ట్రాఫిక్ చలానాలు కట్టలేక బైక్ ని తగలబెట్టిన వ్యక్తి.
బండి ఖరీదు కంటే చలానాలు ఎక్కువగా ఉండటంతో బైక్ ని పోలీస్ స్టేషన్లో వదిలి వెళ్లిన బైకర్.
పాతిక వేల చలానా కట్టి రికార్డ్ బ్రేక్ చేసిన వాహనదారుడు.
ఇలాంటి వార్తలు నిత్యం మీడియా, సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం. కానీ అసలు ట్రాఫిక్ ఉల్లంఘనకు వేల రూపాయల చలానాలు ఎందుకు అని ఎప్పుడైనా, ఎవరైనా ఆలోచించారా..? అలా ఆలోచించాడు కాబట్టే హైదరాబాద్ కి చెందిన రాఘవేంద్ర చారి నేరుగా హైకోర్టు మెట్లెక్కాడు. ట్రాఫిక్ పోలీసులను కోర్టుకీడ్చాడు. నిబంధనలకు మించి చలాన్లు వసూలు చేస్తున్నారంటూ ఫిర్యాదు చేశాడు. తక్కువ జరిమానాతో సరిపోయే వాటికి వేల రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపించాడు.
అసలేం జరిగింది..?
హైదరాబాద్ కి చెందిన రాఘవేంద్ర చారి ఈ ఏడాది మార్చి 17న బైక్ పై వెళ్తూ వెనక మరో ఇద్దర్ని ఎక్కించుకున్నాడు. ట్రిపుల్ రైడింగ్ కావడంతో పోలీసులు చలానా రాశారు. 1200 రూపాయలు చెల్లించాలంటూ నోటీసుపంపించారు. రాఘవేంద్ర చారి చలానా కట్టి సైలెంట్ అయిపోలేదు. అసలు ట్రిపుల్ రైడింగ్ కి ఇంత చలానా ఏంటా అని ఆరా తీశాడు. 1988 మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 177 ని క్షుణ్ణంగా పరిశీలించాడు. ట్రిపుల్ రైడింగ్ కి మోటారు వాహనాల చట్టం ప్రకారం రూ. 100 నుంచి రూ. 300 మాత్రమే విధించాలని ఉంది. కానీ పోలీసులు రూ.1200 ఫైన్ వేయడంతో ఆయన అవాక్కయ్యారు. చట్టాలని కూడా ఉల్లంఘించి ముక్కుపిండి చలాన్లు విధిస్తున్న ట్రాఫిక్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోర్టుని ఆశ్రయించాడు. చిన్న చిన్న నేరాలకు కూడా వేలకు వేలు ఫైన్లు వేస్తున్నారంటూ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులపై ఆయన తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశాడు.
కోర్టు ఆదేశం..
వాహనదారుడి ధర్మాగ్రహాన్ని కోర్టు పరిగణలోకి తీసుకుంది. అసలు అంతంత చలాన్లు ఎందుకు విధిస్తున్నారో వివరించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ట్రాఫిక్ పోలీసులు చట్టబద్ధమైన పరిమితులను మించి జరిమానాలు ఎందుకు విధిస్తున్నారో వివరణ సమర్పించడానికి హోం శాఖకు వారం రోజులు గడువు ఇచ్చింది. పిటిషనర్ తరపున కోర్టులో వాదనలు వినిపించిన న్యాయవాది విజయ్ గోపాల్.. ట్రాఫిక్ పోలీసుల తీరుని తప్పుబట్టారు. చట్టం ద్వారా నిర్దేశించబడిన జరిమానాలు తప్ప, అంతకు మించి అతిగా జరిమానాలతో పౌరులను శిక్షించకూడదని ఆయన అన్నారు. ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్‌ను నియంత్రించడం మర్చిపోయారని, తమ శాఖకు ఆదాయాన్ని పెంచాలనే దురుద్దేశంతోనే ఇలా ఎడా పెడా చలాన్లు విధిస్తున్నారని కోర్టులో వాదించారు. కోర్టు ఈ వాదనలను పరిగణలోకి తీసుకుంది. అంత భారీస్థాయిలో ఎందుకు చలాన్లు విధిస్తున్నారో వివరించాలని ట్రాఫిక్ పోలీసులను కోరింది. హోం శాఖకు వారం రోజులు గడువిచ్చింది.
ఎందుకిలా?
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించేవారిని జరిమానాలతో భయపెడితే రెండోసారి ఆ తప్పు చేయరనేది పోలీసుల వాదన. అయితే అత్యవసర సమయాల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడాన్ని తీవ్ర నేరంగా పరిగణించడం కూడా సరికాదనేది వాహనదారుల వాదన. చిన్న చిన్న తప్పులకు అంతంత పెద్ద చలానాలు వేయడం సరికాదని వారు అంటున్నారు. చట్టంలో ఉన్నట్టుగానే జరిమానాలు విధించాలని, సొంత నిర్ణయాలు సరికావని వాదిస్తున్నారు.