Basti Dawakhanas: స్వేచ్ఛ బ్యూరో: హైదరాబాద్ జిల్లా పరిధిలోని 169 బస్తీ దవాఖానల పనితీరు, ప్రజలకు అందుతున్న వైద్య సేవల నాణ్యతను ఈ నెల 10 వ తేదీ నుంచి తనిఖీలు నిర్వహించేందుకు స్పెషలాఫీసర్లను నియమించినట్లు హైదరాబాద్ ఇన్ ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఈ తనిఖీలను సమన్వయం చేస్తూ తనతో పాటు జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ జిల్లా కలెక్టర్ డా. ప్రియాంక అలా లతో కలిసి రానున్న రెండు, మూడు రోజుల పాటు ఎంపిక చేసిన ముఖ్యమైన బస్తీ దవాఖానాలను స్వయంగా తనిఖీ చేస్తామని వెల్లడించారు.
వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాలు వంటి సీజనల్ వ్యాధుల నివారణ కోసం బస్తీ దవాఖానాలను మరింత బలోపేతం చేయడం, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవడమే ఈ ప్రత్యేక తనిఖీల ముఖ్య ఉద్దేశమని మంత్రి తెలిపారు. బస్తీ దవాఖానల్లో వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉంటూ వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, అలాగే మందుల నిల్వలు, ప్రయోగశాల సేవలు, పరిశుభ్రత, అవసరమైన మౌలిక వసతులు తదితర అంశాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి లోపాలను వెంటనే సరిదిద్దేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
Also read: హైదరాబాద్‌లో భారీ ఆపరేషన్.. 1100 మంది పోలీసులతో.. ఇళ్లల్లో సోదాలు!
ప్రజలకు అందుబాటులో నాణ్యమైన ప్రాథమిక వైద్య సేవలు అందించడంలో బస్తీ దవాఖానలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, వర్షాకాలంలో ప్రజల ఆరోగ్య రక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని ప్రతి బస్తీ దవాఖానా ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేలా సేవలందించాలని మంత్రి సూచించారు. హైదరాబాద్ జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో తమ పరిధిలో ఉన్న బస్తీ దవాఖానలను స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేటర్లు, ఇతర ప్రజాప్రతినిధులు విధిగా సందర్శించి, అక్కడి పరిస్థితులను సమీక్షిస్తూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా అధికారులతో సమన్వయం చేసుకోవాలని మంత్రి సూచించారు. ప్రజా ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తుందని, బస్తీ దవాఖానాలను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
Also Read: Addanki Dayakar: కేసీఆర్ రాసి పెట్టుకో.. ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ మాస్ వార్నింగ్!