Spare Wheel Theft: హైదరాబాద్ నగరంలో ఖరీదైన కార్లను కలిగి ఉన్నవారు కొద్దిరోజులుగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఊహించని రీతిలో కార్ల స్పేర్ వీల్స్ మాయమవుతుండటంతో వాహనదారులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. అయితే ఈ వరుస దొంగతనాల వెనుక ఉన్నది ఏ సీనియర్ దొంగో కాదని, ఉన్నత చదువులు చదువుతున్న ఒక ఎంబీఏ విద్యార్థి అని తేలడంతో పోలీసులు సైతం విస్తుపోయారు.
పంక్చర్ షాప్ టూల్స్‌తో స్మార్ట్ ప్లాన్
మాసబ్‌ట్యాంక్‌కు చెందిన 23 ఏళ్ల సోబన్ అలీ ఖాన్ అనే ఎంబీఏ ఫస్ట్ ఇయర్ విద్యార్థి ఈ దొంగతనాలకు తెరలేపాడు. ఇతని స్టైలే వేరు! నేరుగా పనిముట్లు కొనకుండా, స్థానిక పంక్చర్ షాపులకు వెళ్లి సెక్యూరిటీ డిపాజిట్ ఇచ్చి టైర్లు ఊడదీసే పనిముట్లను అద్దెకు తీసుకునేవాడు. రాత్రివేళల్లో నిర్మానుష్య ప్రాంతాల్లో పార్క్ చేసిన మహీంద్రా థార్, ఫోర్డ్ ఎండీవర్, ఎకోస్పోర్ట్ లాంటి ఖరీదైన కార్ల స్పేర్ వీల్స్‌ను క్షణాల్లో ఊడదీసేవాడు. చోరీ పూర్తయ్యాక ఆ పనిముట్లను తిరిగి ఇచ్చేసి తన డిపాజిట్ సొమ్మును వసూలు చేసుకునేవాడు.
11 కేసులు.. 15 చక్రాలు స్వాధీనం
హైదరాబాద్‌లోని 10 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇతగాడు ఏకంగా 11 చోరీలకు పాల్పడ్డాడు. నవోదయ కాలనీలో తిరుగుతుండగా గుడిమల్కాపూర్ పోలీసులు ఇతడిని సమర్థవంతంగా అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి రూ.లక్షల విలువ చేసే 12 మహీంద్రా థార్, 2 ఫోర్డ్ ఎండీవర్, 1 ఎకోస్పోర్ట్ వీల్స్‌తో సహా మొత్తం 15 స్పేర్ వీల్స్‌ను స్వాధీనం చేసుకుని, నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు.
వాహనదారులు జాగ్రత్త!
ఈ తరహా విచిత్ర చోరీల నేపథ్యంలో పోలీసులు వాహనదారులను హెచ్చరించారు. వీధుల్లో లేదా నిర్మానుష్య ప్రదేశాల్లో కార్లను వదిలేయకుండా, విధిగా సీసీటీవీ కెమెరాల నిఘా ఉన్న సురక్షిత ప్రాంతాల్లోనే పార్కింగ్ చేసుకోవాలని సూచించారు.
Also Read: కేటీఆర్ ముందే కార్యకర్తలపై మల్లారెడ్డి ఆగ్రహం.. ముఖం పగలగొడతా అంటూ..