TS High Court on party defections(Today news in telangana): తెలంగాణ హైకోర్టులో ఈ రోజు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. బీఆర్ఎస్ టికెట్ పై గెలిచి కాంగ్రెస్‌లో చేరిన స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. గత సుప్రీంకోర్టు తీర్పును ఉటంకిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరఫు న్యాయవాదులు సుందరం, గండ్ర మోహన్ రావులు వాదనలు వినిపించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మూడు నెలల్లోపు స్పీకర్ అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని, కానీ, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాత్రం ఇప్పటికీ వేటు వేయలేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. తాము ఫిర్యాదు చేసినా స్పీకర్ స్వీకరించలేదని తెలిపారు. కాబట్టి, వెంటనే పార్టీ ఫిరాయించిన ఈ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేయాలని వారు హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు.
దానం, కడియం, తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ నాయకులు పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద్‌లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత వాళ్లు హైకోర్టును ఆశ్రయించి పిటిషన్ వేశారు. అసలు స్పీకర్ సమాధానం ఇవ్వకముందే వాళ్లు కోర్టును ఆశ్రయించడమేమిటని ఏజీ సుదర్శన్ రెడ్డి వాదించారు. స్పీకర్‌కు సమయం ఇవ్వొద్దా? అని అడిగారు. స్పీకర్ నిర్ణయం తీసుకునే కోర్టులు ఆదేశించే అధికారం లేదని వాదించారు. స్పీకర్ విషయంలో హైకోర్టు జోక్యం చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు.
Also Read: పారిస్ ఒలింపిక్స్, ఆసుపత్రి పాలైన వినేశ్, అనర్హతపై పీఎం మోదీ..
ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి బీఆర్ఎస్ శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్నదని బీఆర్ఎస్ ఆరోపణలు చేసింది. కాగా, కాంగ్రెస్ ఆ ఆరోపణలను ఖండించింది. తాము ఎవరినీ ప్రలోభ పెట్టడం లేదని, ఎవరికీ పిలుపు ఇవ్వడం లేదని స్పష్టం చేసింది. కానీ, తమ వద్దకు వచ్చిన వారిని మాత్రం పార్టీలో చేర్చుకుంటున్నామని పేర్కొంది.