Harish Rao: తెలంగాణలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ అస్తవ్యస్తంగా మారిందని.. రైతులు కల్లాల్లో కన్నీళ్లు పెట్టుకుంటున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కనీస కనికరం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మెదక్ జిల్లా చేగుంట మండలం కర్ణాల్పల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం ఆయన సందర్శించారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి.. మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డితో కలిసి వానలకు తడిసిన వడ్లను పరిశీలించిన ఆయన.. రోజుల తరబడి పడిగాపులు కాస్తున్న రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ నిర్లక్ష్యంపై హరీశ్ రావు నిప్పులు చెరిగారు.
కర్ణాల్పల్లి కేంద్రం ప్రారంభించి 25 రోజులు దాటినా ఇప్పటివరకు కేవలం రెండు లారీలు మాత్రమే రావడం ప్రభుత్వ వైఫల్యానికి అద్దం పడుతోందని హరీశ్ రావు విమర్శించారు. పది రోజులకు ఒక లారీ చొప్పున వస్తే రైతుల వడ్లు ఎప్పుడు కొనాలని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా ఏ గ్రామానికి వెళ్లినా రైతుల ఆవేదన వర్ణనాతీతంగా ఉందన్నారు. రేవంత్ రెడ్డికి ఢిల్లీకి వెళ్లి కప్పం కట్టడంపై ఉన్న శ్రద్ధ.. రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులపై లేదని ఆరోపించారు. మంత్రులు ఏసీ రూముల్లో కూర్చుని అబద్ధాలు చెబుతున్నారని.. పోలీసులను పక్కనపెట్టి ఒక్కసారి కొనుగోలు కేంద్రాలకు వస్తే వాస్తవాలు తెలుస్తాయని ఎద్దేవా చేశారు.
ప్రభుత్వ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. ఏకంగా అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు.. సర్పంచులే కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేస్తున్నారని హరీశ్ రావు గుర్తు చేశారు. సోషల్ మీడియాలో విమర్శలు చేసే ప్రతిపక్ష నేతలను అరెస్టు చేయడంలో ఉన్న ఉత్సాహం.. రైతుల బాధలను పరిష్కరించడంలో ఎందుకు లేదని నిలదీశారు. మక్కలు.. శనగలు.. పొద్దుతిరుగుడు (సన్‌ఫ్లవర్) అమ్మిన రైతులకు నెలలు గడుస్తున్నా ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని విమర్శించారు. జొన్నల కొనుగోలు కేంద్రాలు ఇంకా ప్రారంభం కాకపోవడం దారుణమన్నారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్‌లో జరిగిన అవినీతి వల్లే నేడు ఆ సంస్థ దివాలా తీసిందని.. బ్యాంకులు అప్పులు ఇవ్వని పరిస్థితి నెలకొందని ఆరోపించారు.
రేషన్ షాపుల్లో సుమారు రూ. 500 కోట్ల విలువైన దొడ్డు బియ్యం పురుగులు పట్టి ముక్కిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. చేగుంట మండలంలోని పది గ్రామాల్లో వడగండ్ల వాన వల్ల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని.. ప్రభుత్వం తక్షణమే స్పందించి లారీలను పంపి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతుల పక్షాన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. నాయకులంతా కలిసి కలెక్టరేట్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. వరుసగా మూడు సీజన్లలో రైతులు నష్టపోతుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవడం తగదని స్పష్టం చేశారు.
Read Also: మోదీ ముందు కంటతడి పెట్టిన బండి సంజయ్.. వేదికపై అసలేం జరిగింది?