Serial Killer Arrested: ఖాకీ సినిమాలో సీరియల్ కిల్లర్లను అరెస్ట్ చేసేందుకు హీరో కార్తీ ఎన్ని తిప్పలు పడతాడో మనం వెండితెర మీద చూశాం. అదే సినిమా తరహాలోనే ఓ కిల్లర్ ను పట్టుకొనేందుకు గుజరాత్ పోలీసులు అదే తరహాలో, నిందితుడి ముఖచిత్రం పట్టుకొని తిరగని సిటీ లేదు.. గ్రామం లేదు. కానీ ఖాకీ సినిమాలో ఓ జైలర్ ఏవిధంగా నిందితుల జాడ కనుగొని సమాచారం అందిస్తాడో, అదే తరహాలో ఓ జైలర్ గుజరాత్ పోలీసులకు కిల్లర్ ఆచూకీ తెలిపి సహకరించాడు. ఖాకీ సినిమా రీల్ స్టోరీ అయితే ఈ రియల్ స్టోరీ ఏమిటో తెలుసుకుందాం.
రైల్వే స్టేషన్లే అతని స్థావరాలు. ఒంటరి మహిళ కనిపించిందా ఇక అంతే. అరెస్ట్ కావడానికి ముందు కూడా మహిళను హత్య చేశాడు ఈ సీరియల్ కిల్లర్. అది కూడా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలోనే.. మహిళలు ఒంటరిగా కనిపిస్తే చాలు.. దోచుకోవడం.. హతమార్చడం ఇతని నైజం. నాలుగు రాష్ట్రాల్లో హత్యలకు పాల్పడి, గడగడ లాడిస్తున్న సీరియల్ కిల్లర్ ను గుజరాత్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు.
గుజరాత్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నవంబర్ 14న వుద్వాడ రైల్వే స్టేషన్ సమీపంలో, పట్టాలపై బాలిక మృతదేహం లభ్యం కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడిని గుర్తించారు. హర్యానాలోని రోహ్ తక్ కు చెందిన రాహుల్ జాట్ ఈ నేరానికి పాల్పడినట్లు పోలీసులు సాక్ష్యాధారాలతో సహా నిరూపించారు. రాహుల్ ను అదుపులోకి తీసుకొని విచారణ నిర్వహించిన పోలీసులకు ఆశ్చర్యపోయే విషయాలు తెలిశాయి.
సికింద్రాబాద్ మహిళను హత్య చేసింది ఇతనే..
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఇటీవల ఓ మహిళను దోపిడీ చేసి హత్యకు పాల్పడ్డ ఘటన చోటుచేసుకుంది. అయితే సీరియల్ కిల్లర్ గా మారిన రాహుల్.. రైల్వేస్టేషన్ల వద్ద ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేస్తూ నేరుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకున్నాడు. అక్కడ ఒంటరిగా ఉన్న ఒక మహిళపై దాడికి పాల్పడి, దోపిడీ చేయడంతో పాటు హత్య చేసినట్లు గుజరాత్ పోలీసులు తెలిపారు.
రాహుల్ జాట్ ఒకచోట దోపిడీకి పాల్పడి హత్య చేస్తే మరో చోటికి తన స్థావరం మార్చడం అలవాటుగా మార్చుకున్నాడని పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు. కర్ణాటక, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలలో రైల్వేస్టేషన్ల వద్దగల ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తూ హత్యలకు పాల్పడినట్లు ఎస్పీ కరణ రాజ్ వాఘేలా తెలిపారు. నిందితుడి పై హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ లలో అధికంగా కేసులు నమోదై ఉన్నాయని, ఇతను దోపిడీ చేసి హత్యలు చేయడమే అలవాటుగా మార్చుకొని, ఏకంగా 19 మందిని అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసులు ధృవీకరించారు. సుమారుగా రెండు వేలకు పైగా సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ ను పరిశీలించిన అనంతరం, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
సీరియల్ కిల్లర్ ను పట్టించిన జైలు అధికారి..
హత్య కేసులో దర్యాప్తు ప్రారంభించిన గుజరాత్ పోలీసులకు ఎట్టకేలకు ఒక సీసీటీవీ ఫుటేజ్ లో స్పష్టమైన ఫోటో రికార్డ్ కావడంతో, నిందితుడిని గుర్తించే పని సులభతరమైంది. సూరత్ లోని లాజ్ పూర్ సెంట్రల్ జైలు అధికారి ఆ ఫోటోను గుర్తించి, నిందితుడి వివరాలను పక్కాగా తెలిపినట్లు గుజరాత్ పోలీసులు తెలిపారు. పలు చోరీ కేసులలో, ఆయుధాల స్మగ్లింగ్ కు సంబంధించిన కేసులలో సైతం రాహుల్ జైలు శిక్ష అనుభవించినట్లు పోలీసుల విచారణలో వెల్లడయింది.
Also Read: Secunderabad Tragedy: చంపేసిన చపాతీ.. తింటూ తింటూనే బాలుడు మృతి.. అసలేం జరిగిందంటే?
రైల్వే స్టేషన్లే ఇతని ప్రధాన టార్గెట్ అని, స్టేషన్ ల వద్ద ఒంటరిగా ఉన్న మహిళలను, వృద్ధులను టార్గెట్ చేస్తూ దాడి చేయడమే కాక హత్యలకు పాల్పడడం రాహుల్ అలవాటుగా మార్చుకున్నట్లు పోలీసులు తెలిపారు. మొత్తం మీద నాలుగు రాష్ట్రాలలో హత్యలకు పాల్పడి గడగడలాడించిన సీరియల్ కిల్లర్ ను గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేయడం విశేషం. సీరియల్ కిల్లర్ ను అరెస్ట్ చేయడంలో విశేష కృషి చేసిన పోలీసు అధికారులను, పోలీస్ సిబ్బందిని పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు.