ACB Raids: స్వేచ్చ బ్యూరో: అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా ఆస్తులు కూడబెట్టుకున్న అధికారి బాగోతాన్ని ఏసీబీ అధికారులు రట్టు చేశారు. పక్కాగా సేకరించిన సమాచారంతో సదరు అధికారి నివాసంతోపాటు పదమూడు చోట్ల ఏకకాలంలో దాడులు జరిపారు. తనిఖీల్లో బయటపడ్డ ఆస్తులు, నగదు, నగదు చూసి అధికారులే షాక్ అయ్యారంటే సదరు అధికారి ఏ స్థాయిలో అవినీతికి పాల్పడ్డాడో అర్థం చేసుకోవచ్చు. వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణ రోడ్డు, భవనాల శాఖలో మోహన్ నాయక్ ఇంజనీర్ ఇన్ ఛీఫ్ గా పని చేస్తున్నాడు. కాగా, మోహన్ నాయక్ తన అధికారాన్ని అవకాశంగా చేసుకొని భారీగా ఆస్తులు కూడబెట్టుకున్నట్టు ఏసీబీ అధికారులకు కొన్నిరోజుల క్రితం సమాచారం అందింది.
ఏ క్రమంలో రంగంలోకి దిగిన అధికారులు విచారణ జరిపి అన్ని వివరాలు సేకరించారు. వీటి ఆధారంగా వేర్వేరు బృందాలుగా విడిపోయిన ఏసీబీ సిబ్బంది మియాపూర్ లోని మోహన్ నాయక్ నివాసంతోపాటు హైదరాబాద్, నిజామాబాద్ లలో మొత్తం పదమూడు చోట్ల దాడులు జరిపారు. సోదాల్లో నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం ముల్లంగి గ్రామంలో 82.89 లక్షల విలువ చేసే 19.38 ఎకరాల భూమికి సంబంధించిన పత్రాలు దొరికాయి. దాంతోపాటు కొంపల్లి, గచ్చిబౌలిలో 7.35 కోట్ల విలువ చేసే ఏడు ఫ్లాట్లు ఉన్నట్టుగా బయట పడింది. మియాపూర్ లో 2.50 కోట్ల విలువ చేసే ట్రిప్లెక్స్ విల్లా ఉన్నట్టుగా తేలింది. కూకట్ పల్లిలో 62.14లక్షల విలువ చేసే ఇల్లు కూడా మోహన్ నాయక్ కు ఉన్నట్టుగా వెళ్లడయ్యింది.
నిజామాబాద్ లో కొత్తగా కడుతున్న విల్లాకు మోహన్ నాయక్ కోటి రూపాయలు అడ్వాన్స్ గా ఇచ్చినట్టు తెలిసింది. ఇక, ఏసీబీ అధికారులు మోహన్ నాయక్ ఇంటి నుంచి 55లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. బ్యాంక్ ఖాతాల్లో కోటీ 44 లక్షలు ఉన్నట్టుగా గుర్తించారు.ఇంట్లో నుంచి 2కోట్ల రూపాయల విలువ చేసే బంగారు నగలు, 3.60 లక్షల విలువ చేసే వెండి సామాగ్రిని సీజ్ చేశారు. మోహన్ నాయక్ ఇంట్లో కోటీ 26 లక్షల విలువ చేసే గృహోపకరణాలు ఉన్నట్టు గుర్తించారు. 11.25 లక్షల విలువ చేసే 9 మొబైల్ ఫోన్లు, 4ల్యాప్ టాప్ లను కూడా ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. 25 లక్షల విలువ చేసే వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో దొరికిన అన్ని ఆస్తుల విలువ 17.95 కోట్లు ఉంటుందని ఏసీబీ అధికారులు తెలిపారు. ప్రైవేట్ మార్కెట్ రేట్ ప్రకారం చూస్తే వీటి విలువ 150 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని అంచనా. మోహన్ నాయక్ పై అక్రమాస్తుల కేసులు నమోదు చేసిన ఏసీబీ అధికారులు అతన్ని అరెస్ట్ చేశారు.
Also Read: తడిచిపెట్టుకుపోయిన ఎల్‌నినో..! నేనున్నానంటూ పలకరించి పరవశింపజేసిన తొలకరి!