ACB Raid: ఏసీబీ అధికారులు వరుసగా దాడులు జరుపుతున్నా అవినీతికి మరిగిన అధికారుల్లో మార్పు రావటం లేదు. తాజాగా అధికారికంగా సాయం చేసేందుకు లంచం తీసుకుంటూ టోలీచౌకీ సీఐ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి.
టోలీచౌకీ సీఐగా పని చేస్తున్న రమేశ్ నాయక్ స్టేషన్ పరిధిలోని ఓ హోటల్ యజమానితో నిర్ణీత సమయం ముగిసినా అదనంగా మరో గంట నడపటానికి సాయం చేస్తానని చెప్పాడు. అయితే, దీని కోసం నెలకు 50వేల రూపాయల మామూళ్లు ఇవ్వాల్సి ఉంటుందన్నాడు. మొదటి నెల కన్సీషన్ గా 10వేలు తగ్గించి 20వేలు తీసుకున్నాడు. మిగితా 20వేల రూపాయలను బుధవారం రాత్రి తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
అతని నుంచి లంచంగా తీసుకున్న 20వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. తనిఖీలు జరుపగా సీఐ రమేశ్ నాయక్ వద్ద మరో లక్షా 80వేల రూపాయల నగదు వేర్వేరు కవర్లలో దొరికింది. దాంతో సీఐ రమేశ్ నాయక్ ను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు గురువారం అతన్ని నాంపల్లిలోని ఏసీబీ కేసుల ప్రత్యేక కోర్టులో హాజరుపరిచి చంచల్ గూడ జైలుకు రిమాండ్ చేశారు.
Also read: రోహింగ్యాలపై మారణహోమం నిజమే.. మయన్మార్‌ను దోషిగా తేల్చిన అంతర్జాతీయ కోర్టు.. కీలక ఉత్తర్వులు జారీ!