Rain Alert In Telangana: తెలంగాణకు మరోసారి రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణశాఖ. మరో ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు పడే చాన్స్ ఉందని తెలిపింది. ఇవాళ, రేపు 16 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్మల్కాజిగిరి జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలిసింది. ఇటు వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు పడతాయి.
గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, పలుచోట్ల వడగండ్లు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. అయితే, వర్షాలు పడినా టెంపరేచర్లు కూడా అంతే పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రాబోయే మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే ప్రమాదం ఉందని తెలిపింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉంటుందని పేర్కొంది. ఆదిలాబాద్, కుమ్రంభీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్జిల్లాలకు ఆరెంజ్అలర్ట్ జారీ చేసింది.
ఇవాళ ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు, రెండు మూడు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, రాయలసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొన్నిచోట్ల ఎండలు, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలకు అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు.
కాగా హైదరాబాద్ నగరాన్ని వర్షం ముంచెత్తింది. పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షాపాతం నమోదైంది. బండ్లగూడలో 8 సెంటీమీటర్ల వర్షాపాతం రికార్డయ్యింది. చార్మినార్‌లో 7.6, బహదూర్‌పూరలో 7.8 సెంటీమీటర్లు, నాంపల్లిలో 6.9, అంబర్‌పేటలో 5, బండ్లగూడలో 4.6, కుత్బుల్లాపూర్‌లో 4.3, ఖైరతాబాద్‌లో 3.5, సికింద్రాబాద్‌లో 3.4, హిమాయత్‌నగర్‌లో 3, బాలానగర్‌లో 3 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. శేరిలింగంపల్లి, అమీర్‌పేట, పాటిగడ్డ, ముషిరాబాద్, ఖైరతాబాద్, రాజేంద్రనగర్, సరూర్‌నగర్, హయత్‌నగర్, అసిఫ్‌నగర్‌తో పాటు నగరవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఒకటి నుంచి మూడు సెంటీమీటర్ల వరకు వర్షాపాతం నమోదైంది.
Also Read: జపాన్‌లో తెలంగాణ రైజింగ్.. రూ.10వేల కోట్ల పెట్టుబడులు..
పలుచోట్ల ఈదురుగాలులతో చిన్నగా మొదలైన వాన.. తర్వాత నగరవ్యాప్తంగా విస్తరించింది. వర్షానికి తోడు భారీగా ఈదురుగాలులు వీశాయి. దాంతో పలుచోట్ల చెట్లు నేలకూలాయి. పలుచోట్ల కొమ్మలు నేలవాలాయి. రహదారులు కొద్ది క్షణాల్లోనే చెరువులను తలపించాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. తూర్పు, మధ్య తెలంగాణ అల్పపీడన ద్రోణి ప్రభావంతో పాటు క్యూములోనింబస్ మేఘాలతో దాదాపు రెండుగంటల పాటు వర్షం బీభత్సం సృష్టించింది. వర్షానికి నగరంలో పలుచోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.