Digital Arrest Scam: అమెరికా పౌరులను లక్ష్యంగా చేసుకొని డిజిటల్ అరెస్టు పేరిట మోసాలకు తెగబడుతున్న ముఠాను హైదరాబాద్ జోన్ ఈడీ అధికారులు అరెస్టు చేశారు. విచారణలో ఈ గ్యాంగ్ మూడేళ్లుగా సైబర్ మోసాలు చేస్తున్నట్టుగా వెల్లడైంది. ఫేక్ కాల్ సెంటర్ నడుపుతూ నేరాలకు పాల్పడినట్టుగా తెలిసింది. కొల్లగొట్టిన డబ్బును కొన్ని వందల మ్యూల్ అకౌంట్లలోకి ట్రాన్స్ ఫర్ చేసి క్రిప్టో కరెన్సీ రూపంలో హవాలా మార్గాల్లో బదిలీ చేసుకున్నట్టుగా నిర్ధారణ అయ్యింది.
ఈ కేసులో ప్రధాన సూత్రధారి హర్షిల్ రావల్ తన సహచరులైన ప్రణవ్ పితాదియా, చేతన్ ముంజల్ తో కలిసి మొదట హైదరాబాద్ లోని మాదాపూర్ లో నకిలీ కాల్ సెంటర్ ను ప్రారంభించాడు. గతంలోనే దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి ఈ ముగ్గురితోపాటు పలువురిని అరెస్ట్ చేశారు. జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత హర్షిల్ రావల్, ప్రణవ్ పితాదియా, చేతన్ ముంజల్ లు పంజాబ్ రాష్ట్రాం పాటియాలాకు మకాం మార్చారు. అక్కడ ఫేక్ కాల్ సెంటర్ ను ప్రారంభించారు. ఉద్యోగులను నియమించుకుని అమెరికా సిటిజన్లను టార్గెట్ చేసి డిజిటల్ అరెస్ట్ పేర బెదిరించడం ప్రారంభించారు.
అలా వందలమందిని మోసం చేసి రూ. 400 కోట్ల మేర కొల్లగొట్టారు. లూటీ చేసిన డబ్బును వందలాది మ్యూల్ అకౌంట్లకు ట్రాన్స్ ఫర్ చేశారు. ఆ తరువాత క్రిప్టో వాలెట్ల ద్వారా సింగపూర్, దక్షిణ కొరియా తదితర దేశాలకు తరలించి హవాలా మార్గంలో తిరిగి తమ వద్దకు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఈ మోసాలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, ఇతర నిందితుల పాత్రపై ఈడీ అధికారులు విచారణ చేస్తున్నారు.
Also Read: బండ్ల మీద దొరికే పెసర పునుగుల సీక్రెట్ ఇదే..స్ట్రీట్ ఫుడ్ టేస్ట్ ఇక మీ ఇంట్లోనే!