MLA Koushik Reddy: స్వేచ్ఛ బ్యూరో: నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం స్థానిక సిటీ సెంటర్ హాల్‌లో నిర్వహించిన ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక – 90 రోజుల’ సమీక్షా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు పెండింగ్ పనులు, సంక్షేమ పథకాల అమలుపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు వెంటనే కేటాయించాలని, ఈ ఎంపిక ప్రక్రియలో స్థానిక ఎమ్మెల్యేగా తనను భాగస్వామ్యం చేయాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరత తీవ్రంగా ఉందని, కనీస వసతులు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
మిషన్ భగీరథ అమృత్ పథకం కింద మంజూరైన రూ. 33 కోట్ల నిధులతో పనులను ఆలస్యం చేయకుండా, ఎమ్మెల్యే ప్రతినిధులతో సమన్వయం చేసుకుని వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. హుజురాబాద్ క్యాంప్ RTO కార్యాలయం, MJP పాఠశాలలకు నీటి కనెక్షన్, మోరి సౌకర్యం కల్పించాలని సూచించారు. వీణవంక మండలంలోని మామిడాలపల్లి–కోర్కల్, నాగంపేట్, బూజునూర్ రోడ్ల మరమ్మతులు, కమలాపూర్ బస్టాండ్ మిగిలిన పనులను తక్షణమే పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఇల్లంతకుంటలో మక్కల కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి రైతులను ఆదుకోవాలని, రేణుక ఎల్లమ్మ ఆలయం వద్ద శిలాఫలకం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే, హుజురాబాద్‌లో ప్రతిపాదిత డంపింగ్ యార్డ్‌ను రద్దు చేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.
Also read: ఢిల్లీలో విషాదం.. బాత్రూంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న కోర్టు జడ్జి
ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలను క్షేత్రస్థాయిలో వెంటనే అమలు చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, యువ వికాసం, చేయూత పింఛన్ల ద్వారా లబ్ధిదారులకు న్యాయం చేయాలన్నారు. “ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ఆలస్యాన్ని అస్సలు సహించం” అని అధికారులను హెచ్చరించారు. అనంతరం పలువురు లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందజేశారు. నేతన్న భద్రత పథకం కింద 5 కుటుంబాలకు రూ. 25 లక్షలు, ఆర్థిక పునరావాస పథకం కింద రూ. 1.50 లక్షల చెక్కులతో పాటు, ఏడుగురు అనాథ పిల్లలకు అనాథ సర్టిఫికెట్లను స్వయంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో, ఎంపీడీవోలు, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.
Also read: ఛత్తీస్‌గఢ్‌లో ఐఈడీ పేలుడులో నలుగురు జవాన్ల మృతి