Yellow Alert for Hyderabad: భానుడి భగభగల నుంచి భాగ్యనగర వాసులకు ఉపశమనం లభించింది. శనివారం నగరమంతా చల్లబడి.. వర్షం కురవడంతో మండుటెండలతో అల్లాడిపోయిన ప్రజలు కాస్త సేదతీరారు. కానీ.. ట్రాఫిక్ కష్టాలు మాత్రం తప్పలేదు. ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో.. యథావిధిగానే రోడ్లు జలమయమయ్యాయి. వాహనాలు గంటలతరబడి ట్రాఫిక్ లో చిక్కుకున్నాయి. కొన్నిప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్ తీగలపై పడటం, విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో.. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో.. రాష్ట్రంలో మరో రెండ్రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్ కు ఎల్లో అలర్ట్, మరో 13 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశాలున్నట్లు వెల్లడించారు.
Also Read: హైదరాబాద్ లో భారీ వర్షం.. నిలిచిన విద్యుత్ సరఫరా!
శనివారం నగరంలోని గచ్చిబౌలిలో అత్యధికంగా 2.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రాజేంద్రనగర్, శివరాంపల్లిలో 2.2 సెంటీమీటర్లు, కిషన్ బాగ్, షేక్ పేటలో 2 సెంటీమీటర్లు, చాంద్రాయణగుట్ట, బహదూర్ పురలో 1.6, ఖైరతాబాద్, ఫిలింనగర్ లలో 1.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.