School incident: స్కూల్ అంటే పిల్లలకి పుస్తక విద్య మాత్రమే కాకుండా, మానవత్వం నేర్పే చోటు. కానీ హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ మన్సురాబాద్‌లో జరిగిన ఘటన విన్నవారికి షాక్ తగలకుండా ఉండదు. తల్లిదండ్రులు నమ్మి తమ పిల్లలను అప్పగించిన ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్, రెండో తరగతి విద్యార్థిని పై చూపిన క్రూరత్వం చూసి ఎవరి రక్తం మరిగిపోదు? కొట్టి, కళ్లలో పెన్సిల్ పొడిచి, నోటికి ప్లాస్టర్ వేసి మాట్లాడకుండా చేయడం ఏంటి? అది కూడా చిన్నారిపై! ఈ దారుణం స్కూల్ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఇప్పుడు ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, విద్యా వ్యవస్థలోని చీకటి కోణాన్ని బయటపెడుతోంది.
హైదరాబాద్ ఎల్బీనగర్ పరిధిలోని మన్సురాబాద్ బిర్లా ఓపెన్ మైండ్స్ స్కూల్‌లో రెండో తరగతి చదువుతున్న చిన్నారి సాయి నందన్ భయానక అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. అక్కడ పనిచేస్తున్న ఒక టీచర్, పాఠం బోధించే బదులు పాఠం నేర్పించాలనే పేరుతో, అర్ధం కాని కోపంతో విద్యార్థిని పీడించింది.
విద్యార్థి తల్లిదండ్రుల వివరాల మేరకు.. ఆ రోజు సాయి నందన్ క్లాస్‌లో చిన్న తప్పు చేశాడో, లేక ముక్కు సరిగా తుడుచుకోలేదో తెలియదు కానీ టీచర్ క్షణంలో ఆగ్రహం వ్యక్తం చేసింది. మొదట గట్టిగా కొట్టింది. ఆపై అంతటితో ఆగకుండా బాలుడి కళ్లలోనే పెన్సిల్‌తో పొడిచింది. తరువాత నోటికి ప్లాస్టర్ వేసి మాట్లాడకుండా చేసింది. ఈ దారుణం అంతటితో ముగియలేదు. గాయం, భయంతో వణికిపోతున్న బిడ్డను ఆసరాగా చూసుకోవాల్సిన ఆ టీచర్, బాలుడి మనసులో జీవితాంతం మాయం కాని గాయాన్ని మిగిల్చింది.
విద్యార్థి తల్లిదండ్రులు మాట్లాడుతూ దాదాపు నెలరోజులుగా మా బిడ్డకు చికిత్స అందిస్తున్నాం. కళ్లలో గాయాలయ్యాయి, మానసికంగా కూడా భయపడ్డాడు. స్కూల్ యాజమాన్యంను ఈ విషయంపై ప్రశ్నించగా, వారు వివరణ ఇవ్వడం బదులు మమ్మల్ని ఒక గదిలో బంధించి కొట్టారు. మాకూ గాయాలయ్యాయని మీడియా ముందు కన్నీటి పర్యంతమయ్యారు. వారు ఈ సంఘటనపై చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. పిల్లల భద్రత ఎక్కడ? ఇలాంటి టీచర్లు పాఠశాలల్లో ఉండటమే ప్రమాదమని వాపోయారు.
Also Read: Rain Update: మరో నాలుగు రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు తస్మాత్ జాగ్రత్త..!
సీసీటీవీ సాక్ష్యం
ఈ ఘటనపై పెద్ద చర్చ మొదలయ్యింది. స్కూల్‌లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయిన వీడియోలో, టీచర్ బాలుడిని కొడుతూ, పెన్సిల్‌తో కంటికి దగ్గరగా తీసుకెళ్తూ కనిపించింది. ఈ వీడియో బయటకు రావడంతో, సోషల్ మీడియాలో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీచరా లేక రాక్షసులా? అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రజల స్పందన
ప్రస్తుతం ఈ ఘటన హైదరాబాదులోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విద్యార్థులపై ఇలాంటి హింసను అరికట్టేలా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బాలల హక్కుల సంఘాలు, మానవ హక్కుల కార్యకర్తలు కూడా ఈ కేసును సీరియస్‌గా తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.nచైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఇప్పటికే స్కూల్‌పై నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఈ టీచర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, సామాజిక సంస్థలు ఒత్తిడి పెంచుతున్నాయి. పిల్లలపై హింసకు చోటు లేకూడదన్న నినాదం మళ్లీ జోరందుకుంది.
చిన్నారి సాయి నందన్‌పై జరిగిన ఈ దారుణం, ఒక పిల్లవాడి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మాత్రమే కాదు, విద్యా వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని కూడా దెబ్బతీసింది. టీచర్ అనే పదానికి ఉన్న గౌరవాన్ని మసకబార్చింది. ఇప్పుడు అందరి కళ్లూ ప్రభుత్వంపై, పోలీసులపై ఉన్నాయి. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూడాలంటే కఠిన శిక్షలు తప్పనిసరి.