Extramarital Affairs: స్వేచ్ఛ బ్యూరో: అగ్నిసాక్షిగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. జీవితాంతం సుఖంలో..కష్టంలో ఒకరికొకరం తోడూనీడగా ఉంటామని ప్రమాణాలు చేస్తున్నారు. ఆ తరువాత పరాయివారితో సంబంధాలు ఏర్పరుచుకుని ఊహించని దారుణాలకు పాల్పడుతున్నారు. వివాహేతర సంబంధాల మోజులో పడి కట్టుకున్న భార్యలను చంపుతున్నవారు కొందరైతే.. తాళి కట్టిన భర్తలను అంతం చేస్తున్నవారు మరికొందరు. తాము చేస్తున్న హత్యల వల్ల ఏ పాపం తెలియని కన్నబిడ్డలు అనాధలుగా మారుతున్నారన్న దానిని గురించి కూడా పట్టించుకోవటం లేదు. ఇటీవలిగా ఈ తరహా నేరాలు తరచూ వెలుగు చూస్తుండటం అన్నివర్గాల్లో కలవరాన్ని కలిగిస్తోంది.
జీవిత భాగస్వామి నచ్చకపోయినా.. వివాహేతర సంబంధం ఏర్పడ్డా మాట్లాడుకుని విడిపోయే అవకాశం ఉంది. అయితే, కొంతమంది ఇలాంటి సమస్యలకు పరిష్కారం హత్యలు చేయటమే పరిష్కారంగా భావిస్తున్నారు. పక్కాగా ప్లాన్ చేసి మరీ ప్రాణాలు తీస్తున్నారు.
కొన్ని ఉదంతాల్లోనైతే ఒళ్లు గగుర్పొడిచే రీతిలో దారుణాలకు తెగబడుతున్నారు. దీనికి నిదర్శనంగా హైదరాబాద్ మీర్ పేట్ లో జరిగిన మాధవి హత్యోదంతాన్ని పేర్కొనవచ్చు. మరదలితో వివాహేతర సంబంధాన్ని ఏర్పరుచుకున్న రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి గురుమూర్తి కట్టుకున్న భార్య మాధవిని తన ఫ్లాట్ లోనే హత్య చేశాడు. ఆ తరువాత మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి వాటిని కుక్కర్లో ఉడికించి మాంసపు ముద్దలుగా మార్చాడు. ఎముకలను గ్రైండ్ చేసి పొడిగా మార్చి తన ఇంటికి కొద్దిదూరంలో ఉన్న పెద్ద చెరువులోకి విసిరేశాడు. మాధవి తల్లిదండ్రులు తమ కూతురు కనిపించటం లేదంటూ ఇచ్చిన ఫిర్యాదుపై కేసులు నమోదు చేసిన మీర్ పేట పోలీసులు వివాహేతర సంబంధం మోజులో గురుమూర్తి చేసిన ఈ రాక్షసాన్ని బయట పెట్టారు.
తాజాగా మియాపూర్ స్టేషన్ పరిధిలో సత్యవతి అనే మహిళ ప్రియుడు మధుసూదన్ రెడ్డి అతని స్నేహితుడు రాజేశ్ కుమార్ తో కలిసి భర్త పెంటేశ్ ను హత్య చేసింది. ముందుగా నిద్రమాత్రలు కలిపిన భోజనం తినిపించి పెంటేశ్ స్పృహ తప్పగానే ముగ్గురు కలిసి గొంతు నులిమి చంపారు. ఆ తరువాత మధుసూదన్ రెడ్డి, రాజేశ్ కుమార్ కలిసి కారులో పెంటేశ్ మృతదేహాన్ని మహారాష్ట్రలోని నల్ దుర్గ్ ప్రాంతానికి తీసుకెళ్లి పెట్రోల్ చల్లి నిప్పంటించారు. నిజామాబాద్ పట్టణ శివార్లలోని న్యాల్కల్ నివాసి సంధ్య పరాయి వ్యక్తితో సంబంధం పెట్టుకుని భర్త ప్రశాంత్ నరాల్లోకి బాత్రూం క్లీనర్ అయిన హార్పిక్ ను ఇంజెక్ట్ చేసి చంపేసింది. ఎంత పక్కాగా ప్లాన్ చేసినా దొరికిపోక తప్పదన్న విషయాన్ని విస్మరిస్తున్నారు. నేరం బయట పడ్డ తరువాత జైళ్లలో కాలం గడుపుతున్నారు.
తమ సుఖం కోసం కట్టుకున్న వారిని హత్యలు చేస్తున్న వాళ్లు చేజేతులా తమ పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. తల్లిదండ్రుల్లో ఒకరు చనిపోయి మరొకరు జైలుకు వెళుతుడటంతో పిల్లలు అనాథలుగా మారుతున్నారు. ఇలాంటి పిల్లలను అక్కున చేర్చుకుని ఆదరించే బంధువులు చాలా తక్కువ సంఖ్యలో కనిపిస్తారు. దాంతో తామేం పాపం చేశామో కూడా తెలియక చిన్నారులు అనాధాశ్రమాల పాలవుతున్నారు. ఒకవేళ బంధువులు చేరదీసినా సహజమైన అనుబంధాలు..ఆప్యాయతలు లేక మానసికంగా కుంగిపోతున్నారు. కొందరు వయసు వచ్చాక నేరాల వైపు వెళుతున్నారు. ఇక, ఇలాంటి దారుణాల వల్ల రెండు వైపుల కుటుంబాలూ చిత్రవధ అనుభవిస్తున్నాయి. పోలీసు అధికారులు వెల్లడించిన ప్రకారం గత ఏడాదిలో రాష్ట్రవ్యాప్తంగా 781 హత్యలు జరిగాయి. వీటిలో సెక్సువల్ జెలసీ కారణంగానే 100 హత్యలు జరగటం గమనార్హం.
లైంగిక కోరికలు సరిగ్గా తీరకపోవడమే అన్ని సందర్భాల్లోనూ వివాహేతర సంబంధాలకు కారణం కాదని మానసిక వైద్యులు చెబుతున్నారు. భార్యాభర్తల మధ్య సత్సంబంధాలు లేకపోవడం.. ఒకరిపై ఒకరికి నమ్మకం లేకపోవడం.. ఒకరి మాటకు మరొకరు గౌరవం ఇవ్వకపోవడం.. సర్దుకుపోయే మనస్తత్వం లేకపోవడంతోనే భార్యాభర్తల మధ్య గొడవలు మొదలవుతున్నాయన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వారి మధ్యలోకి మూడో వ్యక్తి వస్తే మూడుముళ్ల బంధం ముక్కలై వివాహేతర సంబంధాలు ఏర్పడుతున్నాయని వివరించారు. జీవిత భాగస్వామి తనకు తగిన వ్యక్తి కాదనో ఆర్థిక స్థితిగతులో శృంగార జీవితం సరిగ్గా లేకపోవడమో ఇలా ఏదో ఒక అసంతృప్తి, అపోహ, అనుమానం, పనిచేసే చోట కొత్త ఆకర్షణ వంటి కారణాలతో కొందరు, థ్రిల్ కోసం, కొత్తదనం కోసం, కెరియర్ కోసం మరికొందరు.. ఇలా రకరకాల కారణాలతో వివాహేతర సంబంధాలు పెట్టుకుంటుండడంతో కాపురాలు కుప్పకూలి ఇలాంటి నేరాలు జరుగుతున్నాయని అంటున్నారు.
Also read: Telangana Education: పీజీఐ ర్యాంకింగ్స్‌లో దూసుకుపోయిన తెలంగాణ.. ఫలించిన సీఎం రేవంత్ వ్యూహం!
ఇలాంటి నేరాల్లో సోషల్ మీడియా ప్రభావం కూడా ఉంటోందని పోలీసు అధికారులు అంటున్నారు. గతంలో ఒక వ్యక్తికి వేరే ప్రాంతంలో ఉన్న ఇంకొకరితో పరిచయం కావాలంటే అంత సులువుగా కుదిరేది కాదన్నారు. ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ట్విటర్ వంటివి వచ్చాక పరిచయాలు ఏర్పరుచుకోవటం తేలికైందని చెప్పారు. జీవితభాగస్వామి నుంచి తాము ఆశించిన ప్రేమ, ఆప్యాయత లభించనప్పుడు..ఇలా పరిచయమైనవారు మాట్లాడే తీయటి మాటలకు పొంగిపోయి చాలామంది వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారన్నారు.
భర్తయినా, భార్య అయినా జీవిత భాగస్వామికి ఏమైనా అసంతృప్తులు ఉన్నాయా అనే విషయాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని సైకాలజిస్టులు చెబుతున్నారు. ఒకరితో మరొకరు వీలైనంత ఎక్కువసేపు గడపడానికి, ప్రేమగా మాట్లాడడానికి ప్రాధాన్యమివ్వాలని చెప్పారు. ఎదుటి వారి మనో భావాలకు విలువ ఇవ్వాలన్నారు. ఇలా చేయడం వల్ల తమకు కావాల్సిన ప్రేమ, కేరింగ్ భార్య…భర్త నుంచి దొరకడంతో.. మూడో వ్యక్తి వారి బంధంలోకి చొరబడే ప్రమాదం తగ్గుతుందని చెప్పారు. ఇలాంటి సమస్యలు వస్తే కౌన్సిలింగ్ తీసుకోవాలని సూచించారు. దీని వల్ల మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. అయినా, సమస్యలు తీరకపోతే చట్టపరంగా విడాకులు ఇచ్చి తమకు నచ్చిన వారితో కొత్త జీవితాన్ని ప్రారంభించాలన్నారు. తప్పితే హత్యలకు పాల్పడి తాము జైలుపాలై..పిల్లలను అనాధలుగా మార్చవద్దని చెప్పారు.
Also read: Driving Schools: కొత్తగా కారు డ్రైవింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా.. మీకో షాకింగ్ న్యూస్!