Musi Rejuvenation: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతిపాదించిన మూసీ పునరుజ్జీవం, ప్రక్షాళన, సుందీకరణ ప్రాజెక్టు మరో అడుగు ముందుకు పడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్ లో కూడా నిధులు కేటాయించిన ప్రభుత్వం తాజాగా మరో రూ. 7345.12 కోట్ల నిధులకు పరిపాలనపరమైన మంజూరీ ఇస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మూసీ పరివాహక ప్రాంతాల్లో జోన్లుగా విభజించి, అభివృద్ది చేసేందుకు సర్కారు ప్రతిపాదనలను సిద్దం చేసిన సంగతి తెల్సిందే. పర్యావరణ హితంగా, పర్యాటక పరంగా ఎలా అభివృద్ది చేయాలన్న విషయంపై రాష్ట్ర ప్రభుత్వం విదేశీ పర్యటనలు కూడా నిర్వహించింది. మూసీ నది జీవనదిగా ఎంచుకుని ప్రాణం పోసుకున్న భాగ్యనగరంలో క్రమంగా పెరుగుతున్న పట్టణీకరణ మూసీ నదిని మురికికూపంగా మారుతూ వస్తుంది.
గతంలో కూడా పాలకులు మూసీ సుందరీకరణ, పునరుజ్జీవం, ప్రక్షాళనకు సంబంధించి చేసిన ప్రయత్నాలు, తయారు చేసిన ప్రతిపాదనలు కేవలం కాగితాలకే పరిమితమైన సంగతి తెల్సిందే. కానీ 2023 నవంబర్ మాసంలో రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగి, కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే ప్రకటించిన మొట్టమొదటి మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు సంబంధించి క్షేత్ర స్థాయిలో పనులు మొదలు పెట్టేందుకు సర్కారు జారీ చేసిన ఆదేశాలతో అన్ని రకాల అడ్డంకులు తొలగినట్టయింది. పర్యావరణ పరిరక్ష జరిగేలా ఎకో ఫ్రెండ్లీగా, పర్యాటక పరంగా అభివృద్ది చేసి, మూసీ పునరుద్దరణ, సుందరీకరణలో ఆస్తులు కొల్పోతున్న బాధితులకు ఉపాధి కల్పించేలా సర్కారు ప్రతిపాదనలు సిద్దం చేసింది. మూసీ పునరుద్దరణ, సుందరీకరణ లో భాగంగా ఇప్పటికే చాలా మంది నిర్వాసితులను ఖాళీ చేయించి, వారిని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలోకి తరలించారు.
వికారాబాద్ అనంతగిరి కోండల్లో పుట్టి 240 కిలో మీటర్లు ప్రవహిస్తూ నల్గోండ జిల్లాలో కృష్ణా నదిలో కలుస్తున్న మూసీ నది కి దాదాపు నాలుగు వేల చదరపు మైళ్ల క్యాచ్ మెంట్ ఏరియా ఉంది, హైదరాబాద్ నగరంలో మూసీ నది సూమారు 55 కిలోమీటర్ల మేరకు ప్రవహిస్తుంది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం జోన్లుగా విభజించి అభివృద్ది చేసేందుకు సిద్దం కాగా, ప్రస్తుతం జోన్ 1ఏ పరిధిలోని హిమాయత్ సాగర్ నుంచి బాపూఘాట్ వరకు, అలాగే జోన్ 1బీలోని ఉస్మాన్ సాగర్ నుంచి బాపూఘాట్ వరకు రెండు స్ట్రెచ్ లను అభివృద్ది చేసేందుకు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉత్తర్వులను జారీ చేసింది.
Also Read: Revanth Grandson: మనవడి కోసం పూరీలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి!
ఇందుకు గాను మొత్తం రూ. 7345.12 కోట్ల ఖర్చవుతుందని ప్రతిపాదనలు సమర్పించగా, ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల తన గ్రాంటు వాటాగా రూ. 2845.12 కోట్లకు పరిపాలనపరమైన మంజూరీని ఇవ్వగా, మిగిలిన రూ. 4500 కోట్ల నిధులను ఏషియన్ డెవలప్ మెంట్ బ్యాంక్ నుంచి రుణంగా తీసుకునేందుకు అనుమతినిస్తున్నట్లు సర్కారు ఆదేశాల్లో పేర్కొంది. ఈ రుణాన్ని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఆర్ డీసీఎల్) మేనేజింగ్ డైరెక్టర్ రుణం తీసుకునేందుకు అనుమతిస్తున్నట్లు సర్కారు ఆదేశాల్లో పేర్కొంది. ఈ పనులన్నీ ఇంజనీరింగ్ ప్రోక్యూర్ మెంట్, కనస్ట్రక్షనే మోడ్ లో చేపట్టాలని కూడా సర్కారు ఆదేశాల్లో సూచించింది.
చారిత్రాత్మకమైన మూసీ నది తొలుత హైదరాబాద్ పరిసరాల్లో సాగు, తాగునీటి అవసరాలను తీర్చేది. కాల్రమేనా పెరుగుతూ వస్తున్న పట్టణీకరణ, జనాభా వంటి కారణాలతో మూసీ లోకి సీవరేజీని వదలటం, క్రమంగా కబ్జాలు పెరగటం వంటివి జరిగాయి. హైదరాబాద్ నగరంలో మూసీ ప్రవహిస్తున్న సుమారు 55 కిలోమీటర్ల పొడువున రోజుకి 1400 మిలియన్ లీటర్ల మానవ వ్యర్థాలు, పారిశ్రామిక వ్యర్థాలతో కూడిన నీరు చేరుతుందని ఇప్పటికే అధికారులు అంఛనా వేశారు. ఈ మురుగు నీరు చేరే ప్రాంతాలను గుర్తించి అక్కడ సీవరేజీ ట్రీట్ మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేసి, మురుగు నీటిని శుద్ధి చేసిన తర్వాతే మూసీ నదిలోకి విడుదల చేయాలని కొన్ని దశాబ్దాలుగా పాలకులు ప్రకటనలు చేస్తున్నారే గానీ, కార్యరూపం దాల్చటం లేదన్న విమర్శలున్నాయి. రాజేంద్రనగర్, నార్సింగ్ పరిసర ప్రాంతాల్లో స్వచ్చంగా మంచినీటితో ప్రవహించే మూసీ నది హైదరాబాద్ నగరం సరిహద్దుల్లోకి చేరగానే మూరికి కూపంగా, కాలుష్య కాసారంగా మారిపోయింది.
జోన్ 1ఏ పరిధిలోని హిమాయత్ సాగర్ నుంచి బాపూఘాట్ వరకు, అలాగే జోన్ 1బీలోని ఉస్మాన్ సాగర్ నుంచి బాపూఘాట్ వరకు రెండు స్ట్రెచ్ లను అభివృద్ది చేసేందుకు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉత్తర్వులను జారీ చేయటంతో పాటు జోన్ల వారీగా అభివృద్ది చేసేందుకు, మొత్తం నిధులలో ఆరు శాతాన్ని ఆపరేషన్, మెయింటనెన్స్ కు నిధులను కూడా కేటాయించింది. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ ప్రాజెక్టు కింద జోన్ 1ఏ లో భాగంగా హిమాయత్ సాగర్ నుంచి బాపూఘాట్ గాంధీ సరోవర్ వరకు 9.20 కిలోమీటర్ల స్ట్రెచ్ కు మొత్తం ఖర్చు రూ. 3232.01 కోట్లు కాగా, ఇందులో రూ. 3104 కోట్లు అంచనా వ్యయం కాగా, ఆపరేషన్, మెయింటనెన్స్ కోసం ( ఆరు శాతం) అంటే రూ. 128.01 కోట్లుగా కేటాయిస్తున్నట్లు సర్కారు ఆదేశాల్లో స్పష్టం చేసింది.
అలాగే జోన్ 1బీ లో చేపట్టే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ ప్రాజెక్టులో భాగంగా ఉస్మాన్ సాగర్ జలాశయం నుంచి బాపూఘాట్ గాంధీ సరోవర్ వరకు దాదాపు 11.80 కిలోమీటర్ల పొడువున అభివృద్దికి రూ. 4113.11 కోట్లు కాగా, అంచనా వ్యయం రూ. 3950 కోట్లుగా, అందులో ఆపరేషన్, మెయింటనెన్స్ కు ఆరు శాతం అంటే రూ. 163.11 కోట్లను కేటాయిస్తున్నట్లు కూడా ఆదేశాల్లో సర్కారు క్లారిటీ ఇచ్చింది. మొత్తం రెంఢు జోన్లకు అంచనా వ్యయం రూ. 7054 కోట్ల కాగా, ఆపరేషన్, మెయింటనెన్స్ కోసం ఆరు శాతం రూ. 291.12 కోట్లతో కలిపి మొత్తం రూ. 7345.12 కోట్లకు పరిపాలనపరమైన మంజూరీ ఇస్తున్నట్లు సర్కారు పేర్కొంది.
Also Read: BSNL మహా అద్భుతం.. ఏకంగా రూ.1.34 లక్షల ఫోన్ లాంచ్.. ప్రత్యేకత తెలిస్తే ఫ్యూజులు ఔట్!