Jurala Project: జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద వస్తోంది. శుక్రవారం ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 1,15,000 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా….14 గేట్లు ఎత్తి 95,566 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అదేవిధంగా విద్యుత్ ఉత్పత్తికి 29,494 క్యూసెక్కులు, భీమా లిఫ్ట్-1కు 650, కోయిల్‌సాగర్‌కు 315, జూరాల ప్రధాన ఎడమ కాల్వకు 550, కుడి కాల్వకు 290, ఆర్డీఎస్ లింక్ కెనాల్‌కు 150, భీమా లిఫ్ట్-2కు 750, సమాంతర కాల్వకు 750 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు మొత్తం అవుట్‌ఫ్లో 1,25,219 క్యూసెక్కులు నమోదైంది. జూరాల పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 7.663 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
శ్రీశైలానికి లక్షకు పైగా ఇన్ ఫ్లో
శ్రీశైల జలాశయానికి వరద నీటి ప్రవాహం రోజురోజుకు పెరుగుతోంది. శుక్రవారం సాయంత్రానికి ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 1,09,777 క్యూసెక్కులు నమోదైంది. జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ 885 అడుగులు కాగా ప్రస్తుతం 876.30 అడుగులు ఉండగా పూర్తిస్థాయి నీటిసామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 169.86 టీఎంసీలు ఉన్నాయి. విద్యుత్ ఉత్పత్తి ద్వారా 56,998 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు.
కర్ణాటకలోని హోస్పేట్‌లోని తుంగభద్ర డ్యాంకు భారీగా వరద
కర్ణాటకలోని ఎగువ కురుస్తున్న వర్షాలకు కర్ణాటకలోని హోస్పేట్‌లోని తుంగభద్ర డ్యాంకు వరద భారీగా చేరుతోంది. దీంతో తుంగభద్ర డ్యాం 21 క్రస్ట్ గేట్లు 2.5 అడుగుల మేరకు ఎత్తి దిగువకు 63,229 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శుక్రవారం టీబీ డ్యాం ఇన్‌ఫ్లో 58,027 క్యూసెక్కులు ఉండగా, అవుట్‌ఫ్లో 65,616 క్యూసెక్కులు ఉంది.
Also Read: చెల్లితో ప్రేమ.. పార్టీకి అని పిలిచి ఎలా ప్లాన్ చేసి చంపేశారంటే!
టీబీ డ్యాంకు ఇన్‌ఫ్లో పెరిగితే మరిన్ని గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసే అవకాశం
105.788 టీఎంసీల సామర్థ్యం కలిగిన టీబీ డ్యాంలో ప్రస్తుతం 75.071 టీఎంసీల నీటి నిల్వ ఉండగా, 1633 అడుగుల నీటి మట్టానికి గానూ 1624.73 అడుగులు ఉన్నట్లు టీబీ డ్యాం సెక్షన్ అధికారి తెలిపారు. టీబీ డ్యాంకు ఇన్‌ఫ్లో పెరిగితే మరిన్ని గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉంది. టీబీ డ్యాం నుంచి విడుదలైన వరద ఆర్డీఎస్ ఆనకట్టకు చేరుకుని సుంకేసుల, శ్రీశైలం ప్రాజెక్టులకు వైపు అడుగులు వేస్తోంది. ఆర్డీఎస్ ఆనకట్టలో ప్రస్తుతం 10 అడుగుల మేర నీరు నిల్వ ఉంది.