Harish Rao: బీఆర్ఎస్ పార్టీ క్రమంగా డీలా పడుతుందా? గడిచిన రెండురోజులుగా తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. ఇలాంటి సమయంలో హరీష్‌రావు ఫారెన్ టూర్ వెళ్లడమేంటి? ముందుగా షెడ్యూల్ ఫిక్స్ చేయడమే కారణమా? రాజకీయాలను లైటుగా ఆయన తీసుకున్నారా? ఇదే చర్చ ఆ పార్టీలో జరుగుతోంది.
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి? కీలక నేతలపై వరుసగా కేసులు వెంటాడుతున్నాయి. కొందరు నేతలు వలస పోవాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఇప్పటికే రెండు జాతీయ పార్టీలతో పలువురు నేతలు మంతనాలు సాగిస్తున్నారు. ఈ వ్యవహారం ఓ వైపు జరుగుతుండగా కాళేశ్వరంలో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశించింది.
ఇదే సమయంలో కవిత వ్యవహారంతో ఉక్కిరి బిక్కిరి అయ్యింది ఆ పార్టీ. అసలు ఆ పార్టీలో ఏం జరుగుతుందో కొందరు నేతలకు అంతుబట్టడం లేదు. ఈ వ్యవహారాలు కొనసాగుతుండగా మాజీ మంత్రి హరీష్‌రావు సోమవారం ఫారెన్‌కి వెళ్లారు. కుమార్తెను కాలేజీలో చేర్పించేందుకు ఆయన యూకే వెళ్లారు. ఆయనకు లండన్ ఎయిర్‌పోర్టులో బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ నేతలు స్వాగతం పలికారు.
కూతురికి కాలేజీలో అడ్మిషన్ నేపథ్యంలో ముందుగా షెడ్యూల్ ఫిక్స్ చేశారని అంటున్నారు హరీష్‌రావు మద్దతుదారులు. అందుకే హరీష్ లండన్ వెళ్లారని అంటున్నారు. ఈ విషయంలో ఎవరు ఏమనుకున్నా పట్టించుకోవాల్సిన అవసరం లేదని అంటున్నారు.
ALSO READ: హరీష్‌రావుపై కవిత ఆరోపణలు.. కేటీఆర్ సంచలన ట్వీట్
మరోవైపు కాళేశ్వరం వ్యవహారంలో సీబీఐ విచారణ ఆపాలంటూ సోమవారం హైకోర్టులో హరీష్‌రావు పిటిషన్ దాఖలు చేశారు. మంగళవారం దానిపై విచారణ జరగనుంది. తీర్పు ఎలా ఉంటుందనేది వేరే విషయం. ఇంకోవైపు హరీష్‌రావుపై సీరియస్ ఆరోపణలు చేశారు కవిత.
దానికి ఆయన కనీసం నోరు మెదపలేదని అంటున్నారు. ఈ వ్యవహారంపై పార్టీ అధినేత చూసుకుంటారని ఆయన మద్దతుదారుల మాట. జరిగిన.. జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఆయన ఫారెన్‌కు వెళ్లినట్టు కొందరు చెబుతున్నారు. కవిత వ్యవహారం అధినేత వద్ద ఉంది.
పార్టీలో కీలక నేతలు ఇలాంటి సమయంలో సైలెంట్‌గా ఉంటే, తమ పరిస్థితి ఏంటని కొందరు నేతలు గుసగుసలు పెట్టేశారు. అధికార పార్టీ, కవితకు ధీటుగా బదులు ఇవ్వాల్సింది పోయి నాన్చుడి ధోరణి కరెక్టు కాదని ఆఫ్ ద రికార్డులో చర్చించుకుంటున్నారు. మొత్తానికి రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ లో ఇంకెన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.