Harish Rao: రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం శాంతిభద్రతల పరిరక్షణలో పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు తీవ్రంగా విమర్శించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి హోంమంత్రిగా కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యారని ఆయన ధ్వజమెత్తారు. 2024 ఎన్‌సీఆర్‌బీ (NCRB) గణాంకాలు రాష్ట్రంలో నేరాల భయానక పరిస్థితిని కళ్లకు కడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోనే అత్యధిక సైబర్ నేరాలు నమోదవుతున్న రాష్ట్రంగా తెలంగాణ నిలవడం అత్యంత ఆందోళనకరమని పేర్కొన్నారు. గత ప్రభుత్వంతో పోలిస్తే సైబర్ నేరాలు 49 శాతం పెరగడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని మండిపడ్డారు.
తెలంగాణలో మిస్సింగ్ కేసుల సంఖ్య కూడా ఆందోళనకరంగా పెరిగిందని హరీశ్ రావు ఆరోపించారు. 2024 సంవత్సరంలో ఏకంగా 25,500 మంది అదృశ్యమయ్యారని వారిలో వేలాది మంది ఆచూకీ ఇప్పటికీ లభించలేదని వివరించారు. ప్రతి రోజూ సగటున ఆరుగురు చిన్నారులు మాయమవుతున్న పరిస్థితి రాష్ట్రాన్ని భయభ్రాంతులకు గురిచేస్తోందని అన్నారు. కిడ్నాప్‌లకు గురవుతున్న వారిలో అత్యధిక శాతం చిన్నారి బాలికలే ఉండటం ప్రభుత్వ వైఫల్యానికి పరాకాష్ట అని విమర్శించారు. మహిళల రక్షణ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితమైందని క్షేత్రస్థాయిలో నేరాలు 24,495కు పెరగడమే ఇందుకు సాక్ష్యమని తెలిపారు.
రాష్ట్రంలో జరుగుతున్న వరుస నేర ఘటనలు పోలీస్ వ్యవస్థ వైఫల్యాన్ని ఎత్తి చూపుతున్నాయని హరీశ్ రావు పేర్కొన్నారు. కరీంనగర్‌లో పట్టపగలు జరిగిన నగల దుకాణం దోపిడీ దొంగలను పట్టుకోవడంలో ప్రభుత్వం సాకులు వెతుకుతోందని ఎద్దేవా చేశారు. అందరూ చూస్తుండగానే ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలపై దాడులు జరగడం రాష్ట్రాన్ని అరాచకంలోకి నెట్టేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐఏఎస్ క్వార్టర్స్‌లో ఏకంగా ఒక ఐపీఎస్ అధికారి భార్య హత్యకు గురవ్వడం శాంతిభద్రతలు ఏ స్థాయిలో దిగజారాయో స్పష్టం చేస్తోందన్నారు. సిటీ పోలీస్ కమిషనర్ సుమతి గారు నిర్వహించిన ఆపరేషన్‌తో హైదరాబాద్‌లో మహిళల భద్రత డొల్లతనం బయటపడిందని గుర్తుచేశారు.
మానవ అక్రమ రవాణా కేసుల్లో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలవడం సిగ్గుచేటని హరీశ్ రావు విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో 1.65 లక్షలుగా ఉన్న నేరాల సంఖ్య ప్రస్తుతం 2.17 లక్షలకు చేరిందని గణాంకాలతో వివరించారు. రాష్ట్రంలో క్రైమ్ రేటు జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. ఎస్సీ ఎస్టీ వర్గాలపై దాడులు పెరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో క్లిష్టమైన కేసులను కూడా గంటల వ్యవధిలో ఛేదించేవారని కానీ ప్రస్తుతం నిందితులు యథేచ్ఛగా తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం కేవలం రాజకీయ కక్షసాధింపులు మీడియా మేనేజ్‌మెంట్‌పైనే దృష్టి పెట్టిందని ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించడం మర్చిపోయిందని హరీశ్ రావు విమర్శించారు. జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లు కమాండ్ కంట్రోల్ సెంటర్ల సమీక్షలు ఫోటోలకే పరిమితమయ్యాయని ఆరోపించారు. ఇంటెలిజెన్స్ వ్యవస్థను బలోపేతం చేయకుండా కేవలం ప్రచారం కోసం పాకులాడటం మానుకోవాలని సూచించారు. ఇప్పటికైనా ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించి సైబర్ నేరాలు మిస్సింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల భద్రతను రాజకీయ ప్రయోజనాల కోసం పణంగా పెట్టవద్దని హరీశ్ రావు హెచ్చరించారు.
Read Also: రూటు మార్చిన సీఎం.. కొడంగల్‌లో పక్కా లోకల్ స్పీచ్.. నో పాలిటిక్స్..!