Hyderabad Metro: స్వేచ్ఛ బ్యూరో: పట్టణీకరణ, ట్రాఫిక్, రద్దీ వేగంగా పెరుగుతున్న హైదరాబాద్ మహానగరంలో కేవలం నామమాత్రపు ఛార్జీలకు ప్రయాణికులను ఎంతో సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేర్చుతున్న హైదరాబాద్ మెట్రో రైలును సర్కారు టేకోవర్ చేసేందుకు దాదాపు అన్ని అడ్డంకులు తొలగిపోయినట్టే. నగర పట్టణ రవాణా మౌలిక వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలకమైన మరో నిర్ణయం తీసుకుంది.
ఢీల్లిలో అగ్రిమెంట్
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా రూ.13,600 కోట్ల వర్కింగ్ క్యాపిటల్ రీఫైనాన్సింగ్ పొందుతూ ఢిల్లీలో అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కే. రామకృష్ణారావు, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ మనోజ్ కుమార్ లు అగ్రిమెంట్ పత్రాలపై సంతకాలు చేశారు. దీంతో హైదరాబాద్ మెట్రోరైలు ఫేజ్-1 ను సర్కారు సొంతగా నిర్వహించుకునేందుకు ఫేజ్-1 లో మిగిలి ఉన్న ఎంజీబీఎస్ నుంచి ఫలక్ నుమా కారిడార్ పనులను కూడా మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు సర్కారు ఫోకస్ చేయనుంది.
మెట్రో రైలు కీలక పాత్ర
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కే. రామకృష్ణారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో సమర్థవంతమైన, సుస్థిరమైన, ప్రజలకు అనుకూలమైన ప్రజా రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. దేశ ఆర్థికాభివృద్ధికి హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఎదుగుతుందని, వేగంగా అభివృద్ది చెందున్న నగరంలో అభివృద్ధికి తగినట్టుగానే మెట్రో రైలు సేవలను విస్తరించటం చాలా అవసరమని పేర్కొన్నారు. ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు నగర జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో మెట్రో రైలు కీలక పాత్ర పోషిస్తోందన్నారు.
మెట్రో రైలు ప్రాజెక్టుకు దీర్ఘకాలిక ఆర్థిక బలం
ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రూ.13,600 కోట్ల రీఫైనాన్సింగ్ తో హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు గణనీయమైన ఆర్థిక ఉపశమనం లభించిందని, దీని వల్ల ప్రాజెక్టుకు దీర్ఘకాలిక ఆర్థిక బలం చేకూరిందని పేర్కొన్నారు. ప్రస్తుత రుణ భారం తగ్గడంతో పాటు భవిష్యత్ మెట్రో విస్తరణ ప్రణాళికలకు ఇది ఎంతో దోహదపడుతుందన్నారు. ఈ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడంలో సహకరించిన కేంద్ర ప్రభుత్వం, ఐఆర్ఎఫ్‌సీ, ఎల్ అండ్ టీ బృందం, హెచ్ఎంఆర్ఎల్, సంబంధిత అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంఆర్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ శివేంద్ర ప్రతాప్, కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుల ప్రత్యేక కార్యదర్శి అద్వైత్ కుమార్ సింగ్, ఎల్ అండ్ టీ మెట్రో రైల్ (హైదరాబాద్) ప్రతినిధి కేవీబీ రెడ్డి, సీఎఫ్‌వో ఏవీఆర్ శ్రీనివాస శర్మతో పాటు ఐఆర్ఎఫ్‌సీ, ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
రెండు దశాబ్దాల కాల పరిమితితో రుణం
ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోరైలు ఫేజ్ -1 ను సర్కారు టేకోవర్ చేసేందుకు ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రూ. 13, 600 కోట్ల రీ ఫైనాన్స్ అగ్రిమెంట్ ను రానున్న 20 ఏళ్లలో, ప్రతి మూడు నెలలకోసారి చెల్లించేలా ఈ లోన్ అగ్రిమెంట్ జరిగినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. లార్సెన్ అండ్ టుబ్రో లిమిటెడ్ (ఎల్ అండ్ టీ) మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్‌లోని 100 శాతం వాటాను హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ) ద్వారా తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న అనంతరం ఈ రీఫైనాన్సింగ్ అమలులోకి వచ్చింది. దీంతో హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు పూర్తి స్తాయిలో గవర్నమెంట్ ప్రాపర్టీగా మారింది.
సురక్షితమైన రవాణా సేవలు
రూ.13,600 కోట్ల రుణాన్ని నాన్ కన్వర్టిబుల్ డిబెంచర్లు, కమర్షియల్ పేపర్లు, వర్కింగ్ క్యాపిటల్ రీఫైనాన్సింగ్‌కు వినియోగించనున్నారు. ఈ లావాదేవీకి తెలంగాణ ప్రభుత్వ రీపేమెంట్ కు ఖచ్చితమైన చెల్లింపు హామీ, రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీ, ఆర్‌బీఐ మద్దతుతో డైరెక్ట్ డెబిట్ మాండేట్ వంటి బలమైన క్రెడిట్ ఎన్‌హాన్స్‌మెంట్ వ్యవస్థ ఈ రుణ లావాదేవీకి మద్దతుగా నిలిచాయి. 69.2 కిలోమీటర్ల పొడవుతో మూడు కారిడార్లు, 57 స్టేషన్లతో నిర్మితమైన హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-1 దేశంలో పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో అభివృద్ధి చేసిన అతిపెద్ద మెట్రో ప్రాజెక్టు. ప్రస్తుతం ఈ నెట్‌వర్క్ ద్వారా రోజుకు 5 లక్షల పై చిలుకు ప్రయాణికులు అత్యాధునికమైన, ఎంతో సురక్షితమైన రవాణా సేవలు పొందుతున్నారు.
కీలక మైలురాయిగా రీఫైనాన్సింగ్ అగ్రిమెంట్
ఈ రీఫైనాన్సింగ్ అగ్రిమెంట్ తో హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు ఆర్థికంగా మరింత స్ట్రాంగ్ కావటంతో పాటు కొత్త కారిడార్లు, అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలకు మెరుగైన కనెక్టివిటీ, చివరి మైలు కనెక్టివిటీ వంటి విస్తరణ ప్రణాళికలను వేగవంతంగా సర్కారు అమలు చేసేందుకు వెసులుబాటు కల్గించదనే చెప్పవచ్చు. హైదరాబాద్ మెట్రో రైలు భవిష్యత్ విస్తరణకు ఈ రీఫైనాన్సింగ్ అగ్రిమెంట్ ఒక కీలక మైలురాయిగా సర్కారు భావిస్తుంది. సుస్థిరమైన, సమర్థవంతమైన, ఎలాంటి కాలుష్యానికి స్థానం లేని ఎకో ఫ్రెండ్లీ పబ్లిక్ ట్రాన్స్ పోర్టు సిస్టమ్ ను అందుబాటులోకి తేవటంతో సర్కారు ప్రయత్నం మరో అడుగు ముందుకు పడింది. మున్ముందు నగరంలోని అన్ని ప్రాంతాలకు మెట్రో కనెక్టివిటీ పెంచాలన్న సర్కారు ప్రయత్నానికి కాస్త ప్రోత్సాహాం లభించినట్టయింది.
Also Read: ఎవరు పడితే వారు మాట్లాడితే ఊరుకోం.. ప్రత్యర్థులు, అంతర్గత శత్రువులపై పవన్ కళ్యాణ్ ఫైర్