AV Ranganath: తెలంగాణలో చెరువులు, పార్కులు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణే లక్ష్యంగా ఏర్పడిన హైడ్రా సంపూర్ణంగా రాజ్యాంగబద్ధంగానే తన విధులు నిర్వర్తిస్తోందని కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. నిజాయితీ, నిర్భయత్వమే తమకు నిజమైన ధైర్యమని, ల్యాండ్ మాఫియా కోర్టులకు తప్పుడు సమాచారం ఇస్తూ తప్పుదోవ పట్టిస్తోందని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
భారీగా కాపాడిన ప్రభుత్వ భూములు
ఆర్టికల్ 21, 48A ప్రసాదించిన హక్కులు, విధుల ప్రకారమే తాము అడుగులు వేస్తున్నామని రంగనాథ్ వెల్లడించారు. గత రెండేళ్లలో దాదాపు రూ.1.50 లక్షల కోట్ల విలువైన వేలాది ఎకరాల ప్రభుత్వ భూములను, ఆక్రమణకు గురైన పార్కులను రక్షించి తిరిగి ప్రభుత్వానికి అప్పగించామని తెలిపారు. ఇప్పటికే 6 చెరువులను పూర్తిస్థాయిలో పునరుద్ధరించగా.. మరొక 20 చెరువుల పునరుద్ధరణ పనులు శరవేగంగా సాగుతున్నాయని వివరించారు.
లోతుకుంట భూముల వెనుక పెద్దల హస్తం
లోతుకుంట ప్రాంతంలో సుమారు రూ.10 వేల కోట్ల విలువైన 120 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు శాంతా శ్రీరామ్ రియల్ ఎస్టేట్ సంస్థ ప్రయత్నించిందని సంచలన ఆరోపణలు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా 2,500 ఏళ్ల నాటి చారిత్రక హెరిటేజ్ గుట్టలను బ్లాస్టింగ్ చేసి, వందల చెట్లను కూల్చివేశారని మండిపడ్డారు. ‘సేవ్ ది రాక్స్ సొసైటీ’, పర్యావరణవేత్తలు, స్థానికుల ఫిర్యాదులతోనే హైడ్రా స్పందించి అక్రమాలకు అడ్డుకట్ట వేసిందన్నారు.
కంటెంప్ట్ కేసులపై క్లారిటీ
తనపై నమోదైన 63 కోర్టు ధిక్కరణ కేసులపై రంగనాథ్ స్పందిస్తూ.. ఆ కేసులు వేసింది బడా భూకబ్జాదారులేనని తేల్చిచెప్పారు. సింగరేణి కార్మికుల వేలాది ప్లాట్లు, బతుకమ్మ కుంటతో పాటు సామాన్యుల స్థలాలను కబ్జా మాఫియా నుంచి కాపాడటమే తాను చేసిన తప్పా అని ప్రశ్నించారు. ఈ కేసులన్నింటినీ చట్టపరంగానే ఎదుర్కొంటానని, న్యాయస్థానాలపై తనకు పరిపూర్ణ నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్తులోనూ ప్రభుత్వం ఏ బాధ్యత అప్పగించినా 100 శాతం అంకితభావంతో సమర్థవంతంగా పనిచేస్తానని పునరుద్ఘాటించారు.
Also Read: రంగనాథ్ మంచి, చెడు రెండూ చేశారు.. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలు!