెలుసుకుందాం’ అని హరీష్ రావు సవాల్ విసిరారు.
‘రెండు దశాబ్దాలు పాటు పాలమూరు ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసింది మీరు కాదా..? అప్పుడు రేవంత్ రెడ్డి ఉన్న టీడీపీ పదేళ్లు, ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పదేళ్లు కాదా నిర్లక్ష్యం చేసింది.. పాలమూరు ప్రాజెక్టులను మోసం చేసిందే మీరు.. 20 ఏళ్ల పాటు కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసింది మీరు కాదా..? 20 ఏళ్లలో మీరు నీరు ఇచ్చింది 26వేల ఎకరాలకు మాత్రమే. కానీ కేసీఆర్ సీఎం అయ్యాక నీటిపారుదల శాఖా మంత్రిగా నేను రాత్రి పూట ప్రాజెక్టుల వద్దే ఉండి.. రూ.4కోట్లు ఖర్చు పెట్టి రాత్రింబవళ్లు పని చేయించాం. 6.5లక్షల ఎకరాలకు పాలమూరు జిల్లాల్లో నీరు పారించింది కేసీఆర్ ప్రభుత్వం. ఇది నిజమా..? కాదా..? వెళ్దాం పదా కురుమూర్తి స్వామి టెంపుల్‌కి.. ఆ దేవుడి ముందు తడి బట్టలతో ప్రమాణం చేద్దాం’ అని హరీష్ రావు సవాల్ విసిరారు.
Also Read: Palla Rajeshwar Reddy: ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కాంగ్రెస్ శ్రేణులు కోడిగుడ్లతో దాడి..
అంతకుముందు.. నారాయణపేటలో సీఎం రేవంత్ రెడ్డి నాలుగు పథకాలను ప్రారంభించారు. సొంత నియోజకవర్గం కోడంగల్‌లోని కోస్గీ మండలం చంద్రవంచలో రేవంత్ రెడ్డి రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డు జారీ స్కీంలను సీఎం ప్రారంభించారు . ఈ సందర్భంగానే సీఎం రేవంత్ బీఆర్ఎస్ పార్టీపై సెన్సెషనల్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కుటుంబ పాలన నడిచిందని.. పాలమూరు జిల్లాలను, ప్రాజెక్టులను ఏమాత్రం పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి హరీష్ రావు, సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ చేశారు.