TG High Court: హైదరాబాద్ రామంతాపూర్‌లో శ్రీకృష్ణుడి శోభాయాత్ర సందర్భంగా విద్యుదాఘాతంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఇదే సమయంలో పాతబస్తీలో మరో నలుగురు మృతి చెందడం ఆందోళన కలిగించింది. ఈ విషాదకర సంఘటనల నేపథ్యంలో విద్యుత్ స్తంభాలపై ప్రమాదకరంగా ఉన్న కేబుల్ వైర్లను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ భారతి ఎయిర్‌టెల్ లంచ్‌మోషన్ పిటిషన్ హైకోర్టులో దాఖలు చేసింది. జస్టిస్ నగేశ్ భీమపాక ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టారు.
పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్. రవి వాదనలు వినిపించారు. ఆయన మాట్లాడుతూ, కేబుల్ వైర్ల కోసం ముందే అన్ని అనుమతులు తీసుకున్నామని, రూ.21 కోట్లు చెల్లించామని గుర్తు చేశారు. ప్రభుత్వం తొలగించాలని నిర్ణయం తీసుకున్నా ముందుగా నోటీసులు ఇవ్వాలని, కానీ ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే కేబుల్‌లను కట్ చేయడం సరికాదని వాదించారు. అంతేకాకుండా, గృహాలకు కేబుల్ తీసుకున్న వారు కూడా విద్యుత్ స్తంభాలను వినియోగిస్తున్నారని, ఆ బాధ్యత మొత్తాన్ని తమ కంపెనీపై మోపడం తగదని తెలిపారు. అకస్మాత్తుగా ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడం వలన వైద్యులు, న్యాయవాదులు, ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని న్యాయస్థాన దృష్టికి తీసుకువచ్చారు.
Also Read: Building in Visakha: విశాఖలో పక్కకు ఒరిగిన ఐదు అంతస్తుల భవనం.. జనాలు పరుగులు
దీనికి ప్రతిగా టీజీఎస్పీడీసీఎల్, ప్రభుత్వం తరఫు న్యాయవాదులు మాట్లాడుతూ, విద్యుత్ స్తంభాలపై పరిమితికి మించి కేబుళ్లు ఏర్పాటు చేయడం వలనే ప్రమాదాలు జరుగుతున్నాయని వాదించారు. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడల్లా కంపెనీలు పిటిషన్లు వేసి తరువాత ఉపసంహరించుకుంటున్న ఉదాహరణలు కూడా ఇచ్చారు. వాదనలు విన్న న్యాయమూర్తి, ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేశారు. కేబుల్ తొలగింపుపై లిఖితపూర్వక వాదనలు సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను రేపు వాయిదా వేశారు.
అప్పటివరకు కేబుళ్లను తొలగించకూడదని టీజీఎస్పీడీసీఎల్‌కు సూచించారు. మొత్తానికి, శోభాయాత్ర విషాదంతో రాష్ట్రంలో కేబుల్ వైర్ల భద్రత, అనుమతులపై చర్చ ముదిరింది. ప్రభుత్వం, కంపెనీలు, ప్రజా సంస్థలు, న్యాయస్థానం అందరూ ఒకేసారి ఇందులోకి జోక్యం చేసుకోవడంతో ఈ వ్యవహారం మరింత కీలక మలుపు తిరిగే అవకాశం ఉంది.