Rain Alert: తెలంగాణ మొత్తం అతలాకుతలం అయింది. వర్షాకాలాన్ని మరిపించేలా కురిసిన వాన రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసింది. నిన్న మధ్యహ్నం మొదలైన వర్షం గ్యాప్ ఇవ్వకుండా దంచి కొడుతూనే ఉంది. ఉరుములు, మెరుపులు, పిడుగుపాట్లతో విరుచుకుపడి ఐదుగురిని పొట్టన పెట్టుకుంది. హైదరాబాద్‌లో జనజీవనం అస్తవ్యస్తమైంది. నగరంలో వర్షం లేని ప్రాంతం అనేదే లేదు. మహానగరంలోని రోడ్లు వాగులను తలించాయి. ఎక్కడిక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది.
ఖైరతాబాద్, ఆనందనగర్, దిల్‌సుఖ్‌నగర్, రామ్‌నగర్‌లలో పలుచోట్ల చెట్లు కూలాయి. కొన్ని చోట్ల వాహనాలపై కూడా చెట్లు కూలి పలువురుకి గాయాలు అయ్యాయి. చెట్ల కొమ్మలు విరిగి పడడంతో విద్యుత్తు స్తంభాలు దెబ్బతిన్నాయి. మలక్‌పేట్ ఆర్‌యూబీ నడుములోతు నీటితో నిండింది. పలు వాహనాలు వరదలో చిక్కుకున్నాయి. సికింద్రాబాద్ అడ్డగుట్ట బస్తీలో మురుగునీటి కాలువ నీరు ఇళ్లలోకి వచ్చి చేరింది. ఖైరతాబాద్ చౌరస్తా దగ్గర బుల్కాపూర్ నాలా రహదారిని ముంచేసింది.
వర్షం ధాటికి చార్మినార్ పైభాగంలో పెచ్చులూడాయి. భాగ్యలక్ష్మి ఆలయం వైపు మినార్ నుంచి కొంత భాగం నేలరాలింది. పెద్ద శబ్దంతో శిథిలాలు కిందపడ్డాయి. సమీపంలోని పర్యాటకులు భయంతో పరుగుతీశారు. నాలుగేళ్ల కిందట మరమ్మతులు చేపట్టిన ప్రాంతంలోనే మళ్లీ దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. హైదరాబాద్‌లో నిన్నరాత్రి వరకు 91 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గత పదేళ్లలో ఏప్రిల్ నెలలో కురిసిన రెండో అత్యధిక వర్షపాతంగా అధికారులు చెబుతున్నారు. 2015లో 105.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత నిన్న రాత్రి ఆ స్థాయిలో పడింది.
నిన్న కురిసిన వానకు పిడుగులు పడి, గోడలు కూలి ఐదుగురు చనిపోయారు. నాగర్‌కర్నూల్ జిల్లా పదర మండలం కోడోనిపల్లెలో పొలంలో పనిచేస్తున్న ఇద్దరు మహిళలు పిడుగుపాటుకు మృతి చెందారు. జోగులాంబ గద్వాల జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో పశువులను మేపడానికి వెళ్లి ఇద్దరు వ్యక్తులు పిడుగుపడి చనిపోయారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో గోడకూలి ఓ వ్యక్తి మృతి చెందారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలో పిడుగుపాటుకు 20 మేకలు మృతి చెందాయి. ఇక.. ఈ అకాల వర్షం మామిడి రైతుకు కడుపు కోత మిగిల్చింది. యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజిగిరి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో మామిడి తోటల్లో పెద్ద ఎత్తున కాయలు నేలరాలాయి. ఆకు కూరల తోటలకూ నష్టం వాటిల్లింది. నిజామాబాద్ జిల్లా ఇందల్‌వాయి, సిరికొండ, డిచ్‌పల్లి మండలాల్లో ధాన్యం తడిసి ముద్దయింది.
Also Read: బీఆర్ఎస్ హయాంలో 4,28,437 ఎకరాల అటవీ భూమి మాయం, అప్పుడు కళ్లు మూసుకున్నారా?
ఇవాళ, రేపు, ఎల్లుండి కూడా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ తెలిపింది. ఉష్ణోగ్రతలు 4 డిగ్రీల వరకు తగ్గే అవకాశాలు ఉన్నాయి. నిన్న కుండపోత వానలు, మరో మూడు రోజుల వర్ష సూచనతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించారు. అన్ని శాఖలు సమన్వయంగా పనిచేయాలని అన్నారు. రోడ్లపై నీటి నిల్వలు లేకుండా ట్రాఫిక్ సమస్య, విద్యుత్ అంతరాయాలు లేకుండా చూడాలని జీహెచ్‌ఎంసీ, పోలీస్, హైడ్రా విభాగాలను ఆదేశించారు.