Big Stories

Delhi Liqour Scam : కవిత విచారణ ఎలా జరుగుతోంది..? ఆ ఫోనే కీలకమా..?

Delhi Liqour Scam : ఢిల్లీ లిక్కర్‌ పాలసీ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇవ్వగానే సీఎం కేసీఆర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. అసలు నోటీసులు వస్తాయని ముందే అంచనా వేసి అందుకనుగణంగానే కవిత సిద్ధమయ్యారని జరుగుతున్న పరిణామాలను బట్టి తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 10న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కవిత మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం దీక్ష చేపట్టారు. తాను విచారణను ధైర్యంగా ఎదుర్కొంటానని చెప్పినట్లుగా ఢిల్లీలో ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈడీ జాయింట్‌ డైరెక్టర్‌ నేతృత్వంలోని బృందం ఆమెను ప్రశ్నిస్తోంది. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్ లో సౌత్‌ గ్రూప్‌ పాత్రపై విచారణ జరుగుతోంది. అరుణ్ రామచంద్ర‌ పిళ్లై రిమాండ్‌ రిపోర్టు, ఆడిటర్‌ బుచ్చిబాబు వాట్సాప్‌ చాట్‌ ఆధారంగా కవితను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

- Advertisement -

లిక్కర్‌ స్కామ్ లో కవిత పాత్ర, నిందితులతో ఉన్న సంబంధాలు, ఇండో స్పిరిట్స్‌ కంపెనీలో వాటాలు, రూ.100 కోట్ల ముడుపుల వ్యవహారంపై ఈడీ ప్రశ్నిస్తోందని తెలుస్తోంది. ఇప్పటి వరకు లిక్కర్‌ స్కామ్ లో కవిత పాత్రపై సేకరించిన ఆధారాలు, సాక్ష్యాలతో విచారణ కొనసాగుతోందని సమాచారం. మౌఖికంగా, లిఖితపూర్వకంగా కవిత స్టేట్‌మెంట్‌ను ఈడీ అధికారులు రికార్డు చేస్తున్నారు. రామచంద్ర పిళ్లైతోపాటే కవితను విచారిస్తున్నారు. ప్రస్తుతం వాడుతున్న ఫోన్ అప్పగించాలని కవితను ఈడీ అధికారులు ఆదేశించారు. దీంతో బయటకు వచ్చి సెక్యూరిటీ సిబ్బందితో తన ఫోన్ ను కవిత తెప్పించారు. ఆ ఫోన్ ను ఈడీ అధికారులు అప్పగించారు.

- Advertisement -

కవిత విచారణ నేపథ్యంలోనే బీఆర్ఎస్ కీలక నేతలు ఢిల్లీలోనే ఉన్నారు. అటు ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలపై సీఎం కేసీఆర్‌ ఆరా తీస్తున్నారు. ఎప్పటికప్పుడు మంత్రులు కేటీఆర్‌, హరీష్‌రావును వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఇటు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఢిల్లీ, హైదరాబాద్ లో నిరసనలతో హోరెత్తించారు. బండి సంజయ్ మూడు రోజుల క్రితం కవితను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై నిరసనలకు దిగారు. బండి సంజయ్ పై రాష్ట్ర మహిళా కమిషన్ యాక్షన్ మొదలుపెట్టింది. ఈ వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించి నోటీసులు ఇచ్చింది. అటు గవర్నర్ తమిళిసైను బీఆర్ఎస్ నేతలు టార్గెట్ చేశారు. రాష్ట్రంలో చీమ చిటుక్కుమంటే స్పందించే గవర్నర్‌ ఏం చేస్తున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ ప్రశ్నించారు. బండి సంజయ్‌ వ్యాఖ్యలపై గవర్నర్‌ ఉద్దేశం ఏంటో చెప్పాలన్నారు.

కేసీఆర్‌ కుటుంబమే లక్ష్యంగా కేంద్రం దాడులు చేస్తోందని తెలంగాణ మంత్రులు మండిపడ్డారు. బీజేపీని జనం నమ్మే పరిస్థితి లేదన్నారు. మోదీకి జై కొడితే ఎలాంటి నోటీసులు ఉండవని వ్యతిరేకిస్తే నోటీసులు ఇస్తారని ఆరోపించారు. అటు బీజేపీ వ్యతిరేక పార్టీలు కేంద్రంపై మండిపడ్డాయి. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కవిత విచారణపై స్పందించారు. కేసీఆర్‌ కుటుంబాన్ని బీజేపీ టార్గెట్‌ చేసిందని ఆరోపించారు. ఇలా కేంద్రం తమను టార్గెట్ చేస్తుందనే విధంగా రాజకీయ కార్యక్రమాలను బీఆర్ఎస్ చేపట్టింది.

FOR MORE UPDATES PLEASE FOLLOW : https://bigtvlive.com/telangana

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News