Flexi Rules: స్వేచ్చ బ్యూరో: పండుగలు, పబ్బాలు, జాతరలు, రాజకీయ నాయకుల బర్త్ డ్ లు, రాజకీయ సమావేశాలు, మిత్రుల జన్మదినోత్సవాలు వంటి సందర్భాల్లో మీరు శుభాకాంక్షలు తెలిపేందుకు ఫ్లెక్సీలు పెట్టాలనుకుంటున్నారా? అయితే ఇకపై కుదరదంటున్నారు మున్సిపల్ కార్పొరేషన్ల అధికారులు. హైదరాబాద్ మహానగర శోభను దెబ్బతీసేలా నగరంలో ఇష్టారాజ్యంగా ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలు, బ్యానర్లకు అధికారులు చెక్ పెట్టేందుకు రంగం సిద్దం చేస్తున్నట్లు తెలిసింది. ముఖ్యంగా ఇటీవలే సర్కారు కోర్ అర్బన్ రీజియన్ తో పాటు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని యోచిస్తున్న కొత్త అడ్వర్ టైజ్ మెంట్ పాలసీలో భాగంగా ఫ్లెక్సీలపై కూడా మార్గదర్శకాలను తయారు చేస్తున్నట్లు సమాచారం.సర్కారు ఏర్పాటు చేసిన అడ్వర్ టైజ్ మెంట్ రెగ్యులేటరీ కమిటీ( ఏఆర్సీ) ఇప్పటి వరకు నాలుగు సార్లు సమావేశమైంది.
ఈ సమావేశాల్లో కొత్త అడ్వర్ టైజ్ మెంట్ పాలసీ మార్గదర్శకాలు, అడ్వర్ టైజ్ మెంట్లు ఏర్పాటు చేయాల్సిన ప్రాంతాలు, స్టెబిలిటీ నిర్వహణ, ఫీజులు వంటి కీలక విషయాలపై సుదీర్ఘంగా చర్చించిన కమిటీ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఇప్పటి వరకున్న అడ్వర్ టైజ్ మెంట్లను మరో 25 వేల వరకు పెంచి, అందులో పది శాతం సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రచారానికి వినియోగించాలని నిర్ణయించిన సంగతి తెల్సిందే. ఈ కసరత్తులో భాగంగా పనిలో పనిగా నగరంలో ఇష్టారాజ్యంగా ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేస్తూ నగర శోభను దెబ్బ తీసేలా తయారైన ఫ్లెక్సీల ఏర్పాటు కూడా ప్రత్యేకమైన గైడ్ లైన్స్ రూపకల్పన చేయాలని శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ ను రెగ్యులేటరీ కమిటీ ఆదేశించిన సంగతి తెల్సిందే. ఈ గైడ్ లైన్స్‌కు సంబంధించి ఈ నెల 16న మరోసారి జరగనున్న రెగ్యులేటరీ కమిటీ సమావేశంలో కీలకమైన చర్చ జరిగి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
ముఖ్యంగా నగరంలో ఏ గల్లీలోనైనా ఏ చిన్న పండుగ జరిగినా, పెళ్లి, బర్త్ డే వంటి కార్యక్రమాలు జరిగినా, మనకు ఎక్కడబడితే అక్కడ ఫ్లెక్సీలు దర్శనమిస్తుంటాయి. ఇలా ఇష్టారాజ్యంగా ఫ్లెక్సీలు, బానర్లను ఏర్పాటు చేయకుండా, ఒక్కో మున్సిపల్ వార్డులో ఓ ప్రాంతాన్ని ఎంపిక చేయాలని అధికారులు భావిస్తున్నారు. అనుమతించిన ప్రాంతంలోనే ఫ్లెక్సీలు, బానర్లను ఏర్పాటు చేసి, వాటికి నామమాత్రంగా ఛార్జీలు వసూలు చేయాలని యోచిస్తున్నట్లు తెలిసింది. వీటిలో టూ లెట్ బోర్డు, వాంటెడ్ బోర్డులు, హౌజ్ ఫర్ సేల్ వంటి చిన్న చిన్న బోర్డులను పరిమితంగా కొద్ది రోజుల పాటు ఉచితంగా అనుమతించాలని కూడా భావిస్తున్నట్లు తెలిసింది. మూడు మున్సిపల్ కార్పొరేషన్లకు, సర్కారుకు ఆదాయాన్ని సమకూర్చేందుకు ఈ పాలసీలో భాగంగా ఫ్లెక్సీలు, బ్యానర్లకు కూడా ఛార్జీలు వర్తింపజేయాలని సర్కారు భావిస్తున్నట్లు సమాచారం.
Also Read: నాటి బతుకమ్మ చీరలతో.. అడవి పందులు తోలేవారు.. బీఆర్ఎస్‌పై సీఎం రేవంత్ సెటైర్లు
ఒక మున్సిపల్ వార్డులో మున్సిపల్ అధికారులు కొత్త అడ్వర్ టైజ్ మెంట్ పాలసీ కింద ఫ్లెక్సీలు, బ్యానర్లు, టు లెట్, ఫర్ సేల్ బోర్డులతో పాటు రాజకీయ నాయకులకు స్వాగతాలు, రాజకీయ సమావేశాలకు సంబంధించిన ఫ్లెక్సీలు, బ్యానర్లను ఏర్పాటు చేస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయంపై కూడా ఈ నెల 16న జరగనున్న అడ్వర్ టైజ్ మెంట్ రెగ్యులేటరీ కమిటీ సమావేశంలో ప్రస్తావన రానున్నట్లు తెలిసింది. ఇప్పటికే సిద్దంగా ఉన్న డీ ఫేస్ మెంట్ యాక్టు ను అమలు చేస్తూ అనుమతి లేని ప్రాంతాల్లో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేస్తే వాటిని మున్సిపల్ శాఖ తొలగించటం, ఏర్పాటు చేసిన వారిని గుర్తించి వారి నుంచి భారీగా జరిమానాలు వసూలు చేయాలా? అన్న కీలక నిర్ణయాలపై 16వ తేదీన జరగనున్న రెగ్యులేటరీ కమిటీ సమావేశంలో మరింత క్లారిటీ వచ్చే అవకాశముంది.
కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లలో అమలు చేసేందుకు రూపొందించిన కొత్త అడ్వర్ టైజ్ మెంట్ పాలసీని త్వరలోనే అమలు చేసేందుకు రంగం సిద్దం చేసినట్లు తెలిసింది. ఇప్పటి వరకు జరిగిన ఈ కమిటీ నాలుగు సమావేశాలు, అడ్వర్ టైజ్ మెంట్లు ఏర్పాటు చేయాల్సిన ప్రాంతాలు, వాటి నిర్వహణ, సైజును బట్టి రేట్లు వంటి నిర్ణయాలకు సంబంధించిన ఇప్పటికే క్లారిటీ వచ్చినట్లు తెలిసింది. ఈ నెల 16న జరగనున్న కమిటీ సమావేశం తర్వాత కొత్త అడ్వర్ టైజ్ మెంట్లకు టెండర్ల ప్రక్రియను నిర్వహించి, అమలుకు శ్రీకారం చుట్టాలని సర్కారు భావిస్తున్నట్లు తెలిసింది.
Also read: Huzurabad: హుజురాబాద్‌లో ప్రభుత్వ కళాశాల స్థలం ఆక్రమణకు కుట్ర..!