Congress Show Cause : ఆయన కాంగ్రెస్ లో సీనియర్ నేత. ఒకవైపు మునుగోడు ఉపఎన్నిక మరోవైపు తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర. కానీ ఎక్కడా ఆ సీనియర్ నేత కన్పించలేదు. అతనే కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఇలాంటి కీలక సమయంలో ఆస్ట్రేలియాలో విహారయాత్ర చేశారు. మునుగోడు ఉపఎన్నికకు ఒకరోజు ముందు హైదరాబాద్ చేరుకున్నారు.
అంతకు ముందు ఏం జరిగింది?
మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి, తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓటేయాలని వెంకట్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలను కోరినట్లు సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్ అయింది. ఈ వ్యవహారంపై ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం వెంకట్ రెడ్డికి షోకాజ్ నోటీసు ఇచ్చింది. పార్టీ క్రమశిక్షణ నియమావళిని ఉల్లంఘించారని పేర్కొంటూ.. 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. బుధవారంతో ఆ గడువు ముగిసింది. ఇంతవరకు షోకాజ్ నోటీస్‌కు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమాధానం ఇవ్వలేదు. పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉన్నారు. ఆస్ట్రేలియా టూర్ వెళ్లి ఎంజాయ్ చేసి వచ్చారు.
కాంగ్రెస్ లో సీనియర్ నేతగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీకి తలనొప్పిగా మారారు. పార్టీ రాష్ట్ర నాయకత్వానికి సహకరించడంలేదు. పార్టీని పటిష్టం చేసేందుకు కృషి చేయాల్సిన సీనియర్ నేత ఇలా అనేక అంశాల్లో కాంగ్రెస్ కు ఇబ్బందులు కలిగిస్తున్నారు. ఆయన వ్యవహార శైలిపై పార్టీలో సీనియర్ నేతలు చాలామంది మండిపడుతున్నారు.