Hyd Gold Man In Tirumala: కలియుగ వైకుంఠం శ్రీ శ్రీనివాసుడు వెలసిన తిరుమలలో భక్తుల రద్దీ మంగళవారం అధికంగా కనిపించింది. నూతన సంవత్సరం సందర్భంగా తిరుమల భక్తులతో నిండిపోయింది. 2025 ఆంగ్ల సంవత్సరానికి స్వాగతం పలుకుతూ వేడుకలు జరుగుతున్న సందర్భంగా, స్వామివారిని దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం. కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కరుణ కటాక్షం కోసం భక్తులు అలిపిరి కాలినడక మార్గాన సైతం తిరుమలకు చేరుకుంటున్నారు. టిటిడి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసింది.
కాగా తెలంగాణకు చెందిన గోల్డ్ మ్యాన్ విజయ్ కుమార్ కొండ మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మెడలో సుమారు 5 కేజీల విలువైన బంగారు ఆభరణాలను ధరించిన విజయ్ కుమార్, శ్రీవారి దర్శనార్థం ఆలయం వద్దకు రాగానే భక్తులు ఆయనను ఆసక్తిగా చూశారు. కొంతమంది గోల్డ్ మ్యాన్ తో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపారు.
అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విజయ్ కుమార్ మాట్లాడుతూ.. శ్రీవారి దర్శన భాగ్యం తనకు కలగడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. మెడలో బంగారు ఆభరణాలు ధరించడం తనకు అలవాటుగా మారిందన్నారు. అనంతరం సెల్ఫీలు అడిగిన భక్తులకు విజయ్ కుమార్ వారి కోరిక మేరకు సెల్ఫీలు ఇచ్చారు.
జనవరి 10వ తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని టీటీడీ స్థానిక ఆలయాలలో భక్తుల సౌకర్యార్థం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని ఆలయాల్లో ప్రత్యేక క్యూలైన్లు, చలువ పందిళ్లు, రంగవల్లులు తీర్చిదిద్ది వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించనున్నారు.
నందలూరు శ్రీ సౌమ్యనాథస్వామివారి ఆలయంలో…
అన్నమయ్య జిల్లా నందలూరు మండల కేంద్రంలోని శ్రీ సౌమ్యనాథస్వామివారి ఆలయంలో జనవరి 10న వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఉదయం 5 గంటలకు ఉత్తర ద్వారా దర్శనం, ఉదయం 8.30 గంటలకు లక్ష తులసీ అర్చన నిర్వహించనున్నారు. జనవరి 11న వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 8.45 గంటలకు గ్రామోత్సవం నిర్వహించనున్నారు. జనవరి 13న గోదా కల్యాణం, జనవరి 15న పార్వేట ఉత్సవం జరుగనుంది.
ఆవులపల్లి శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో…
చిత్తూరు జిల్లా సోమల మండలంలోని ఆవులపల్లి శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జనవరి 10న వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఉదయం 3 నుండి 3.30 గంటల వరకు తిరుప్పావై జరుగనుంది. అనంతరం ఉదయం 5 నుండి రాత్రి 10 గంటల వరకు భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. రాత్రి 7 నుండి 10.30 గంటల వరకు స్వామి అమ్మవార్లు తిరుచ్చిపై విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు.