Harish Rao: ఖమ్మం రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ ముఖ్య నేత హరీశ్ రావు.. తాజాగా సంగారెడ్డి జైలు వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రిమాండ్‌లో ఉన్న పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్‌ను పరామర్శించిన అనంతరం ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ పర్యటనలో ఆయన ప్రధానంగా పోలీసుల తీరు, రైతుల ఇబ్బందులు , ప్రభుత్వం అనుసరిస్తున్న కక్షసాధింపు చర్యలపై గట్టిగా స్పందించారు.
అక్రమ అరెస్టులు, కక్షసాధింపు రాజకీయాలు
హరీశ్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి విమర్శించే గొంతులను అణచివేయడమే లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించారు. కేసీఆర్, బీఆర్ఎస్ నేతలపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేసిన క్రిశాంక్‌ను అరెస్ట్ చేయడం అన్యాయమని ఆయన మండిపడ్డారు. ‘దొంగలను వదిలేసి, ఫిర్యాదు చేసిన వ్యక్తినే జైలుకు పంపడం ఏ రకమైన ప్రజాస్వామ్యం?’ అని ఆయన ప్రశ్నించారు. అంగన్వాడీ ఫోన్ల కుంభకోణం, లీకేజీలు, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టినందుకే వరుసగా అక్రమ కేసులు బనాయిస్తున్నారని, ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపేనని స్పష్టం చేశారు.
పోలీసు అధికారులకు హెచ్చరిక
ప్రభుత్వ కనుసన్నల్లో పనిచేస్తున్న కొంతమంది ఐపీఎస్ అధికారుల తీరుపై హరీశ్ రావు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. బెంగళూరు నుంచి ప్రైవేట్ హ్యాకర్లను రప్పించి, కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా విపక్ష నేతల ఫోన్లు, ఇళ్ల ముందున్న సీసీ కెమెరాలను ట్యాపింగ్ చేస్తున్నారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్న అధికారులను భవిష్యత్తులో వదిలిపెట్టే ప్రసక్తే లేదని, వారు పదవీ విరమణ చేసినా సరే విచారణ జరిపిస్తామని హెచ్చరించారు. ఆ సమయంలో రేవంత్ రెడ్డి కూడా మిమ్మల్ని కాపాడలేరని, చట్టానికి లోబడి పనిచేయాలని అధికారులకు సూచించారు.
రైతుల కష్టాలు.. ప్రభుత్వ నిర్లక్ష్యం
రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం మొద్దునిద్ర పోతోందని హరీశ్ రావు విమర్శించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు లేక రైతులు వారాల తరబడి వేచి చూస్తున్నారని, శనగలు, మొక్కజొన్నలు కొనే నాథుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు కేవలం 26 క్వింటాళ్లు మాత్రమే కొంటామనే కొత్త షరతులు రైతులను ఇబ్బంది పెడుతున్నాయని పేర్కొన్నారు. అలాగే, సన్నవడ్లకు ఇస్తానన్న బోనస్ ఏమైందని డిమాండ్ చేస్తూ, తరుగు పేరుతో రైతులను దోచుకుంటున్నా ముఖ్యమంత్రి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
ప్యాలెస్ రాజకీయాలు వద్దు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల కష్టాలను పట్టించుకోకుండా, వందల కోట్లతో కొత్త ప్యాలెట్లు కట్టుకోవడంలో బిజీగా ఉన్నారని హరీశ్ రావు విమర్శించారు. ‘జూబ్లీహిల్స్ ప్యాలెస్ చాలదన్నట్టు, ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో కొత్త నిర్మాణాలు ఎందుకు?’ అని నిలదీశారు. ఐదేళ్ల పాలనలో సగం సమయం గడిచిపోయిందని, మిగిలిన కాలమైనా ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. క్రిశాంక్ ,ఇతర కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని, లేనిపక్షంలో ప్రజా పోరాటం తప్పదని ఆయన హెచ్చరించారు.
Also Read:బిడ్డ పెళ్లైన కొన్ని గంటలకే తండ్రి ఆత్మహత్య.. కారణం తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
సంగారెడ్డి జైలులో మన్నె క్రిశాంక్‌ను పరామర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు
కొంత మంది ఐపీఎస్ అధికారులు మా ఫోన్లు, ఇంటి ముందు ఉండే సీసీ కెమెరాలను హ్యాక్ చేస్తున్నారు: హరీష్ రావు
బెంగుళూరు నుంచి హ్యాకర్లను తీసుకొచ్చి కమాండ్ కంట్రోల్ రూమ్ లో వాళ్లను ఉంచి మా నాయకులపై నిఘా పెడుతున్నారు… pic.twitter.com/gccWj4KHQA
— BIG TV Breaking News (@bigtvtelugu) April 28, 2026