Weather Update: రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజుల నుంచి వర్షాలు అంతగా కొట్టడం లేదు. కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. ఈసారి వర్షాలు సమృద్దిగా కురుస్తాయని రైతులు ముందస్తుగానే వ్యవసాయ పనులు మొదలుపెట్టారు. మే నెల చివరి వారంలోనే పత్తి గింజలు, నార్లు పోశారు. అయితే ఆ తర్వాత రెండు వారాల నుంచి వర్షాలు పడకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో వరుణ దేవుడి వైపు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఎప్పుడెప్పుడు వర్షాలు పడుతాయా? అని ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది
పిడుగులు పడే ఛాన్స్..?
ఈ క్రమంలోనే హైదరాబాద్ వాతావరణ శాఖ రాష్ట్ర ప్రజలకు కీలక అప్డేట్ ఇచ్చింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వివరించింది. ఈ రోజు రాత్రి ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. కొన్నిచోట్ల 30 -40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్రంలో అక్కడక్కడ పిడుగులు పడే ఛాన్స్ కూడా ఉందని వివరించారు.
ALSO READ: SSC Jobs: ఇంటర్ అర్హతతో ఎస్ఎస్‌సీలో ఉద్యోగాలు.. ఇంకా 4 రోజులే గడువు
రేపు, ఎల్లుండి ఈ జిల్లాల్లో భారీ వర్షం
రేపు మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడే ఛాన్స్ ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. జూన్ 24న రాష్ట్రంలోతేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అవకాశం ఉందని చెప్పారు. 30 నుంచి 40 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు.
ఏపీలో కూడా..?
ఈ క్రమంలోనే.. ఏపీకి తేలికపాటి వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ రోజు రాత్రి శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరిలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు. విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వివరించారు.
జాగ్రత్త..
అయితే.. ఉరుములు, పిడుగుల వర్షం ఉన్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. పొలాల వద్ద ఉన్నప్పుడు చెట్ల కింద నిలబడొద్దని సూచిస్తున్నారు. చెట్ల మీద పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. రాబోయే ఈ రెండు రోజులు అత్యవసరం అయితే తప్ప పొలాల వద్దకు రైతులు వెళ్లొద్దని అధికారులు సూచించారు.