Hyderabad News: గుండెపోటు సమస్యలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. చిన్నారుల నుంచి పెద్దల వరకు దీని బారినపడుతున్నారు. పలువురు బయట పడుతుండగా, మరికొందరు ఈ లోకాన్ని విడిచిపెడుతున్నారు. తాజాగా జీహెచ్ఎంసీ కార్పొరేటర్ మహ్మద్ ముజఫర్ హుస్సేన్ గుండెపోటుతో మరణించారు. కౌన్సిల్ సమావేశం నుంచి వెళ్లిన కాసేపటికి ఈ ఘటన జరిగింది. ఈ విషయం తెలియగానే మిగతా కార్పొరేటర్లు ఒక్కసారిగా షాకయ్యారు. అసలేం జరిగింది. ఇంకా లోతుల్లోకి వెళ్లే..
హైదరాబాద్ పాతబస్తీ సంతోష్‌నగర్ ప్రాంతానికి చెందిన కార్పొరేటర్ ముజఫర్ హుస్సేన్. ఆయన ఎంఐఎం పార్టీకి చెందిన నేత కూడా. బుధవారం జరిగిన కౌన్సిల్ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఛాతిలో చిన్న నొప్పి రావడంతో కౌన్సిల్ సమావేశం నుండి ఇంటికి వెళ్లిపోయారు. ఇంటి నుంచి కాంచన్‌బాగ్ ఒవైసీ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలిస్తుండగా మార్గమధ్యలో ఆయన మరణించారు.
ఆయన మరణవార్త తెలియగానే జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు ఒక్కసారిగా షాకయ్యారు. తమ కళ్ల ముందు ఇప్పటివరకు కనిపించిన అర్థాంతరంగా ఈ లోకాన్ని విడిచిపెట్టడం జీర్ణించుకోలేకపోయారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. కార్పొరేటర్ మహమ్మద్ ముజాఫర్ హుస్సేన్ ఆకస్మిక మరణంపై మేయర్ గద్వాల్ విజయలక్ష్మి షాకయ్యారు.
ఆయన కుటుంబానికి సానుభూతిని తెలియజేశారు. గురువారం మధ్యాహ్నం చంచల్ గూడ జైలు ఎదురుగా ఉన్న మస్జిద్ ఇ మెరాజ్ వద్ద నమాజ్ ఇ జనాజా నిర్వహిస్తారు. సరిగ్గా ఐదేళ్ల కిందట జీహెచ్ఎంసీ కార్పొరేటర్ రమేష్ కూడా ఇలాగే చనిపోయారు. తెల్లవారుజామున ఆయనకు ఇంట్లో గుండెపోటు రావడంతో వెంటనే మృతి చెందారు.
ALSO READ: రాష్ట్రంలో భారీ ఉరుముల వర్షం.. వీళ్లు మాత్రం బయటకు రావొద్దు
వయస్సుతో సంబంధ లేకుండా
ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది ఆరోగ్యంపై దృష్టి పెట్టడం లేదు. మానసిక ఒత్తిడి, కుటుంబ సమస్యలు ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతున్నాయి. ఒకప్పుడు వయసు మీరిన వారిలో గుండె జబ్బు లక్షణాలు కనిపించేవి. ఇప్పుడు చిన్న వయస్సులో దీనిబారిన పడుతున్నారు. క్షణాల వ్యవధిలో ప్రాణాలు కోల్పోతున్నారు. కేన్సర్ కంటే డేంజర్‌గా గుండెపోటు జబ్బులు మారాయని అంటున్నారు.
ఈ మధ్యకాలంలో యువతలో ఎక్కువగా హార్ట్ ఎటాక్ కేసులు పెరుగుతున్నాయి. హార్ట్ ఎటాక్ సడన్‌గా వచ్చేదికాదు ముందుగానే కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. గుండె పోటుకు రెండు రోజుల ముందు బాడీ ఇచ్చే సిగ్నల్స్ వస్తాయి. తక్కువ ఎత్తులో మెట్లు ఎక్కేటప్పుడు, రాత్రి వేళ నిద్రపోతున్న సమయంలో శ్వాస ఆడటం కష్టమవుతుంది.
ఇంట్లో వెంటిలేషన్ ఉన్నప్పటికీ చాలామందికి ఊపిరి సరిగా అందదు. గుండెపోటుకు ఇదొక సంకేతంగా డాక్టర్లు చెబుతున్నారు. రక్తాన్ని గుండె సరిగా పంపింగ్ చేయకపోతే ఊపిరితిత్తుల్లో ద్రవాలు పేరుకుపోతాయి. దాని ఫలితంగా బ్రీతింగ్ కష్టమవుతుందని అంటున్నారు. ఈ లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించడం మంచిదని అంటున్నారు.