Hyderabad Flyover : హైదరాబాద్ అంటేనే అంతా హైటెక్. మెట్రోపాలిటన్ సిటీలో అనేక వండర్స్. ఐటీ, ఫార్మా, రియల్ ఎస్టేట్, ఎడ్యుకేషన్, మెడిసిన్.. ఇలా అనేక రంగాల్లో దూసుకుపోతోంది. కోటికి పైగా జనాభాతో హడావుడిగా ఉంటుంది. అంతేనా? అన్నీ పాజిటివ్ థింగ్సేనా? అంటే కానే కాదు. సమస్యలూ చాలానే ఉన్నాయి. వర్షం పడితే తెలుస్తుంది భాగ్యనగరం గొప్పతనమేంటో. ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుంటే ఉంటుంది అసలు టార్చర్ అంటే ఏంటో. అందుకే, సిటీ ట్రాఫిక్‌పై అధికారులు బాగా ఫోకస్ పెట్టారు. ఎక్కడికక్కడ ఫ్లైఓవర్లు, స్కై వేస్, అండర్‌పాస్‌లతో ప్రాబ్లమ్ రెక్టిఫై చేస్తున్నారు. ORR, రింగ్ రోడ్లతో సిటీపై వాహనాల వెయిట్ పడకుండా మేనేజ్ చేస్తున్నారు. అలాంటిదే లేటెస్ట్‌గా మరో ఫ్లైఓవర్ హైదరాబాద్ ఐటీ సెక్టార్‌లో ఓపెనింగ్‌కు రెడీగా ఉంది. అదే.. కోకాపేట్ ట్రంపెట్ ఫ్లైఓవర్.
ఓఆర్ఆర్‌కు 22వ ఇంటర్‌చేంజ్
మెలికలు తిరుగుతూ, హోయలు పోతూ.. కోకాపేట జంక్షన్‌లో ఖతర్నాక్‌గా కొలువుదీరింది. పటాన్‌చెరు, గచ్చిబౌలి, శంషాబాద్.. ఈ రూట్‌లో ట్రాపిక్‌ను సులభతరం చేయడానికి కోకాపేట్, నియోపోలిస్ దగ్గర ట్రంపెట్ ఆకారంలో ఫ్లైఓవర్‌ను పూర్తి చేశారు. ఇందుకోసం రూ.65 కోట్లు ఖర్చు చేశారు. ORRతో యాక్సెస్ ఉండేలా నిర్మించారు. రింగ్ రోడ్‌కు 22వ ఇంటర్‌చేంజ్ కానుంది. త్వరలోనే HMDA దీనిని ప్రారంభించనుంది.
5 ఎగ్జిట్.. 3 ఎంట్రీ లేన్స్
530 ఎకరాల్లో విస్తరించి ఉన్న కోకాపేట లేఅవుట్‌లోని మూవీ టవర్స్ సమీపంలో ట్రంపెట్ ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. ఇది ‘ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్’ ఇంటర్‌చేంజ్ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. పటాన్‌చెరు, శంషాబాద్ వైపు ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలు ఉన్నాయి. ఒకే ట్రంపెట్‌తో రెండు ఎంట్రీ ర్యాంప్‌లు, రెండు ఎగ్జిట్ ర్యాంప్‌లు ఉండటం దీని స్పెషాలిటీ. ఈ కొత్త ఫ్లైఓవర్‌పై ఎనిమిది టోల్ బూత్‌లను నిర్వహిస్తారు. ఇందులో ఐదు ఎగ్జిట్ లేన్‌లు, మూడు ఎంట్రీ లేన్‌లు ఉంటాయి.
కోకాపేట కెవ్వు కేక..
ఇప్పుడు హైదరాబాద్ సిటీలో హ్యాపెనింగ్స్ అన్నీ కోకాపేట సైడే. గతంలో మాదాపూర్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లు ఐటీ హబ్‌గా ఉండేవి. ఇప్పుడు కోకాపేట నియోపోలిస్ వైపు మార్కెట్ షిఫ్ట్ అవుతోంది. గత ఏడాది ఆన్‌లైన్ వేలంలో ఇక్కడి భూమి ఎకరాకు రూ.100 కోట్లతో.. హైదరాబాద్ హిస్టరీలోనే రికార్డు ధర పలికింది. నియోపోలిస్ సమీపంలో లగ్జరీ అపార్ట్‌మెంట్స్, విల్లాస్, కమర్షియల్ బిల్డింగ్స్, మల్టీనేషనల్ కంపెనీల ఆఫీసులు అధికంగా ఉన్నాయి. ఫలితంగా ట్రాఫిక్ కూడా భారీగా పెరిగింది. అందుకే, మరో ఓఆర్ఆర్ ఇంటర్‌చేంజ్ రెడీ అయింది. ట్రంపెట్ ఫ్లైఓవర్‌తో ట్రాఫిక్ కష్టాలు కాస్తైనా తీరినట్టే అంటున్నారు.