Harish Rao: జడ్చర్లలో జరిగిన బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు, SIR అవగాహన కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణలోని ప్రతి వర్గం మోసపోయిందని ఆయన ధ్వజమెత్తారు. ఈ విధంగా హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.
రైతులకు ‘వంచన’ సభలు
హైదరాబాద్‌లో కాంగ్రెస్ పెడుతున్నది ‘రైతు ఆశీర్వాద సభ’ కాదు, అది ‘రైతుల వంచన సభ’ అని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. యాసంగి, వానాకాలం రైతు బంధు నిధులను ఎగ్గొట్టి రూ.29,300 కోట్లు రైతులకు రేవంత్ రెడ్డి బాకీ పడ్డారని మండిపడ్డారు. రూ.2 లక్షల రుణమాఫీ దేవుడెరుగు, కనీసం లక్ష లోపు ఉన్నవాళ్లకు కూడా చేయలేదన్నారు. దేవుళ్ల మీద ఒట్టేసి మరీ రేవంత్ రెడ్డి రైతులను మోసం చేశారని, ఆ ‘ఒట్టు’ అనేదానికి ప్రాణం ఉంటే రేవంత్ అబద్ధాలకు అది ఎప్పుడో ఉరేసుకునేదని ఘాటుగా వ్యాఖ్యానించారు.
బోనస్ మోసాలు.. తరుగు నాటకాలు
ఎన్నికల ముందు అన్ని పంటలకూ బోనస్ అని చెప్పి, అధికారంలోకి వచ్చాక సన్న వడ్లకే అన్నారని, ఇప్పుడు కేవలం 7 రకాల వడ్లకే పరిమితం చేశారని విమర్శించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు ఇచ్చే బోనస్ రూ.3 వేల కోట్లు అయితే, ఎగ్గొట్టిన రైతు బంధు రూ.30 వేల కోట్లు అని లెక్కలు తేల్చారు. ‘తరుగు తీస్తే తోలు తీస్తా’ అన్న రేవంత్ రెడ్డి, ఇప్పుడు దళారులు, రైస్ మిల్లర్ల చేతిలో తోలుబొమ్మగా మారారని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తే, ఇప్పుడు 6 గంటలకే పరిమితం చేశారన్నారు. ఎల్‌ఐసీకి డబ్బులు కట్టకపోవడంతో 6 నెలలుగా ‘రైతు బీమా’ బంద్ అయిందని, 7,600 రైతు కుటుంబాలు ఎదురుచూస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: ఏఐ సమాధానాలు ఇస్తుంది.. కానీ సంస్కారాన్ని ఇవ్వలేదు.. నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు!
నీటి ప్రాజెక్టులపై నిర్లక్ష్యం
పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ద్వారా లక్షలాది ఎకరాలకు నీళ్లిచ్చి వలసలను ఆపిన ఘనత కేసీఆర్‌దేనని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఒక్క ఎకరాకైనా నీళ్లిచ్చారా అని ప్రశ్నించారు. తుంగభద్ర, కృష్ణ నదులపై ఏపీ, కర్ణాటకలు అక్రమంగా ప్రాజెక్టులు కడుతుంటే సీఎం నోరు విప్పడం లేదని, కేంద్రానికి సరెండర్ అయ్యారని ఆరోపించారు.
విద్యార్థులకు అన్యాయం.. బీఆర్ఎస్ విజయం ఖాయం
హైకోర్టు మొట్టికాయలు వేసినా ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులు ఇవ్వడం లేదని, పిల్లల చదువులు ఆగిపోతున్నాయని హరీశ్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. అందాల పోటీలకు, మూసీకి, ఫ్యూచర్ సిటీకి వందల కోట్లు ఉంటాయి కానీ, పేద పిల్లల చదువులకు, రూ.4000 పింఛన్లకు డబ్బులు ఉండవా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి జూట మాటలతో పాలమూరు పరువు తీస్తున్నారని, రాబోయే రోజుల్లో పాలమూరులోని 14 సీట్లకు 14 గెలిచి బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.