Bengaluru Stampede| బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి) ఐపిఎల్ విజయోత్సవాల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించారు. 47 మంది గాయపడ్డారు. ఈ దుర్ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య గురువారం స్పందిస్తూ.. ఈ దుర్ఘటన వల్ల గెలుపు సంతోషం ఆవిరైపోయిందని.. తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు.
సిద్దరామయ్య ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. “ఇలాంటి తొక్కిసలాట ఘటనలు గతంలో చాలా జరిగాయి. ఈ ఏడాది జనవరిలో ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహా కుంభమేళాలో తొక్కిసలాట ఘటన జరిగింది. ఆ భయనక ఘటనలో 30 మంది మరణించారు, 60 మంది గాయపడ్డారు. నేను ఈ ఘటనను సమర్థించడం లేదు, కానీ ఇలాంటివి గతంలోనూ జరిగాయి,” అని అన్నారు. ఈ ఘటనకు అసలు కారణం స్టేడియంలో ఉన్న సామర్థ్యం కంటే ఎక్కువ మంది దూసుకురావడం. స్టేడియంలో 35,000 మంది సామర్థ్యం మాత్రమే ఉండగా.. దాదాపు 2-3 లక్షల మంది అభిమానులు దూసుకు వచ్చారు. ఇంత పెద్ద జనసమూహాన్ని ఎవరూ ఊహించలేదని ఆయన తెలిపారు.
స్టేడియంలో ఆర్సీబీ విజయోత్సవాల కార్యక్రమం కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (కెఎస్‌సిఎ) ఏర్పాటు చేసింది. తొక్కిసలాట ఘటన ఈ కార్యక్రమంలో జరిగింది. అందుకే ఈ దుర్ఘటనకు క్రికెట్ అసోసియేషన్ దే బాధ్యత. రాష్ట్ర ప్రభుత్వంది కాదని సిద్దరామయ్య స్పష్టం చేశారు. “ప్రభుత్వం కేవలం అనుమతి ఇచ్చింది. బెంగళూరు పోలీసులను భద్రత కోసం మోహరించింది. స్టేడియంలో కార్యక్రమాన్ని మేము నిర్వహించలేదు,” అని ఆయన అన్నారు. విధానసౌధ (కర్ణాటక అసెంబ్లీ) వద్ద ఆర్సీబీ విజయోత్సవాల పరేడ్ ప్రారంభమైంది. అక్కడ లక్ష మందికి పైగా గుమిగూడినప్పటికీ ఎలాంటి ఘటనా జరగలేదని ఆయన పేర్కొన్నారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. స్టేడియం సమీపంలో ఒక డ్రైన్‌పై ఉన్న తాత్కాలిక స్లాబ్‌పై జనం బరువుతో కూలిపోవడం వల్ల భయాందోళన ఏర్పడి, తొక్కిసలాట జరిగినట్లు ఆయన వెల్లడించారు. ఈ ఘటనలో 47 మంది గాయపడ్డారని, చాలా మందికి స్వల్ప గాయాలే అయినందున వారు ఆసుపత్రిలో చేరలేదని, అందరూ ప్రమాదం నుండి బయటపడ్డారని సిద్దరామయ్య తెలిపారు.
మరణించిన వారి కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి ఉచిత చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటనపై డిప్యూటీ కమిషనర్ స్థాయిలో విచారణకు ఆదేశించినట్లు ఆయన తెలిపారు. “ఎవరైనా తప్పు చేసినట్లు తేలితే చర్యలు తీసుకుంటాం,” అని ఆయన అన్నారు.
Also Read: ఒంటరి పోరాటం.. ఐపిఎల్ ఫైనల్లో ఆర్సీబీకి దడ పుట్టించిన ఒకే ఒక్కడు
ఆర్సీబీ అభిమానులు తమ అభిమాన ఆటగాళ్లను చూసేందుకు గేట్ల వద్ద తోపులాడడంతో ఈ దుర్ఘటన జరిగిందని, భద్రత కోసం ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సిద్దరామయ్య కోరారు. ఈ ఘటన ఆర్‌సిబి విజయోత్సవాలను దుఃఖంలో ముంచెత్తిందని, ప్రజలు జీవితానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు.