Weather News: రెండు తెలుగు రాష్ట్రాల్లో గత వారం రోజులుగా నుంచి వర్షాలు దంచికొట్టాయి. కుండపోత వానలు కురిశాయి. రుతపవనాలు చురుగ్గా కదలడం.. బంగాళఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడన పరిస్థితుల వల్ల భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడ్డాయి. ఇప్పటికీ పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి. గత నాలుగైదు రోజుల నుంచి కురిసిన వర్షాలకు హైదరాబాద్ మహానగరం చిత్తడిచిత్తడై పోయింది. రోడ్లపైకి భారీ వరద నీరు చేరుతుండడంతో భాగ్యనగర వాసులు నానా ఇబ్బందులు పడ్డారు. ఓవైపు భారీ వర్షాలు, మరో వైపు ట్రాఫిక్ సమస్యలతో వాహనదారుల అష్టకష్టాలు చూశారు. భారీ వర్షాలకు ఎక్కడికక్కడ రోడ్లపైకి భారీ వరద నీరు చేరింది. దీంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడడం.. వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. సాయంత్రం ఇంటికి వెళ్లాల్సిన ఉద్యోగులు గంటల తరబడి ట్రాఫిక్ జామ్ లోని ఇరుక్కుపోయిన సంఘటనలు ఎదురయ్యాయి. హైదరాబాద్ లోతట్టు ప్రాంతాల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లల్లోకి నీరు చేరడంతో నానా అవస్థలు పడ్డారు.
వర్షాల నుంచి హైదరాబాద్‌కు ఉపశమనం..
ఈ క్రమంలోనే హైదరాబాద్ వాతావరణ శాఖ భాగ్యనగర వాసులకు గుడ్ న్యూస్ చెప్పింది. గత నాలుగు రోజులుగా మోస్తరు నుంచి భారీ వర్షాలతో తడిసి ముద్దయిన హైదరాబాద్ మహానగరానికి ఎట్టకేలకు ఉపశమనం లభించింది. ఇవాళ (శనివారం రోజున) నగరంలో వర్షాలు తగ్గిపోయి, వాతావరణం పొడిగా మారింది. వర్షాలు పడకపోవడంతో జనాలు రోడ్ల పైకి వచ్చారు. రహదారులపై వరద నీరు తగ్గిన నేపథ్యంలో ప్రజలు సాఫీగా పనులు నిమిత్తం బయటకు వచ్చారు. ఆదివారం కూడా నగరంలో వర్షం పడే అవకాశం లేదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఒకవేళ పడినా తుంపర జల్లులకే పరిమితం కానుందని చెప్పారు.
ఈ జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు..
అయితే ఉత్తర తెలంగాణలో మాత్రం వర్షాలు పడుతున్నాయి. ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ వంటి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గంటకు 30–40 కి.మీ వేగంతో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని చెప్పారు. కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. పలు చోట్ల పిడుగులు పడే ఛాన్స్ ఉందని అధికారులు పేర్కొన్నారు.
సాయంత్రం వేళ వర్షాలు
హైదరాబాద్ నగరంతో సహా తెలంగాణలోని మిగిలిన జిల్లాల్లో రేపు పొడి వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రధానంగా రోజంతా పొడి వాతావరణం, సాయంత్రం కొద్దిసేపు వర్షం పడుతుందని వివరించారు. ఆగస్టు రెండో వారంలో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని చెప్పారు. ఉరుములు, మెరుపులతో వర్షాలు పడతాయని వివరించారు.
ALSO READ: RRB Technician Jobs: శుభవార్త.. రైల్వేలో 6238 ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పొడిగింపు
ALSO READ: GHMC: హైదరాబాదీలకు భారీ గుడ్ న్యూస్.. ఇక సింపుల్‌గా ఆ పనులన్నీ పూర్తి..?