Milk Adulteration: స్వేచ్ఛ బ్యూరో: హుజూరాబాద్ పట్టణ శివారులోని సైదాపూర్ రోడ్డు ఇప్పుడు ఒక మర్మమైన ‘పాల మాయాజాలానికి’ అడ్డాగా మారింది. స్వచ్ఛమైన పాల పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఒక ప్రైవేట్ డైరీ వ్యవహారం ఇప్పుడు పట్టణంలో కలకలం రేపుతోంది. సింగపూర్ ఎరుకలగూడెం జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఈ డైరీలో జరుగుతున్న ‘తెల్లటి వ్యాపారం’ వెనుక ఎన్నో ‘నల్లటి నిజాలు’ దాగి ఉన్నాయని వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు.
సాధారణంగా పాలు పల్చగా ఉన్నాయంటే కల్తీ అని అనుమానిస్తాం. కానీ ఈ డైరీ నిర్వాహకులు ప్రజల బలహీనతను ఆసరాగా చేసుకుని ‘అతి చిక్కదనాన్ని’ ఎరగా వేస్తున్నారు. పాలు ఎంతో చిక్కగా ఉన్నాయని ప్రజలు ఎగబడి మరీ కొనుగోలు చేస్తున్నారు. అయితే, ఇంత చిక్కదనం పశువుల నుంచి వస్తోందా? లేక పాల పొడి, యూరియా, కాస్టిక్ సోడాల మిశ్రమంతో సృష్టించబడుతోందా? అనే కోణంలో లోతైన విచారణ జరగాలని పట్టణ వాసులు కోరుతున్నారు.
సాధారణంగా పెరుగు తోడేస్తే సహజమైన పులుపు ఉండాలి. కానీ ఈ డైరీలో లభించే పెరుగు వింతగా ‘తీయగా’ ఉండటం గమనార్హం. రుచి బాగుందని జనం తెగ తింటున్నారు కానీ, అది తిన్న కొద్దిసేపటికే విపరీతమైన మత్తులోకి, నిద్రలోకి జారుకుంటున్నట్లు బాధితులు వాపోతున్నారు. శరీరంలో మందకొడితనం పెరగడం, మత్తుగా అనిపించడం వెనుక ఏదో ప్రమాదకర కెమికల్ హస్తం ఉందని స్థానికులు అనుమానిస్తున్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరాజమహేంద్రవరం పరిసరాల్లో కల్తీ పాల వల్ల ప్రజలు అస్వస్థతకు గురైన ఘటనలను ఇక్కడ గుర్తు చేసుకుంటున్నారు.
Also Read: పోలీసులకే సవాల్.. అందరూ చూస్తుండగానే బ్యాంకును ఊడ్చేశారు!
డైరీలో ఉన్న పశువుల సంఖ్యను చూస్తే అతి తక్కువగా ఉన్నాయి. కానీ ప్రతిరోజూ పూటకు 250 లీటర్ల చొప్పున, రెండు పూటలకు కలిపి 500 లీటర్ల పాలు ఏ విధంగా విక్రయానికి వస్తున్నాయన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. అధికారులు ముందస్తు సమాచారం లేకుండా డైరీపై ఆకస్మిక దాడులు నిర్వహించాలని, పాలిచ్చే గేదెలు ఎన్ని? అవి ఇచ్చే దిగుబడి ఎంత? అనేది అధికారుల సమక్షంలోనే రికార్డు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఈ డైరీ నిర్వహణ అత్యంత రహస్యంగా, ఎత్తైన గోడల మధ్య సాగుతోంది. గేట్లకు ఎప్పుడూ తాళాలు వేసి ఉండటం, లోపల పనిచేసే ఇతర రాష్ట్రాల కూలీలను బయటి వారితో మాట్లాడనివ్వకపోవడం వెనుక పెద్ద ‘గుట్టు’ ఉందని తెలుస్తోంది. ఆ కూలీలను విడివిడిగా విచారిస్తే అక్కడ జరుగుతున్న రసాయన మాయాజాలం బయటపడుతుందని పట్టణ ప్రజలు నినదిస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి, పాలు మరియు పెరుగు శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించి, రిపోర్టు వచ్చాకే అమ్మకాలు జరిపేలా కఠిన చర్యలు తీసుకోవాలని హుజూరాబాద్ ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు.
Also Read: స్వేచ్ఛ ఎఫెక్ట్.. మేడ్చల్‌లో స్పందించిన అధికారులు