Hyderabad News: హైదరాబాద్ లో రేపు గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ప్రకటన జారీ చేసింది. ఈ ట్రాఫిక్ ఆంక్షలు గమనించి నగరవాసులు ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి సహకరించాలని ట్రాఫిక్ పోలీస్ అధికారులు కోరారు.
యావత్ భారతావని ఆదివారం 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సమాయత్తమవుతోంది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో రిపబ్లిక్ డే వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించనున్నారు. ఇప్పటికే పోలీస్ దళాలు రిహార్సల్స్ ప్రక్రియను పూర్తిచేశాయి.
అయితే పరేడ్ గ్రౌండ్ లో రిపబ్లిక్ డే వేడుకలు జరుగుతున్న సందర్భంగా, ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు తెలంగాణ పోలీస్ శాఖ ప్రకటన విడుదల చేసింది. అలాగే సాయంత్రం రాజ్ భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సందర్భంగా ఆ రహదారిలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు.
ఉదయం 7:30 గంటల నుండి 11:30 గంటల వరకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని, సాయంత్రం 4 గంటల నుండి 7 గంటల వరకు రాజ్ భవన్ సమీపంలో ఆంక్షలు విధించడం జరిగిందని పోలీసులు తెలిపారు. పంజాగుట్ట, గ్రీన్ ల్యాండ్స్, బేగంపేట్, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ మార్గంలో వచ్చే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలలో వెళ్లాలని సూచించారు.
Also Read: Jagtial News: ఇదేం పోయే కాలమో.. పాఠశాల ఆవరణంలో అన్నీ అవే..
అలాగే పరేడ్ గ్రౌండ్ లో గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా టివోలీ ఎక్స్ రోడ్స్, ప్లాజా ఎక్స్ రోడ్స్ మార్గాలను మూసి వేయనున్నట్లు, ఈ విషయాన్ని నగరవాసులు గమనించి సహకరించాలని పోలీసులు కోరారు. అంతేకాకుండా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వెళ్లే ప్రయాణికులు ముందుగా బయలుదేరి రైల్వే స్టేషన్ కు చేరుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.