President Droupadi Murmu : భారతీయులుగా మనందరికీ ఏకైక ఉమ్మడి గుర్తింపు అంటే మన రాజ్యాంగమే అని రాజ్యాంగమే అని.. దేశ ప్రజలందరికీ ఇది ఒకే కుటుంబంగా కలుపుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి.. దేశ పౌరులకు అభినందనలు తెలిపారు. భారత్ కు స్వేచ్ఛా స్వాంతంత్ర్యాలు వచ్చిన తర్వాత.. మూడేళ్ల సుదీర్ఘ చర్చల తర్వాత 1949లో నవంబర్ 26న రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఆమోదించిందని గుర్తు చేశారు. ఆ రోజుకు చరిత్రలో ప్రత్యేక చరిత్ర ఉందన్న రాష్ట్రపతి నవంబర్ 26 ను సంవిధాన్ దివస్ అంటే రాజ్యాంగ దినోత్సవంగా 2015 నుంచి జరుపుకుంటున్న విషయాన్ని తెలిపారు.
75 ఏళ్ల గణతంత్ర దినోత్సవం పౌరులందరు గర్వించదగ్గ రోజన్న రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము.. చాలా మంది దేశానికి 75 ఏళ్లు రెప్పపాటు సమయం అంటారు. కానీ.. ఈ 75 ఏళ్లు భారత్ కు అలా కాదు అన్నారు. భారత్ లో చాలా కాలంగా నిద్రాణమైన ఆత్మ మళ్లీ మేల్కొందని ప్రశంసించిన రాష్ట్రపతి.. అంతర్జాతీయంగా భారత్ ప్రత్యేక, సముచిత స్థానాన్ని తిరిగి పొందేందుకు అడుగులు వేస్తోందని ప్రకటించారు. పురాతన నాగరికతలలో భారత్ ఒకప్పుడు జ్ఞానానికి కేంద్రంగా విరాజిల్లిందన్నారు. అలాంటి జ్ఞాన భూమిలో చీకటి అధ్యయనం కొన్నాళ్లు వచ్చింది.. దాంతో దేశం తీవ్రమైన దోపిడికి గురైందని వ్యాఖ్యానించారు. బ్రిటీషర్ల దోపిడి కారణంగానే.. దేశంలో పేదరికం నెలకొందన్నారు. కానీ.. ఇప్పుడు అభివృద్ధి పథంలో భారత్ దూసుకుపోతుందని, అంతర్జాతీయంగా అత్యున్నత స్థానంలో నిలిచే క్రమంలో ఉందని అన్నారు.
మాతృభూమిని విదేశీ పాలన కబంధ హస్తాల నుంచి విముక్తి చేసేందుకు గొప్ప త్యాగాలు చేసిన ధైర్యవంతులను ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గుర్తు చేసుకున్నారు. స్వాతంత్ర్య సంగ్రామంలో పోరాడిన వారిలో కొందరు బాగా ప్రసిద్ధి చెందారని, మరికొందరు ఇటీవలి వరకు అంతగా గుర్తింపు పొందలేదని ఆవేదన వ్యక్తం చేసారు. కానీ.. జాతీయ చరిత్రలో ఇప్పుడు నిజమైన వీరులకు స్థానం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. అందులో భాగంగానే స్వాతంత్ర్య సమరయోధుల ప్రతినిధిగా నిలిచిన భగవాన్ బిర్సా ముండా 150వ జయంతిని ఈ ఏడాది నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు.
20వ శతాబ్దపు తొలి దశాబ్దాలలో ఈ వీరుల పోరాటాలు సంఘటితమైన దేశవ్యాప్త స్వాతంత్య ఉద్యమానికి దారి తీశాయన్నారు. మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్, బాబాసాహెబ్ అంబేద్కర్ వంటి వారు ప్రజాస్వామిక నైతికతను చాటుకున్నారన్ని కొనియాడారు. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేవి మనం ఆధునిక కాలంలో నేర్చుకున్న సైద్ధాంతిక భావనలు కావన్న రాష్ట్రపతి.. అవి ఎప్పుడూ మన నాగరికత వారసత్వంలో భాగంగానే ఉన్నాయని అన్నారు. మన రాజ్యాంగ సభ కూర్పు కూడా మన గణతంత్ర విలువలకు నిదర్శనంగా నిలిచిందని అన్న రాష్ట్రపతి ద్రౌపతి ముర్మ్.. ఇందులో దేశంలోని అన్ని ప్రాంతాలు, అన్ని సంఘాల ప్రతినిధులకు చోటు కల్పించారని అన్నారు. ముఖ్యంగా సరోజినీ నాయుడు, రాజకుమారి అమృత్ కౌర్, సుచేతా కృపలానీ, హంసబెన్ మెహతా, మాలతీ చౌదరి వంటి దిగ్గజాలతో సహా 15 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారని గుర్తు చేశారు.
Also Read : పద్మా పురస్కారాల్ని ప్రకటించిన కేంద్రం.. ఈ ఏడాది అవార్డులు అందుకోనున్న వాళ్లు వీళ్లే
గత 75 ఏళ్లుగా భారత రాజ్యాంగం మన పురోగతికి మార్గనిర్దేశం చేసిందని.. ఈ రోజు ముసాయిదా కమిటీకి అధ్యక్షత వహించిన డాక్టర్ అంబేద్కర్, రాజ్యాంగ పరిషత్త్ లోని ఇతర విశిష్ట సభ్యులు, వారితో సంబంధం ఉన్న వివిధ అధికారులకు, కష్టపడి పనిచేసి ఈ అద్భుతమైన పత్రాన్ని మనకు అందించిన ఇతరులకు వినమ్రంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అంటూ ప్రసంగాన్ని ముగించారు.