Hyderabad Traffic Police: రోడ్డుపై కుయ్.. కుయ్ అంటూ అంబులెన్స్ పరుగులు పెడుతోంది. వాహనదారులు అలర్ట్ అయ్యారు. అంబులెన్స్ కు దారినిస్తూ ట్రాఫిక్ రద్దీ లేకుండా వాహనదారులు పూర్తిగా సహకరించారు. అంబులెన్స్ మాత్రం ఫాస్ట్ గా పరుగులు పెడుతోంది. అంబులెన్స్ లో ఉన్న వ్యక్తి ఎలాగైనా బ్రతకాలని అందరూ కోరుకుంటున్నారు. అంతలోనే అంబులెన్స్ పరుగులు పెట్టడానికి గల కారణం తెలుసుకున్న వాహనదారులు.. ఇలా కూడా అంబులెన్స్ ను ఉపయోగిస్తారా అంటూ నివ్వెర పోయారు. ఈ ఘటన హైదరాబాద్ లోని పంజాగుట్ట వద్ద మంగళవారం జరిగింది. అసలేం జరిగిందో తెలుసుకుంటే, మీరు కూడా నోరేళ్లబెట్టాల్సిందే.
సాధారణంగా అంబులెన్స్ కుయ్.. కుయ్ అంటూ వస్తుంటే, ఎవరో ప్రాణప్రాయ స్థితిలో ఉన్నారని అర్థం. ఆ అర్థానికి మరో అర్థం చెప్పే రీతిలో ఈ ఘటన జరిగింది. అంబులెన్స్ అంటే ప్రాణదాత.. అంబులెన్స్ డ్రైవర్ అంటే ప్రాణాలను కాపాడే దేవుడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని సకాలంలో వైద్యశాలకు తరలించడమే అంబులెన్స్ విధి. ఎవరైనా అంబులెన్స్ వెళ్లే సమయంలో దారినివ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తే వారికి జరిమానా తప్పదు. ఎందుకంటే ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న సమయంలో ప్రతి క్షణం విలువైనది. అందుకే అంబులెన్స్ లకు దారినివ్వడం మన భాద్యత. అయితే ఇక్కడ కూడా అంబులెన్స్ పరుగులు పెడుతూ కుయ్.. కుయ్ అంటూ వెళ్తుండగా, వాహనదారులు దారినిచ్చారు. అసలు విషయం తెలిసి బుద్ది చెప్పారు.
అసలేం జరిగిందంటే..
పంజాగుట్ట ట్రాఫిక్ పోలీసులు మంగళవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. హెల్మెట్ లేని వాహనదారులకు జరిమానాలు విధించడమే కాక, పెండింగ్ చలాన్లపై దృష్టి సారించారు. అలాగే అంబులెన్స్ వాహనాలు సక్రమంగా వినియోగిస్తున్నారా? లేక ఇతర అంశాలకు ఉపయోగిస్తున్నారా అనే కోణంలో తనిఖీలు చేపట్టారు. అంతలోనే ఒక అంబులెన్స్ అతి వేగంతో, కుయ్ కుయ్.. అంటూ వస్తోంది. అలా వచ్చిన అంబులెన్స్ ను ట్రాఫిక్ పోలీసులు అనుమానంతో ఆపారు. లోపల ప్రాణాపాయ స్థితిలో వ్యక్తి ఉన్నాడేమోనన్న ఆలోచనతో వెంటనే తనిఖీ చేసి పంపించేందుకు పోలీసులు లోపలికి ఓ కన్ను వేశారు. ఇక అంతే పోలీసులు షాక్ కు గురయ్యారు. అంత వేగంతో వచ్చిన అంబులెన్స్ లోపల ఉన్న జీవిని చూసి ఔరా అనుకున్నారు.
అయితే అంబులెన్స్ లో వ్యక్తికి బదులుగా పెంపుడు కుక్క ఉంది. కుక్క కూడా జీవినే కదా.. పాపం దెబ్బ తగిలిందేమో అనుకుంటూ పోలీసులు ఆరా తీశారు. కానీ అసలు విషయం తెలిసి జరిమానా విధించారు. పెంపుడు శునకానికి మియాపూర్ లోని ఆస్పత్రిలో కుక్కకు వేసేక్టమీ ఆపరేషన్ కోసం తీసుకువెళ్తున్నానంటూ డ్రైవర్ సమాధానం ఇవ్వడం విశేషం. కుక్కకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం సైరన్ తో అంబులెన్స్ ఉపయోగించడం ఏమిటని పోలీసులు సీరియస్ అయ్యారు.
Also Read: Mysterious Sound: ఆకాశం నుంచి వింత శబ్దాలు.. భయంతో పరుగులు తీసిన జనాలు!
అంబులెన్స్ సైరన్ దుర్వినియోగంపై అంబులెన్స్ యజమాని మీద కేసు నమోదు చేశారు. శునకానికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం కుయ్.. కుయ్ మంటూ రహదారిపై వేగంగా అంబులెన్స్ వాహనాన్ని నడిపినట్లు తెలుసుకున్న వాహనదారులు షాక్ కు గురయ్యారు. ప్రాణాపాయ స్థితిలో ప్రాణాలు కాపాడే అంబులెన్స్ లను ఇలా వినియోగించడం తగదని పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. మొత్తం మీద నగరంలో అంబులెన్స్ లపై ఓ కన్ను వేయాల్సిన అవసరం ఉందని వాహనదారులు కోరుతున్నారు.