Hyderabad City: హైదరాబాద్‌వాసులకు షాకింగ్ న్యూస్. చిన్న అపార్టుమెంటు కొనుగోలు చేశారా? మళ్లీ దాన్ని అమ్ముకోవాలని (రీసేల్)ప్రయత్నాలు చేస్తున్నారా? సెక్షన్ 22 ఏ జాబితా కింద ఉంటే అమ్ముకోవడం అస్సలు కుదరదు. అలాంటి వారిని రిజిస్ట్రేషన్ చేయడం కుదరని సబ్ రిజిస్ట్రార్‌లు చెబుతున్నారు. అసలు ఏం జరిగింది? ఎందుకు అధికారులు రిజిస్ట్రేషన్ చేయడం కుదరదని చెబుతున్నారు? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.
హైదరాబాద్ సిటీలో ఫ్లాట్ కొనుగులు చేశారా? అది మీ సొంతం కాదని తేల్చి చెబుతున్నారు అధికారులు. సామాన్యుల కలలపై పిడుగు పడే వార్త. అధికారుల ఒక్క సంతకంతో దశాబ్దాల సామాన్యుడి కష్జార్జితం చెల్లాచెదురు అవుతోంది. అధికారులు సంతకాలతో ఆ భూమి నిషేధిత జాబితాలోకి వెళ్లిపోతోంది. అప్పుడు అనుమతి ఇచ్చిన అధికారులు ఇప్పుడు కాదని చెబుతున్నారు. సెక్షన్ 22 ఏ భూములపై దుమారం మొదలైంది. ఎప్పుడో దశాబ్దాల కిందట భూమిని కొనుగోలు చేసి అన్నిరకాల అనుమతులతో నిర్మాణం చేపట్టిన అపార్ట్‌మెంట్లు, సెక్షన్ 22 ఏ కింద నిషేధిత జాబితాలోకి వెళ్లిపోతున్నాయి. అపార్ట్‌మెంట్లు కొనుగోలువారు ఇప్పుడు అమ్ముకోవడానికి రిజిస్ట్రేషన్ ఆఫీసు మెట్లు ఎక్కితే చాలు అవి 22ఏ జాబితాలో ఉన్నాయని వాటిని రిజిస్ట్రేషన్ చేయడం కుదరని తేల్చి చెబుతున్నారు సబ్ రిజిస్ట్రార్‌లు.
రికార్డుల పాత కాగితాల దుమ్ము దులిపి సెక్షన్ 22 ఏ అని ముద్ర వేస్తున్నారు. అది సీలింగ్, అన్సైన్డ్ ల్యాండ్ అంటూ రకరకాలుగా చెబుతున్నారు. హైదరాబాద్ నగరం చుట్టూ ఇదే సమస్య. ఎల్‌బీ నగర్, ఉప్పల్, దిల్‌సుఖ్‌నగర్, శ్రీనగర్ కాలనీ, కూకట్‌పల్లి, మియాపూర్, బాచుపల్లి, ఎస్‌ఆర్‌నగర్, జూబ్లీహిల్స్, నార్సింగి, కొండాపూర్, గండిపేట ఇలా ఏ ప్రాంతాల్లో చూసినా కొనుగోలుదారుల గుండె తరుక్కుపోతోంది. ప్రాంతం ఏదైనా అపార్టుమెంటువాసులను ఈ సమస్య నిద్ర పట్టడం లేదు. మా ప్లాట్ సెక్షన్ 22 ఏ కిందకు వస్తుందా? అంటూ అనుమానాలు వెంటాడుతున్నాయి. అధికారులు చేస్తున్న తప్పులకు సామాన్యుడి బలైపోతున్నాడు.
సెక్షన్ 22-A ఏం చెబుతోంది- భారత రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం.. 1908 లోని సెక్షన్ 22-A ఏం చెబుతోంది. ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, దేవాదాయ, వక్ఫ్, వివాదాస్పద భూములు, కోర్టుల్లో కేసులు ఉన్నప్రత్యేక రకాల భూముల అమ్మకాలు, కొనుగోళ్లు, బదిలీలను నిరోధించడం ఈ చట్టం ముఖ్య ఉద్దేశం. చట్టానికి విరుద్ధంగా ఉన్న ఆస్తుల రిజిస్ట్రేషన్‌ను తిరస్కరించే అధికారం ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకు ఉంది. ఈ జాబితాలో ఉన్న భూములను ఎవరూ కొనుగోలు చేయడానికి, అమ్మడానికి, గిఫ్ట్ ఇవ్వడం, రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి కుదరదు. ప్రస్తుతం సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లోని ఆన్‌లైన్ సిస్టమ్ ఆయా భూముల రిజిస్ట్రేషన్‌ను ఆటోమేటిక్‌గా బ్లాక్ చేస్తుంది.
ఆన్‌లైన్‌లో ఎలా చెక్ చేయాలి? మీ భూమి లేకుంటే అపార్టుమెంటు 22A నిషేధిత జాబితాలో ఉందో లేదో తెలుసుకోవచ్చు. అధికారిక IGRS తెలంగాణ పోర్టల్‌ను సందర్శించాలి. Prohibited Properties ఆప్షన్ ద్వారా జిల్లా, మండలం, గ్రామం సర్వే నంబర్ వివరాలు నమోదు చేసి చెక్ చేసుకోవచ్చు. పొరపాటున మీ ఫ్లాట్ 22 ఏ జాబితాలో చేరినట్లయితే దాన్ని తొలగించడానికి మీ సేవ ద్వారా De-notification of Prohibited Lands కొరకు దరఖాస్తు చేసుకోవాలి. దానికి పాత రిజిస్ట్రేషన్ పత్రాలు, పట్టాదారు పాస్ బుక్ ఆధారాలుగా సమర్పించాల్సి ఉంటుంది. ఎప్పుడో పదేళ్ల కింద ఫ్లాట్లు కొనుగోలు చేసిన బిల్డర్లు, పాత యజమానుల దగ్గరకు వెళ్లి పత్రాలు తేవడం సామాన్యుడికి నరకంగా మారింది. నిర్మాణం చేపట్టిన బిల్డర్ ఉన్నారో లేదో కూడా తెలీదు.
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల పరిధిలో సమస్య తీవ్రత ఉంది. భూ రికార్డుల సవరణ నేపథ్యంలో పాత రికార్డులను పరిగణనలోకి తీసుకుంటున్న కలెక్టర్లు, వివరాల ఆధారంగా పైన చెప్పినట్టుగా ఆ జాబితాలో భూములు కనిపిస్తే చాలు 22ఏ జాబితాలో చేర్చుతున్నారు. దీనిపై అధికారులు ఏమంటున్నారు? పాత రికార్డుల ఆధారంగా తాము నిర్ణయం తీసుకుంటున్నామని చెబుతున్నారు. ఈ సెక్షన్ వల్ల చాలా అపార్ట్‌మెంట్లు ప్రభుత్వ భూముల జాబితాలోకి వస్తున్నాయని వివరిస్తున్నారు. భూములకు సంబంధించి పూర్తిస్థాయి రికార్డులు లేకపోవడం వల్ల పరిష్కారం చూపడం కష్టంగా ఉందని చెబుతున్నారు.
ALSO READ: ల్యాండ్ మాఫియా, భూ కబ్జాదారులు కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారు- ఏవీ రంగనాథ్
22ఏ జాబితాలో ఉన్న అపార్ట్‌మెంట్ నివాసితులు వారి బిల్డర్, భూ యజమాని నుంచి ప్రభుత్వం నుంచి క్రమబద్ధీకరణ అనుమతులు పొందిన పత్రాలు ఏవైనా ఉంటే చూపించాలని చెబుతున్నారు. అప్పుడు 22ఏ జాబితా నుంచి తొలగిస్తామంటున్నారు. ఆధారాలు లేకపోతే చట్టపరంగా చర్యలు తీసుకోవడం తప్ప మరొకటి లేదంటున్నారు. హెచ్‌ఎండీఏ, హుడా లేఅవుట్లలో కొనుగోలు చేసిన ప్లాట్లకు ఈ సమస్య తప్పడం లేదని రిజిస్ర్టేషన్ శాఖ అధికారుల మాట. హుడా లేఅవుట్లు, హౌసింగ్ బోర్డు, హెచ్‌ఎండీఏ విక్రయించిన ప్లాట్లను 22ఏ జాబితాలో పెడితే కొనుగోలుదారులు ఎలా బయటపడాలని ప్రశ్నించినవాళ్లు లేకపోలేదు. మరి ఈ సెక్షన్ 22 ఏపై ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. సెక్షన్ 22 ఏ తో నలిగిపోతున్న బాధితుకు ఉపశమనం కలిగించాలి.