బర్త్ డే పార్టీ అంటే ఎలా ఉంటుంది. మిడిల్ క్లాస్ పిల్లలు తమ ఇంట్లోనే కేక్ కట్ చేసుకుని ఫ్రెండ్స్ కి విందు ఇస్తుంటారు. కాస్త హై క్లాస్ వాళ్లు పబ్బుల్లోనో, గెస్ట్ హౌస్ ల లోనో ఫ్రెండ్స్ కి పార్టీ ఇస్తుంటారు. అయితే ఇటీవల ఈ బర్త్ డే పార్టీలు రోడ్లెక్కేస్తున్నాయి. నడిరోడ్డులో కేక్ కటింగ్ అనేది కొత్త ట్రెండ్ గా మారింది. ఇక ఆ సమయంలో రోడ్డు బ్లాక్ చేయడం, అడ్డంగా బైక్ లు పెట్టి హంగామా చేయడం, పాల ప్యాకెట్లు, పెరుగు ప్యాకెట్లతో బర్త్ డే బాయ్ ని ముంచేయడం, కేక్ లు తినకుండా మొహానికి రాసుకుని ఎంజాయ్ చేయడం.. ఇలా రకరకాల వ్యవహారాలుంటాయి. ఇలాంటి అతి వల్ల వారికి లభించే ఆనందం ఏంటో తెలియదు కానీ, దీనివల్ల ఆసమయంలో రోడ్లపై వెళ్లేవారు భయభ్రాంతులకు గురవుతుంటారు. మీకు కూడా ఇలానే బర్త్ డే పార్టీలు చేసుకునే అలవాటు ఉందా..? అయితే ఈ స్టోరీ మీ కోసమే.
అర్ధరాత్రి రోడ్ల పై బర్త్ డే లు చేసుకుంటున్న కొంతమంది యువకులను హైదరాబాద్ పోలీసులు అడ్డుకున్నారు. నడిరోడ్డుపై బర్త్ డే పార్టీలు చేయడం చట్ట విరుద్ధం అని చెప్పారు. ఉప్పల్ ప్రాంతంలో అర్ధరాత్రి కొంతమంది యువకులు రోడ్డుపై బర్త్ డే పార్టీ చేసుకుంటుండగా పోలీసులు అక్కడికి వచ్చారు. అప్పటికే బర్త్ డే బాయ్ మెడలో మాల వేసి ఉన్నారు. అతడి నెత్తిన కిరీటం పెట్టారు. బైక్ పై కేక్ ఉంది, కట్ చేయడానికి రెడీ అయ్యారు. అంతలో పోలీసులు రాగానే వారు భయపడ్డారు. ఇలా నడిరోడ్డులో బర్త్ డే చేసుకోవడం సరికాదని వారికి హితవు చెప్పారు అధికారులు. వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు. పబ్లిక్ కి ఇబ్బంది కలిగించేలా రోడ్లను బ్లాక్ చేయడం సరికాదన్నారు. పోలీసులు వారిని ఎక్కడా ఇబ్బంది పెట్టలేదు, కొట్టలేదు. వారు చేసిన తప్పుని ఎత్తి చూపిస్తూ పోలీస్ స్టేషన్ కి రావాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు.
అర్ధరాత్రి రోడ్ల పై జన్మదిన వేడుకలు
బుద్ధి చెప్పిన రక్షక భటులు
ఉప్పల్ ప్రాంతంలో అర్ధరాత్రి పోలీసులు రెక్కీ pic.twitter.com/BEUTLUOvmT
— TolakariTimes (@TolakariTimes) May 31, 2025
బర్త్ డే గిఫ్ట్..
బర్త్ డే సెలబ్రేట్ చేసుకోవాలనుకున్న ఆ బర్త్ డే బాయ్ పోలీసులు ఇచ్చిన బర్త్ డే గిఫ్ట్ తో షాకయ్యాడు. పాపం వారంతా ఆ పక్కనే ఉన్న షాపులో పనిచేసేవాళ్లట. ఆ షాపు యాజమాన్యంతో కూడా మాట్లాడతామంటూ పోలీసులు చెప్పేసరికి వారంతా భయపడ్డారు. తప్పు చేశాం, క్షమించాలంటూ వేడుకున్నారు. ఇంకెప్పుడూ ఇలా చేయబోమని మాటిచ్చారు.
సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియో కింద కామెంట్లు చూస్తే కాస్త ఆశ్చర్యం కలిగిస్తుంది. కొంతమంది పోలీసుల చర్యను సమర్థిస్తే, మరికొందరు వారు చేసిన తప్పేంటి అని ప్రశ్నిస్తున్నారు. ఈ రాష్ట్రంలో అన్ని సమస్యలను పరిష్కరించేసిన పోలీసులు చివరికి రోడ్లపై బర్త్ డేలను అడ్డుకుంటున్నారంటూ కొంతమంది వెటకారం చేశారు. మర్డర్లు, మానభంగాలు చేసినోళ్లని వదిలేసి, రోడ్లపై బర్త్ డేలు చేసుకునేవారి జోలికి రావడమేంటని మరికొందరు నిలదీస్తున్నారు. ఇంతకంటే పెద్ద సమస్యలు చాలా ఉన్నాయని, పోలీసులు వాటిపై ఫోకస్ పెట్టాలని అంటున్నారు.