Hyderabad Alert: శివరాత్రి దాటితే చాలు, శివ శివా అంటూ చలిగాలులు పారిపోతాయి అంటారు పెద్దలు. కానీ కలియుగంలో అంతా వ్యతిరేకమే జరుగుతోంది. శివరాత్రికి ముందుగానే చలి పోయింది.. సమ్మర్ వచ్చింది. సమ్మర్ సీజన్ కు ముందుగానే వచ్చిన ఎండలతో ప్రజల బేజారు అంతా ఇంతా కాదు. ఇలాంటి సమయంలోనే తెలంగాణ వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. ప్రధానంగా తెలంగాణ ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రకటన చేయడం విశేషం.
ఏపీ కంటే తెలంగాణలో ఎండలు దంచేస్తున్నాయి. సమ్మర్ సీజన్ కు ముందే ఎండలు పలకరించగా చిన్నారులు, వృద్దులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక గృహాలలో ఉండే వారి పరిస్థితి దారుణంగా ఉందట. వేడి గాలులు అధికం కావడంతో ఉక్కపోతలు పలకరిస్తున్నాయట. వేడి గాలుల నుండి ఉపశమనం పొందేందుకు ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతున్నారు. కూలర్లు, ఏసీలు, ఫ్యాన్ లకు మద్యాహ్నం వేళ అసలు రెస్ట్ ఇవ్వని పరిస్థితి. ఇలా తెలంగాణలో భానుడి ప్రతాపం అధికంగా ఉంది.
తాజాగా వాతావరణ శాఖ తెలంగాణ ప్రజలను మండే ఎండలపై ఓ హెచ్చరిక చేసింది. తెలంగాణలో మార్చి 2 వరకు ఎండ ప్రభావం అధికంగా ఉండనుందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఇప్పటికే ఎండల తీవ్రత అధికంగా ఉండగా, పలు ప్రాంతాలలో 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కానీ ఈ ఐదు రోజులు మాత్రం పలు ప్రాంతాలలో 37డిగ్రీల నుంచి 40డిగ్రీలు చేరుకునే అవకాశముందట. ఇక హైదరాబాద్ నగరంలో అయితే వేరే లెవెల్ ఉష్ణోగ్రతలు ఉండనున్నాయి. ఏకంగా 34 నుండి 37 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉండొచ్చని వెల్లడించారు.
మార్చి 2వ తేదీ వరకు ఇదే పరిస్థితి ఉంటుందని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప ఉదయం 11 గంటల తర్వాత బయటికి వెళ్లొద్దని, ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, గుండె జబ్బులు, ఆస్తమా, మానసిక వ్యాధిగ్రస్థులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఏమైనా పనులుంటే ఉదయం 11 గంటలలోపు, సాయంత్రం 4 గంటల తర్వాత చూసుకోవాలని తెలిపారు. నిత్యం 5 లీటర్ల నీరు తప్పనిసరిగా తాగాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీంతో ప్రజలు వడదెబ్బకు గురికాకుండా ఉండవచ్చని, ఎండలో వెళ్లేవారు తప్పక గొడుగులు తీసుకువెళ్లాలన్నారు. అది కూడా నల్లని రంగు గల గొడుగులను వాడడం ద్వారా వేడిగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని వైద్యులు తెలుపుతున్నారు.
Also Read: TG Govt: తెలంగాణలో కొత్త రూల్.. పాటించకుంటే సీజ్..
వాతావరణ శాఖ అధికారుల సూచనలను బట్టి, మార్చి 2 వ తేదీ వరకు హైదరాబాద్ నగర వాసులతో పాటు, రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. అయితే ఎండలపై హెచ్చరికలు వస్తున్నప్పటికీ, పాఠశాలలకు ఒంటి పూట బడులపై ప్రభుత్వ ప్రకటన రాకపోవడం విశేషం. ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా పాఠశాలలకు ఒంటి పూట బడులు అమలు చేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. ఏపీలో కూడా రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా, అక్కడ ఒంటి పూట బడులపై ప్రకటన రావాల్సి ఉంది.