Hydra Warning: హైదరాబాద్‌లో రోజురోజుకూ చెరువులు కనుమరుగవుతున్నాయి. ముఖ్యంగా కూల్చివేసిన భవనాల వ్యర్థాలను చాలామంది సమీపంలోని చెరువుల్లో పడేస్తున్నారు. దీంతో చెరువులు క్రమంగా తగ్గిపోతున్నాయి. ఈ నేపథ్యంలో.. బిల్డర్లు, ట్రాన్స్‌పోర్టర్లకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇక మీదట చెరువుల్లో మట్టి, నిర్మాణ వ్యర్థాలు పోస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. చెరువులపై నిరంతరం నిఘా ఉంటుందని.. మట్టి పోసినవారిని సాక్ష్యాధారాలతో పట్టుకుని వారిపై క్రిమినల్ కేసులు పెడతామని తెలిపారు.
నగరంలోని ముఖ్యమైన చెరువులు కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. గతంలో 16 ఎకరాల్లో ఉన్న అంబర్ పేట బతుకమ్మ కుంట ఇప్పుడు 4.7 ఎకరాలకు చేరింది. అలాగే తుర్క చెరువు గతంలో 52 ఎకరాల్లో ఉంటే..ఇప్పడు 40 ఎకరాలకు కుదించుకుపోయింది. అంబర్ చెరువు గతంలో 224 ఎకరాల్లో ఉండే..కానీ ఇప్పుడు ఇది 154 ఎకరాలకు తగ్గిపోయింది. ఇలా దాదాపుగా అన్ని చెరువులు కుంచించుకుపోయాయి. ఈ క్రమంలో హైడ్రా నగరంలోని 6 చెరువుల పునరుద్ధరణపై దృష్టి పెట్టింది. 59 కోట్ల రూపాయలతో అయా చెరువుల పునరుద్దరణ చేపట్టింది. ఇప్పటికే బతుకమ్మ కుంటలో 7 కోట్లతో అభివృద్ది పనులు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో రియల్ ఎస్టేట్ సంస్థలు, బిల్డర్లు, ట్రాన్స్‌పోర్టర్స్‌తో పాటు ఆయా సంఘాల ప్రతినిధులతో సమావేశమైన హైడ్రా కమిషనర్ రంగనాథ్ పలు సూచనలు చేశారు. ప్రకృతి సమతుల్యతకు చెరువుల పరిరక్షణ ఎంతో అవసరమని.. ఆ దిశగా హైడ్రా పని చేస్తోందని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. బిల్డర్లు – ట్రాన్స్‌పోర్టర్లు కలసి.. మట్టిని ఎక్కడ పోయాలో ముందుగానే ఒక అవగాహనకు రావాలని సూచించారు. అలా కాకుండా ఎవరికి వారుగా వ్యవహరించి.. మట్టిని తరలించే పని కాంట్రాక్టర్‌కు అప్పగించాం.. ఆయన ఎక్కడ పోస్తే మాకేంటి అనేట్టు బిల్డర్లు వ్యవహరిస్తే అందరిపైనా కేసులు పెడతామని హెచ్చరించారు.
ట్రాన్స్‌పోర్టు ఖర్చులు మిగులుతాయని దగ్గర్లోని చెరువుల ఒడ్డున పడేస్తామంటే వారి వాహనాలను సీజ్ చేయడమే కాకుండా.. డ్రైవర్, వాహన యజమాని, మట్టిని ఎక్కడి నుంచి తెస్తున్నారో సదరు నిర్మాణ సంస్థ యజమానిపై కూడా క్రిమినల్ కేసులు పెడతామన్నారు. శిఖం భూములలో కూడా మట్టి నింపరాదని సూచించారు. హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా అందుబాటులోకి వచ్చిందని.. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఇందులో కేసులు బుక్ అవుతాయన్నారు. చెరువుల వద్ద 24 గంటల పాటు నిఘా ఉందని పేర్కొన్నారు.
Also Read: హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం.. పేలిన ఏసీ, స్పాట్ లో 10 మంది మృతి
చెరువుల్లో మట్టి పోసి నింపుతున్నవారి సమాచారాన్ని ఇవ్వాలని నగర ప్రజలను రంగనాథ్ కోరారు. ఇందుకోసం ప్రత్యేక ఫోన్ నంబర్‌ను కేటాయించారు. హైడ్రా ట్విట్టర్ అకౌంట్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చునని పేర్కొన్నారు. అలాగే చెరువులో మట్టి పోస్తున్న లారీలు, టిప్పర్లు, ట్రాక్టర్లు, మట్టిని సర్దుతున్న జేసీబీల వీడియోలను కూడా పంపించాలని సూచించారు. కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులతో పాటు.. కళాశాలల విద్యార్థులు, స్వచ్చంద సంస్థలు ఇలా అందరూ ఈ కార్యక్రమంలో చేతులు కలపాలని రంగనాథ్ కోరారు.