Hyderabad News: సంక్రాంతి సంబరాల సంగతి ఏమో కానీ, పతంగులు ఎగురు వేసేందుకు వాడే చైనా మాంజాలతో కు జరిగే ప్రమాదాలను నివారించేందుకు పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. హైదరాబాద్ నగరంలో జరిగిన ఘటనల నేపథ్యంలో పోలీసులు ముందస్తుగా జాగ్రత్త చర్యలు తీసుకున్నారనే చెప్పవచ్చు. ఈ సంక్రాంతికి అటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు సీరియస్ గా చైనా మాంజాలను అరికట్టేందుకు స్పీడ్ పెంచారు.
హైదరాబాద్ నగరంలో ఎక్కువగా చైనా మాంజాలను వినియోగించకుండా సంక్రాంతి ముందునుండే పోలీసులు పలుమార్లు హెచ్చరికలు సైతం జారీ చేశారు. ఆకస్మిక తనిఖీలు నిర్వహించడంతో పాటు అమ్మకాలపై కూడా పోలీసులు ఫోకస్ పెట్టారు. తాజాగా హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ శ్రీనివాసరావు చైనా మాంజాల విక్రయాలపై మీడియా సమావేశాన్ని నిర్వహించారు.
డీసీపీ మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరంలోని ఏడు జోన్ల పరిధిలో చైనా మాంజాల వినియోగానికి సంబంధించి 107 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అలాగే విక్రయాలు సాగిస్తున్న 148 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. అంతేకాకుండా 7334 బాబిన్స్ చైనా మాంజాలను సీజ్ చేసి, సుమారుగా 90 లక్షల విలువగల మాంజాలను సీజ్ చేశామన్నారు.
కొద్ది రోజులుగా నగరంలో తనిఖీలు చేసి వీటి విక్రయాల నిషేధం పై పురోగతి సాధించినట్లు డీసీపీ తెలిపారు. చైనా మాంజాలను అమ్మినా, కొనుగోలు చేసినా వారి సమాచారాన్ని టాస్క్ ఫోర్స్ లా అండ్ ఆర్డర్ పోలీసులకు ఇవ్వాలని, మన సరదా పతంగులాట ఇతరుల ప్రాణాలను తీస్తుందంటూ డీసీపీ హెచ్చరించారు. ఈ కేసులలో పట్టుబడిన వారిపై అనిమల్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు డీసీపీ శ్రీనివాసరావు తెలిపారు. హైదరాబాద్ నగరంలో పతంగులను ఎగురవేసేవారు విషయాన్ని గమనించి పోలీస్ శాఖ సహకరించాలని ఆయన కోరారు.
కాగా నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లిలో చైనా మాంజా తగిలి బాలుడి గొంతు కు తీవ్ర గాయాలైన ఘటన సోమవారం జరిగింది. గాలిపటం నుండి తెగివచ్చిన దారం, ఆరుబయట ఆడుకుంటున్న బాలుడు గొంతుకు తగలడంతో తీవ్ర గాయమైనట్లు తెలుస్తోంది. వెంటనే స్థానికులు బాలుడిని ప్రవేటు వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.