BigTV English

 Hyderabad Mmts : రాజధాని భవిష్యత్‌కు ఎమ్ఎమ్‌టీఎస్ విస్తరణ అవశ్యం

 Hyderabad Mmts : రాజధాని భవిష్యత్‌కు ఎమ్ఎమ్‌టీఎస్ విస్తరణ అవశ్యం

Hyderabad Mmts : మన విశ్వనగరం హైదరాబాద్‌లో మెట్రో రైళ్లు పరుగులు పెడుతున్నాయి. ఇప్పుడు రెండో దశలో శంషాబాద్‌ విమానాశ్రయం వరకూ లైన్లను వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు షురూ చేసింది. అందుకనుగుణంగా అధికారులు కార్యాచరణను సిద్ధం చేశారు. ఇది నిజంగా, హర్షించదగిన విషయం. అయితే, పేదలు, చిన్న చితకా వ్యాపారులు, దినసరి కూలీలు, అడ్డా మీది కూలీలకు అత్యధికంగా ఉపయోగపడే ఎమ్‌ఎమ్‌టీఎస్‌ రైళ్లను, వాటి లైన్ల విస్తరణను కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


వాస్తవానికి మెట్రో రైళ్లతో పోలిస్తే ఎమ్‌ఎమ్‌టీఎస్‌ రైళ్ల ఛార్జీలు చాలా తక్కువ. ఎంతలా అంటే ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌ నుంచి హైటెక్‌ సిటీ వరకూ మెట్రోలో వెళ్లాలంటే కనీసం రూ.100 వరకూ పెట్టాల్సిందే. అదే సమయంలో అంతే దూరంగల విద్యానగర్‌ నుంచి శేరిలింగంపల్లి వరకూ ఎమ్‌ఎమ్‌టీఎస్‌లో రూ.10కే ప్రయాణం చేయొచ్చు. నమ్మటానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇది వాస్తవం. రోజూ ఉద్యోగాలకు వెళ్లే వేతన జీవులు, నగర శివార్లలో కొలువులు చేసే ప్రైవేటు టీచర్లు, ఇతర కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది, కార్మికులు, గృహాల్లో పనులు చేసుకుని పొట్టపోసుకునే మహిళలు, విద్యార్థులు నెలవారీ పాసులు తీసుకుని అతి తక్కువ ఖర్చుతో ఎమ్ఎమ్‌టీఎస్ రైళ్లలో నెలంతా తిరుగుతున్నారు.

మెట్రో కంటే రెండు దశాబ్దాల ముందు ఏర్పడిన ఈ వ్యవస్థ నేటికీ మెట్రో, ఆర్టీసీల కంటే చౌకగా, ఉన్నంతలో మెరుగైన ప్రజారవాణా మాధ్యమంగా నిలిచింది. తెలంగాణ వచ్చిన తర్వాత పాలకులు దాని విస్తరణ, విస్తృతిపై ఎంత మాత్రమూ శ్రద్ధ చూపకపోవటంతో మలి దశ ఎమ్ఎమ్‌టీఎస్ రైలు సేవల విస్తరణ కనీసం చర్చకైనా రాకపోవటం విషాదం.


ALSO READ : హైదరాబాద్‌ను రోల్ మోడల్‌గా మార్చాలి: సీఎం రేవంత్ రెడ్డి

ఇక, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రీజినల్ రింగ్ రోడ్ రాకతో నగరపు ప్రస్తుత శివారు ప్రాంతాల హద్దులు చెరిగిపోనున్నాయి. ఫోర్త్ సిటీ, స్కిల్, హెల్త్ హబ్‌లు కొలువు దీరితే నగరం మరింత విస్తరించనుంది. ఈ నేపథ్యంలో నగరంలోని పౌరులకు అవసరమైన సేవలు అందించేందుకు లక్షల సంఖ్యలో శ్రామిక శక్తి అవసరం కానుంది. అయితే, వారంతా నగరంలో జీవించే అంత ఆదాయం సమకూరదు కనుక వారు శివారు ప్రాంతాల నుంచే రావాల్సి ఉంటుంది.

ఈ నేపథ్యంలో మెట్రో సేవల విస్తరణతో బాటుగా కేంద్రం సహకారంతో ఎమ్‌ఎమ్‌టీఎస్ సేవలను విస్తరిస్తే, ఆ ప్రాంతాలు త్వరగా అభివృద్ధిలోకి రావటమే గాక శివారు ప్రాంతాల వారు చౌకగా ప్రజారవాణా సదుపాయాన్ని పొందగలుగుతారు. తద్వారా నగరంలో ట్రాఫిక్‌ ఇక్కట్లను మరింతగా తగ్గించొచ్చు. వాహనాల కాలుష్యం నుంచి జనాలకు ఎంతో ఉపశమనం కలిగించొచ్చు. అమెరికా లాంటి దేశాలలో నేటికీ విధి నిర్వహణ కోసం 90 కి.మీ దూరాలను రైళ్లలో వెళ్లటం మనం చూస్తున్నాం. కనుక ఇక్కడా ఎమ్‌ఎమ్‌టీఎస్‌ రైలు సేవలు అందుబాటులోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సి ఉంది.

Related News

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Big Stories

×