Gene Hackman: హాలీవుడ్ స్టార్ హీరో, రెండుసార్లు ఆస్కార్ వరించిన నటుడు జీన్ హ్యాక్‌మాన్ (Gene Hackman), తన భార్య ప్రముఖ పియానిస్ట్ బెట్సీ అరకావా (Betsy Arakawa).. అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం హాలీవుడ్‌ను ఒక్కసారిగా కుదిపేసింది. ‘ది ఫ్రెంచ్ కనెక్షణ్’, ‘అన్‌ఫర్గివెన్’ లాంటి సినిమాలకు ఆస్కార్ అవార్డులను అందుకున్న జీన్ వయసు ప్రస్తుతం 95 ఏళ్లు. ప్రస్తుతం తను సినిమాల నుండి రిటైర్మెంట్ తీసుకొని నవలా రచయితగా సెటిల్ అయ్యారు. ఆయన యాక్టింగ్ అన్నా, ఆయన రైటింగ్ అన్నా చాలామంది ప్రేక్షకులకు ప్రత్యేకమైన ఇష్టం ఉంటుంది. అలాంటి జీన్ హ్యాక్‌మాన్ అనుమానస్పద మృతి గురించి ప్రస్తుతం హాలీవుడ్ మీడియాలో పలు రకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
అసలేం జరిగింది.?
బుధవారం మధ్యాహ్నం సాంటా ఫేలో ఉన్న తమ నివాసంలో జీన్, బెట్సీ మృతదేహాలు లభించాయి. సాంటా ఫే కౌంటీకి చెందిన పోలీస్ అధికారులు అక్కడికి చేరుకొని అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరిదే హత్య అనే అనుమానాలు పోలీసులకు కలగకపోయినా.. అసలు వీరి మృతికి కారణమేంటో కూడా వారు వెంటనే చెప్పలేకపోయారు. జీన్ వయసు 95 ఏళ్లు కాగా బెట్సీ వయసు 63 ఏళ్లు. వీరిద్దరికీ 1991లో వివాహం జరిగింది. జీన్, బెట్సీతో పాటు వారి పెట్ డాగ్ కూడా ఆ నివాసంలో చనిపోయి ఉంది. దీంతో పోలీసులకు ఈ మృతులపై అనుమానాలు మొదలయ్యాయి కానీ వారి ప్రధాన విచారణలో ఎలాంటి క్లూ దొరకలేదని సమాచారం.
విచారణ మొదలు
‘‘ప్రస్తుతం విచారణ మొదలుపెట్టాం. సెర్చ్ వారెంట్‌కు అనుమతి కోసం ఎదురుచూస్తున్నాం. ఈ కమ్యూనిటీలో చుట్టుపక్కల ఉన్నవారికి ఎలాంటి ప్రమాదం లేదని హామీ ఇస్తున్నాం’’ అని పోలీస్ అధికారులు మీడియాతో తెలిపారు. చాలా ఏళ్ల క్రితం ఒక నటుడిగా జీన్ హ్యాక్‌మాన్‌కు ఉన్న క్రేజే వేరు. ఆయన కెరీర్ మొత్తంలో ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలను పోషించి ప్రేక్షకులను అలరించారు. ఒక యూఎస్ ప్రెసిడెంట్ పాత్ర దగ్గర నుండి ఒక ఏమీ చేయలేని మిడిల్ క్లాస్ అబ్బాయి వరకు.. ఇలా అన్ని పాత్రల్లో ఆయన ప్రేక్షకులకు వినోదాన్ని పంచారు. అప్పట్లో స్టార్ హీరోలుగా వెలిగిపోతున్న ఎంతోమంది హీరోలతో పోటీపడి తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు జీన్ హ్యాక్‌మాన్.
Also Read: అక్కడ ప్రభాస్ వల్ల కానిది.. తారక్ వల్ల అవుతుందా.?
మొదటి సినిమాకే రికార్డ్
సినిమాల్లోకి అడుగుపెట్టక ముందు ఒక థియేటర్ ఆర్టిస్ట్‌గా, బుల్లితెర నటుడిగా తన కెరీర్‌ను ప్రారంభించారు జీన్ హ్యాక్‌మాన్. 1967లో విడుదలయిన ‘బోనీ అండ్ క్లైడ్’ అనే సినిమాలో ఒక హీరోగా నటించి వెండితెరపై అడుగుపెట్టారు. అలా మొదటి సినిమాతోనే ఆస్కార్ నామినేషన్‌లో నిలిచిన నటుడిగా రికార్డ్ సాధించారు. ఆ సినిమాకు ఆయన సపోర్టింగ్ యాక్టర్‌గా ఆస్కార్ నామినేషన్స్‌లో నిలిచినా అవార్డ్ మాత్రం అందుకోలేకపోయారు. ఆ తర్వాత చేసిన ‘ఐ నెవెర్ సాంగ్ ఫర్ మై ఫాదర్’ సినిమాతో రెండోసారి ఆస్కార్ బరిలో నిలబడ్డారు. అలా జీన్ హ్యాక్‌మాన్ కెరీర్‌లో ఎన్నో ఆస్కార్ నామినేషన్స్‌తో పాటు రెండు ఆస్కార్ అవార్డులు కూడా ఉన్నాయి. అలాంటి నటుడి హఠాన్మరణం హాలీవుడ్‌ను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.