CBI Enquiry: కాళేశ్వరం మొత్తం డీకోడింగ్ జరిగిపోయింది. పీసీ ఘోష్ పాలకు పాలు.. నీళ్లకు నీళ్లుగా తేల్చేశారు. కేసీఆర్ ఏకపక్ష నిర్ణయాలు.. ఏడాదిన్నరలోనే ఆగమాగం కట్టేయడం, క్యాబినెట్ అప్రూవల్స్ తీసుకోకపోవడం, వ్యక్తుల నిర్ణయాల ఆధారంగా పనులు చేయించడం.. ఒక్కటేమిటి కథలు కథలుగా కాళేశ్వరం గురించి రచ్చ జరుగుతోంది. అసెంబ్లీలో రిపోర్ట్ పెట్టడం, దానిపై గరంగరంగా చర్చ జరగడం, సీబీఐ ఎంక్వైరీకి సర్కార్ ఆదేశించడం చకచకా జరిగిపోయాయ్. మరి వాట్ నెక్ట్స్?
సీబీఐ విచారణ కుట్ర అంటున్న బీఆర్ఎస్
జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్ తేల్చిన విషయాల ఆధారంగా సీబీఐ విచారణ చేయడం ఖాయమైంది. తమ ఒత్తిడితోనే సీబీఐ ఎంక్వైరీకి వేశారని బీజేపీ అంటే.. నిన్నటిదాకా సీబీఐని విమర్శించి ఇప్పుడు అదే దర్యాప్తు సంస్థతో ఎంక్వైరీకి ఎలా ఆదేశిస్తారని బీఆర్ఎస్ అంటోంది. కాళేశ్వరాన్ని శాశ్వతంగా మూసేసే కుట్రగా చెబుతోంది. కుట్రలు అంటూనే ఎదుర్కొంటామంటున్నారు. ఇదీ ప్రెజెంట్ సీన్. కేసీఆర్ హయాంలోనే కట్టిన కాళేశ్వరం.. బీఆర్ఎస్ హయాంలోనే కూలింది. కాళేశ్వరంలో గుండెకాయ మాదిరిగా చెప్పే మేడిగడ్డ ఏడో బ్లాక్ లో పిల్లర్లు కుంగడంతో కేసీఆర్ ప్రతిష్ఠ మొదటికే మసకబారింది. ఆ వెంటనే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పలేదు. అప్పటిదాకా కాళేశ్వరం ఆహా ఓహో అనుకుంటూ వచ్చిన గులాబీ లీడర్లంతా కూలిన తర్వాత అంతా గప్ చుప్ అయిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో విచారణ కమిషన్ ను నియమించడం, 650 పేజీలతో ఆ కమిషన్ రిపోర్ట్ ఇవ్వడం జరిగిపోయాయి.
ఏడాదిలోనే బ్యారేజీలు కట్టడంతో క్వాలిటీ కాంప్రమైజ్
ఒక్కసారి పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ లో ఏముందో చూద్దాం. ఏడాదిలోనే బ్యారేజీలు కట్టడంతో మొత్తం కథ మారిపోయిందన్నది రిపోర్ట్. ఎందుకంటే అంత తక్కువ టైంలో బ్యారేజీల క్వాలిటీ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నది. పనుల పురోగతిని తెలుసుకునేందుకు ఈఎన్సీ, ఏజెన్సీల మధ్య నిర్వహించే మేనేజ్మెంట్ మీటింగ్స్ రికార్డులు కూడా అందుబాటులో లేవని, అప్పటి సీఎం కేసీఆర్, ఇరిగేషన్ శాఖ మంత్రి హరీశ్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారని, ఎక్స్పర్ట్ కమిటీ నివేదికను కాదని మేడిగడ్డకు లొకేషన్ మార్చారని, ప్లానింగ్, నిర్మాణం, ఆపరేషన్ల వరకు అడుగడుగునా కేసీఆర్ ప్రమేయం ఉందని, ప్రభుత్వ నిర్ణయాల కన్నా రాజకీయ జోక్యం ఎక్కువగా కనిపించిందని, కేబినెట్ ఆమోదాలే లేవని, అధికారులు అడుగడుగునా విధుల్లో నిర్లక్ష్యం వహించారని తేల్చేసింది. సో ఓవరాల్ గా జస్టిస్ పీసీ ఘోష్ అఫిడవిట్లు తీసుకుని క్రాస్ ఎగ్జామినేషన్ ద్వారా కథ మొత్తం రాబట్టింది. విచారణలో ఒకరిపై మరొకరు చెప్పుకోవడం, తమకు సంబంధం లేదంటే తమకు సంబంధం లేదని తప్పించుకునేలా జవాబులు ఇవ్వడాన్ని గుర్తించింది.
కేసు విచారణ సీబీఐకి అప్పగించడం కీలకం
రైట్ పీసీ ఘోష్ కమిషన్ పని ముగించింది. ఘోష్ కమిషన్ రిపోర్ట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టకుండా ఆపాలని కేసీఆర్ కోర్టుకు వెళ్లినా వర్కవుట్ కాలేదు. ఫైనల్ గా అసెంబ్లీలో పెట్టడం, వాడివేడిగా చర్చ జరగడం ఇవన్నీ జరిగిపోయాయి. ఫైనల్ గా ఎవరూ ఊహించని విధంగా సీఎం రేవంత్ రెడ్డి.. ఈ వ్యవహారంలో అసలైన వారిపై చర్యలు తీసుకునేలా సీబీఐ ఎంక్వైరీకి ఆదేశిస్తున్నట్లు అసెంబ్లీలో ప్రకటించడం సంచలనంగా మారింది. అయితే కాళేశ్వరం కుంగుబాటు చాలా సీరియస్ ఇష్యూ కావడంతో రాజకీయ ప్రేరేపితం అన్నట్లు ఉండకూడదన్న ఉద్దేశంతో సీబీసీఐడీ, సిట్, ఏసీబీ ఇలా రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న ఏజెన్సీలతో విచారణ జరిపించకుండా.. సీబీఐకి అప్పగించడం కీలకంగా మారింది. నిజానికి కాళేశ్వరం కూలడంపై త్వరగా చర్యలు తీసుకోవాలని బీజేపీ పదే పదే కామెంట్లు చేసింది. తప్పు చేసిన వారిని జైళ్లల్లో పెట్టాలన్నది. దీంతో రేవంత్ ప్రభుత్వం సీబీఐ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బంతి బీజేపీ కోర్టులో పడినట్లైంది. పైగా బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా ఉన్నారు. మరోవైపు తెలంగాణలోకి సీబీఐ ఎంట్రీకి కాంగ్రెస్ సర్కార్ ఓకే చెప్పింది. గత ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకుంది. సో అసలు గేమ్ ఇప్పుడే షురూ కాబోతోంది.
కాళేశ్వరం ఫైల్స్ కథ ఢిల్లీకి చేరింది. ఇప్పుడు సీబీఐ ఎంట్రీ ఇవ్వడం ఖాయమే. అయితే ఇక్కడే అసలైన పొలిటికల్ గేమ్ షురూ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అసలు నిన్నటిదాకా సీబీఐని విమర్శించి.. అదే సమయంలో సీబీఐ ఎంక్వైరీ ఏంటని బీఆర్ఎస్ క్వశ్చన్ చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టును శాశ్వతంగా మూసేయడం కోసమే సీబీఐ ఎంక్వైరీ వేశారంటున్నారు. దానికి దీనికి లింకేంటని కాంగ్రెస్ అంటోంది. మరోవైపు రేవంత్, బండి సంజయ్ కలిసి పని చేస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. సో తెలంగాణలో కాళేశ్వరం చుట్టూ తీన్మార్ పాలిటిక్స్ ఖాయమేనా? సీబీఐ ఎంట్రీ ఇచ్చాక 2020లో నమోదైన కేసే ఈ దర్యాప్తులో కీ రోల్ పోషిస్తుందంటున్నారు.
సీబీఐ దర్యాప్తు ఎలా జరగబోతోంది?
కాళేశ్వరం వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా చేసేది చేసింది. ఇక కథ మొత్తం సీబీఐ చేతిలో పెట్టబోతోంది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. దీంతో దర్యాప్తు ఎలా జరుగుతుంది.. రాజకీయ ఒత్తిళ్లు ఉంటాయా ఇలాంటివన్నీ కీలకంగా మారుతున్నాయి. ప్రస్తుతానికైతే కాంగ్రెస్ ప్రభుత్వం తన పని ముగించింది. పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం దర్యాప్తు చేసి ఎవరి పాత్ర ఎంతో సాక్ష్యాధారంగా నిరూపించాల్సిన బాధ్యత సీబీఐపై ఉంటుంది. అది ఎన్నాళ్ల పాటు జరుగుతుంది? ఎలా జరుగుతుందన్న విషయాలపై ఉత్కంఠ పెరుగుతోంది. నిజానికి ఈ కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించడానికి చాలా కారణాలే ఉన్నాయంటున్నారు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతులు, డీపీఆర్ సహా కీలక అంశాల్లో వాప్కోస్ సహా పలు కేంద్ర ప్రభుత్వ సంస్థల ప్రమేయం కూడా ఉంది. సో అటు కేంద్ర, ఇటు రాష్ట్ర ప్రభుత్వాల సంస్థలు ఉండడంతోనే ఈ కేసును సీబీఐకి అప్పగించామన్నారు. దీంతో పాటు నేషనల్ డామ్ సేఫ్టీ అథారిటీ, అలాగే ఘోష్ కమిషన్ రిపోర్ట్‌లు మరింత లోతైన దర్యాప్తు అవసరమని సూచించాయి. అందుకే మ్యాటర్ సీబీఐ చేతికి చేరిందంటున్నారు.
FIR రిజిస్టర్‌తో కేసు దర్యాప్తు మొదలు
తెలంగాణలో 2022లో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో సీబీఐ ఎంట్రీకి సంబంధించి సాధారణ సమ్మతిని రద్దు చేసింది. ప్రతి కేసుకు ప్రత్యేక అనుమతి తీసుకోవాలన్న రూల్ తీసుకొచ్చింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కాళేశ్వరం కేసు విషయంలో ఆ కన్సెంట్ తొలగించింది. సో ఫస్ట్ ఈ కాళేశ్వరం కేసును సీబీఐ టేకప్ చేసేముందు కేంద్ర హోంశాఖ నుంచి ఫార్మాలిటీగా అనుమతి తీసుకుంటుంది. ఆ తర్వాత FIR రిజిస్టర్ చేస్తుంది. దీంతో దర్యాప్తును అధికారికంగా ప్రారంభమవుతుంది. ఈ ఎఫ్‌ఐఆర్‌లో ఆరోపణలు, నిందితులు, సంబంధిత చట్టాలు అన్నీ మెన్షన్ చేస్తారు. కాళేశ్వరం కేసులో ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా నిర్లక్ష్యం, ఆర్థిక అవకతవకలు, ఫాక్ట్స్ దాచడం వంటి ఆరోపణలపై ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ అవడం ఖాయమే. ఇందుకోసం సీబీఐ ఒక ప్రత్యేక బృందాన్ని నియమిస్తుంది. డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ లేదా సీబీఐ ఎస్పీ నేతృత్వంలో ఉంటుంది.
డాక్యుమెంటరీ ఎవిడెన్స్, ఫిజికల్ ఇన్స్పెక్షన్
డాక్యుమెంటరీ ఎవిడెన్స్, ఫిజికల్ ఇన్స్పెక్షన్ చేయడంతో పాటు ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగస్వాములైన అధికారులు, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు, ఇతర వ్యక్తుల నుంచి వాంగ్మూలాలను సేకరిస్తుంది. 2020లో మహదేవపూర్ పోలీస్ స్టేషన్‌లో ఒక ఇంజనీర్ బ్యారేజీ నష్టం గురించి రిపోర్ట్ చేశారంటున్నారు. ఇది సీబీఐ దర్యాప్తులో కీలకంగా ఉపయోగపడే ఛాన్స్ ఉంది. సీబీఐ ఫోరెన్సిక్ ఆడిట్ కూడా నిర్వహిస్తుంది. టెక్నికల్ ఎవిడెన్స్ సేకరిస్తుంది. విచారణ పూర్తవడానికి ఎంత టైం పడుతుందన్నది కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. అయితే ప్రజల డబ్బును దోచుకున్నవారిని శిక్షించాలన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. కాళేశ్వరం విచారణను సీబీఐకి అప్పగించడంపై బీఆర్ఎస్ నిరసన వ్యక్తం చేస్తోంది. ఇదంతా కాళేశ్వరంపై కుట్రే అంటున్నారు కేటీఆర్. సీబీఐకి కాళేశ్వరం అప్పజెప్పడం అంటే పూర్తిగా ప్రాజెక్టును మూసేయడమే అన్న వాదన వినిపిస్తున్నారు. అంతే కాదు.. తెలంగాణ నదీ జలాలను పక్క రాష్ట్రాలకు తరలించి, కాళేశ్వరాన్ని ఎండబెట్టే ప్రయత్నంలో భాగమే అంటున్నారు. ఏ ఏజెన్సీకి కేసు ఇచ్చినా భయపడేది లేదంటూనే.. సీబీఐపై వ్యతిరేకంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఒక్కరోజులోనే మాట ఎందుకు మార్చారంటున్నారు. అటు ఫాంహౌజ్ లో సీబీఐ కేసు విషయంపై కేసీఆర్, కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు జరిపారు. ఇది ఘోష్ రిపోర్ట్ కాదు ట్రాష్ రిపోర్ట్ అంటూ కౌంటర్ చేస్తున్నారు.
Also Read: విషాదం.. విశాఖ ఫార్మా కంపెనీ డైరక్టర్ ఆత్మహత్య..
తమ ఒత్తిడితోనే కేసును సీబీఐకి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించిందని బీజేపీ నేతలు అంటున్నారు. రిపోర్ట్ చెత్తబుట్టలో వేసినప్పుడు భయపడాల్సిన పని ఏంటని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. ఇక బంతి బీజేపీ కోర్టులో ఉందంటున్నారు. తెల్లవారితే ట్వీట్ లు పెట్టే బండి సంజయ్ త్వరగా విచారణ జరిపించాలన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎంత తొందరగా నిర్ణయం తీసుకుంటే అంత మంచిదన్నారు. సిట్, ఏసీబీ, సిఐడి ఇస్తే కక్ష్య సాధింపు చర్యలు అనే అవకాశాన్ని ఇవ్వకుండా సీబీఐకి కేసు అప్పగించామంటున్నారు విప్ ఆది శ్రీనివాస్. గతంలో కాళేశ్వరం అవినీతికి సంబంధించి సీబీఐకి అప్పగించాలని బీజేపీ నేతలు చాలా సార్లు డిమాండ్ చేశారన్న విషయాన్ని గుర్తు చేశారు. అమిత్ షా, నడ్డా చాలాసార్లు కేసీఆర్ కుటుంబానికి కాళేశ్వరం ఏటీఎంగా మారిందని చెప్పారని, అందుకే రాష్ట్ర ప్రయోజనాల మేరకే సీబీఐకి అప్పగించామంటున్నారు. సో గేమ్ నెక్ట్స్ లెవెల్ కు వెళ్లిపోయింది. సీబీఐ తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చాక సీన్లు చాలా మారిపోనున్నాయి.
Story By Vidya Sagar, Bigtv