Food Poisoning: మండీ బిర్యానీ తిని ఒకే కుటుంబంలోని తొమ్మిది మంది ఆస్పత్రి పాలయ్యారు. స్థానికంగా కలకలం సృష్టించిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. అంబర్ పేట్ ప్రాంతంలో నివాసముంటున్న ఓ కుటుంబం ఈనెల 15న అంబర్ పేట్ గాంధీ బొమ్మ ప్రాంతంలో ఉన్న ముకర్రమ్ హోటల్ నుంచి మండీ బిర్యానీ తెప్పించుకుంది. అనంతరం కుటుంబ సభ్యులు బంధువులతో కలిసి ఆ బిర్యానీ తిన్నారు. తిన్న కొద్దిసేపటికే తొమ్మిదిమంది వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
హోటల్ యజమానిని నిలదీయగా స్థానికంగా ఓ ఆస్పపత్రిలో వారికి చికిత్సలు చేయించాడు. కాగా, అస్వస్థతకు గురైన వారిలో ఓ మహిళకు న్యూరో సమస్య తలెత్తి పరిస్థితి విషమించింది. దీంతో అస్వస్థతకు గురైన అందరినీ మెరుగైన చికిత్స కోసం బుధవారం నల్లకుంట ఫీవర్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. వీరిలో అయిదుగురు చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఫీవర్ హాస్పిటల్ వైద్యుల సలహా మేరకు అందరినీ ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఫుడ్ పాయిజన్ కు గురైన వారిలో సయ్యద్ నసీమ్ సుల్తానా, ఖతీజా తుల్ కుబ్రా, ఆస్మా సుల్తానా, కాచిగూడ నెహ్రూనగర్ కు చెందిన మహ్మద్ ఆమీర్ తదితరులున్నారు.
Also read: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ వ్యాఖ్యలపై టీపీసీసీ ఫైర్.. త్వరలో నివేదిక!